ద్రవిడ కోటలో ‘లెక్కల’ కుంపటి.. ఎవరి డబ్బా వారిదే! రాష్ట్ర పదేళ్ల ఆర్థిక పాలనపై ఇదీ లెక్క..

అసలు ఏఐడీఎంకే (AIADMK) నుంచి డీఎంకే (DMK) ప్రభుత్వం ముగిసే సమయానికి ఏమైందో చూస్తే.. అభివృద్ధి కంటే అప్పుల వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది.;

Update: 2026-05-11 08:52 GMT

విజయ్ సీఎం కుర్చీ ఎక్కీ ఎక్కంగానే శ్వేతపత్రం జపం వినిపిస్తోంది. నిన్నటి వరకు పగ్గాలు పట్టుకున్న వారు ‘మేమే సూపర్’ అని డబ్బా కొట్టుకుంటుంటే, కొత్తగా పీఠం ఎక్కిన విజయ్ మాత్రం ‘ఖజానా ఖాళీ.. అంతా అప్పుల కుప్ప’ అంటూ బాంబు పేల్చారు. ఒకరు ‘పదేళ్ల అరాచకాన్ని నాలుగేళ్లలో సరిచేశాం’ అంటారు, మరొకరు ‘పదేళ్లలో మేము నిర్మించిన దాన్ని మీరు పాడుచేశారు’ అని కౌంటర్ ఇస్తారు. ఈ లెక్కల గారడీలో సగటు ఓటరుకు మాత్రం తల తిరగడం ఖాయం. అసలు ఏఐడీఎంకే (AIADMK) నుంచి డీఎంకే (DMK) ప్రభుత్వం ముగిసే సమయానికి ఏమైందో చూస్తే.. అభివృద్ధి కంటే అప్పుల వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది.

ఏఐడీఎంకే దశాబ్దం..

2011 నుంచి 2021 వరకు సాగిన ఏఐడీఎంకే పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. అమ్మ క్యాంటీన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లతో ప్రజల ఇళ్లన్నీ 'అమ్మ' గుర్తులతో నిండిపోయాయి. అప్పట్లో వృద్ధి రేటు సగటున 5.2 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఊగిసలాడేది. పరిశ్రమల కంటే పంపిణీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపించినా, అప్పుల విషయంలో మాత్రం రికార్డు సృష్టించారు. 2012లో కేవలం 12 శాతంగా ఉన్న అప్పు-జీఎస్డీపీ నిష్పత్తి, 2021 నాటికి 31 శాతానికి చేరింది. అంటే, సంక్షేమ పథకాలు పెరిగిన కొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అప్పులు అలుముకున్నాయి. ఏఐడీఎంకే దిగిపోయేటప్పటికి రాష్ట్రం తలకు దాదాపు ₹5 లక్షల కోట్ల అప్పును చుట్టి వెళ్లింది.

డీఎంకే వేగం పెరిగింది.. అప్పు కూడా!

ఇక 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం, తాము 'ద్రవిడ మోడల్' పాలన చేస్తున్నామని రొమ్ము విరుచుకుంది. ఏఐడీఎంకే కంటే తాము రెట్టింపు వృద్ధి (11.19%) సాధించామని స్టాలిన్ గర్వంగా చెబుతుంటారు. అయితే, ఈ వృద్ధి వెనుక విదేశీ పెట్టుబడులు ఎన్ని వచ్చినా, అప్పుల మాత్రం తగ్గలేదు. స్టాలిన్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర అప్పు ఏకంగా ₹10 లక్షల కోట్లకు చేరుకుందని కొత్త ముఖ్యమంత్రి విజయ్ ఆరోపిస్తున్నారు. కోవిడ్ కష్టాలు, వరదలు ఉన్నా పథకాలు ఆపలేదని డీఎంకే సమర్థించుకుంటున్నా, రాష్ట్ర ఆదాయంలో 60 శాతానికి పైగా జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలకే పోతుంటే.. ఇక 'అభివృద్ధి'కి ఏం మిగులుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక విషయంలో అస్సలు తగ్గరు.. అదే 'ఉచితాల పోటీ'. ఏఐడీఎంకే మిక్సీలు ఇస్తే, డీఎంకే బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, నెలవారీ భృతి అని కొత్తగా మొదలెట్టింది. వృద్ధి రేటులో బెంగళూరుతో పోటీ పడుతూ ఐటీ, ఆటోమొబైల్ రంగాల్లో దూసుకుపోతున్నా, లోలోపల ఖజానా మాత్రం ఉచితాల సెగతో కాలిపోతోంది. ఏఐడీఎంకే హయాంలో పారిశ్రామిక వృద్ధి కొంత మందగించిందని విమర్శలు వస్తే, డీఎంకే హయాంలో అప్పులు పెరిగాయనే విమర్శలు వచ్చాయి. రెండు పార్టీలూ తాము 'బంగారు బాతు' లాంటి రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్నా, విజయ్ మాత్రం అది 'ఈకలు పీకిన బాతు' అని వైట్ పేపర్ తో నిరూపించడానికి రెడీ అవుతున్నారు.

తమిళనాడు వృద్ధి రేటును పరిశీలిస్తే..

ఏఐడీఎంకే (5.2%-6.7%) వర్సెస్ డీఎంకే (8.9%-11.2%). కాగితాల్లో డీఎంకే దూకుడుగానే ఉంది.

అప్పుల పెరుగుదల

ఏఐడీఎంకే హయాంలో సుమారు ₹5 లక్షల కోట్లు ఉంటే, డీఎంకే హయాంలో అది ₹10 లక్షల కోట్లకు చేరిందని అంచనా.

వ్యయ నియంత్రణ

ఇద్దరూ ఫెయిల్. జీతాలు, వడ్డీలకే రాష్ట్ర ఆదాయంలో 60% పైగా ఖర్చు.

పరిశ్రమలు

ఏఐడీఎంకే హయాంలో స్థిరంగా ఉన్నా, డీఎంకే హయాంలో విదేశీ పెట్టుబడులపై ఫోకస్ పెరిగింది.

మొత్తానికి తమిళనాడు ఆర్థిక పరిస్థితి చూస్తుంటే.. ‘రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చింది అదే’ అన్నట్టుంది. ప్రజలకు ఉచితాలు కావాలి, పార్టీలకు అధికారం కావాలి.. మధ్యలో అప్పులు మాత్రం తదుపరి తరం నెత్తిన పిడుగుల్లా పడుతూనే ఉంటాయి. విజయ్ గారు రిలీజ్ చేసే 'వైట్ పేపర్' లో ఎన్ని 'బ్లాక్' నిజాలు బయటపడతాయో చూడాలి!

Tags:    

Similar News