ఆర్బీఐ విచ్చలవిడిగా బంగారం కొంటుంటే.. ప్రజలను ఎందుకు కొనద్దన్నారు.. మోడీ వ్యాఖ్యలకు కారణం ఇదే..

ఒకవైపు దేశ కేంద్ర బ్యాంకు టన్నుల కొద్దీ బంగారాన్ని తన ఖజానాలో నింపుకుంటుంటే, మరోవైపు ప్రధాని ప్రజలను బంగారం కొనొద్దని కోరడం వినడానికి విరుద్ధంగా అనిపిస్తుంది.;

Update: 2026-05-11 09:36 GMT

ఒకవైపు దేశ కేంద్ర బ్యాంకు టన్నుల కొద్దీ బంగారాన్ని తన ఖజానాలో నింపుకుంటుంటే, మరోవైపు ప్రధాని ప్రజలను బంగారం కొనొద్దని కోరడం వినడానికి విరుద్ధంగా అనిపిస్తుంది. ‘ప్రభుత్వానికి ఒక నీతి, మాకు ఒక నీతా?’ అని సామాన్యుడికి అనుమానం రావడం సహజమే. కానీ, దీని వెనుక ఉన్న ఆర్థిక సమీకరణాలను గమనిస్తే.. ఇది 'డబుల్ గేమ్' కాదు, దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కాపాడే ఒక 'మాస్టర్ ప్లాన్' అని అర్థం అవుతుంది.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారు కొనుగోలుదారుగా అవతరించింది. 2024లో ఏకంగా 72.60 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, విదేశీ బ్యాంకుల నుంచి మన బంగారాన్ని వెనక్కి రప్పించడం మరో ఎత్తు. అయితే, ఇదే సమయంలో ప్రజలు బంగారం కొనడాన్ని నియంత్రించాలని ప్రభుత్వం భావించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

డీ-డాలరైజేషన్ వ్యూహం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గోల్డ్ రిజర్వ్స్‌ను పెంచుకోవడం వెనుక ఉన్నవి వ్యక్తిగత అవసరాలు కావు, అవి దేశ భద్రతకు సంబంధించినవి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ఏ క్షణంలో ఏ దేశంపై ఆంక్షలు విధిస్తారో తెలియని పరిస్థితి. మన ఆస్తులను వేరే దేశాలు స్తంభింపజేయకుండా ఉండాలంటే, దేనికీ లొంగని ‘బంగారం’ అత్యుత్తమ ఆస్తి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి, మన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను 2021లో ఉన్న 5.9% నుంచి 2026 నాటికి 16.7%కి ఆర్బీఐ పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి చోట్ల దాచిన మన బంగారాన్ని దేశానికి రప్పించడం ద్వారా అత్యవసర సమయాల్లో అది మన చేతికే అందేలా వ్యూహం రచించారు. (ప్రస్తుతం 77% నిల్వలు దేశంలోనే ఉన్నాయి).

ప్రజలను మోదీ ఎందుకు అడ్డుకుంటున్నారు?

ఆర్బీఐ కొనే బంగారం దేశ కరెన్సీకి బలాన్నిస్తే.. ప్రజలు కొనే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుంది. భారత్ తన బంగారం అవసరాల్లో 90% దిగుమతి చేసుకుంటుంది. మనం బంగారం కొన్న ప్రతిసారీ మన ఖజానాలోని డాలర్లను విదేశాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజలు విపరీతంగా బంగారం కొంటే, మన డాలర్ నిల్వలు కరిగిపోతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుంది. ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ప్రజలు కొనే బంగారం బీరువాల్లో ఉండిపోతుంది తప్ప, అది దేశ ఉత్పత్తి రంగంలోకి రాదు. అందుకే ఆ పెట్టుబడిని ఇతర రంగాల వైపు మళ్లించాలని ప్రభుత్వం కోరుతోంది.

డిమాండ్ పడిపోతోంది

ప్రధాని పిలుపు, విపరీతంగా పెరిగిన ధరల ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనవరిలో 100 టన్నులుగా ఉన్న దిగుమతులు, ఏప్రిల్ నాటికి 15 టన్నులకు పడిపోవడం ఒక పెద్ద మార్పు. ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం లేదా డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు మొగ్గు చూపడం వల్ల భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గుతోంది.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులలో ఒకటిగా ఉన్నప్పటికీ, దేశీయ ఉత్పత్తి మాత్రం నామమాత్రంగానే ఉంది. దేశం ఏటా కేవలం 1.6 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, డిమాండ్ మాత్రం 700 నుండి 800 టన్నుల వరకు ఉంటోంది. ఈ భారీ వ్యత్యాసం ప్రధానంగా భారతీయులకు ఈ పసిడిపై ఉన్న సాంస్కృతిక, సామాజిక మక్కువ వల్ల ఏర్పడుతోంది. వివాహాలు, పండుగలు మరియు శుభకార్యాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక అంతస్థుకు చిహ్నంగా, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ డిమాండ్‌ తీర్చడానికి దేశం ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది, ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.

ఆర్బీఐ బంగారం కొనడం అనేది దేశం యొక్క 'అత్యవసర నిధి'ని సిద్ధం చేసుకోవడం వంటిది. కానీ ప్రజలు బంగారం కొనడం అనేది దేశం కరెన్సీ బలాన్ని తగ్గించడం వంటిది. అందుకే, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని ఇచ్చిన పిలుపును ఒక బాధ్యతగా స్వీకరించాలని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News