స్పీకర్ పీఠం.. డీఎంకే Vs టీవీకే, సీఎం విజయ్ కి ఫస్ట్ టెస్ట్
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది. సోమవారం అసెంబ్లీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.;
తమిళనాడు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ముఖ్యమంత్రి విజయ్ కి సవాల్ విసరనుంది. స్పీకర్ గా తన పార్టీ నేతను బరిలో దింపేందుకు విపక్షం డీఎంకే సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తుండటంతో తమిళ రాజకీయం మళ్లీ వేడెక్కుతోందని అంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నిక కావడం అంత సులువుగా జరగలేదు. ఒంటరిగా పోటీ చేయడంతో అధికారం కోసం కావాల్సిన మెజార్టీని కూడగట్టేందుకు టీవీకే నేతలు ఆపసోపాలు పడ్డారు. అయితే రాజ్యాంగ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో డీఎంకే కూటమిలోని కీలక పక్షాలు అన్నీ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తాము టీవీకేతో చేతులు కలిపినా, డీఎంకేను వదులుకునే ప్రసక్తి ఉండదని ఆయా పార్టీలు చెబుతుండటంతో స్పీకర్ ఎన్నిక విషయంలో ఆయా పార్టీలు సహకరిస్తాయా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది. సోమవారం అసెంబ్లీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో స్పీకర్ పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకున్నట్లు జరుగుతున్న ప్రచారం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. సీనియర్ నేత శక్కరపాణిని స్పీకర్ పదవికి బరిలో దించాలని డీఎంకే వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురుకానున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే పార్టీకి అసెంబ్లీలో 59 మంది సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్యతో స్పీకర్ పదవిని కైవసం చేసుకోవడం కష్టమైనప్పటికీ ప్రభుత్వానికి సవాల్ విసిరేలా డీఎంకే బరిలో దిగుతోందని అంటున్నారు.
107 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ (5)తోపాటు రెండేసి స్థానాలు ఉన్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుపై ఆధారపడింది. ఈ పార్టీలు అన్ని ఎన్నికలకు ముందు డీఎంకే కూటమిలో కొనసాగాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ భేషరతుగా టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, మిగిలిన పార్టీలు అన్నీ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అనుమతితోనే సంక్షోభ నివారణ కోసం టీవీకేకు మద్దతు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు డీఎంకే అభ్యర్థి స్పీకర్ గా పోటీ చేస్తే ఆయా పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో మరో విపక్షమైన ఏఐడీఎంకేలో చీలిక వార్తలతో ఆ పార్టీ సభ్యులు డీఎంకేతో చేతులు కలపొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారే అవకాశం ఉందని అంటున్నారు. మిగిలిన పార్టీ మద్దతు కూడగట్టుకుని తన పార్టీ నేతను స్పీకర్ గా గెలిపించుకుంటారా? లేక విపక్షాలతో రాజీ పడి స్పీకర్ పదవిని డీఎంకే కూటమికి వదిలేస్తారా? అన్నది చూడాల్సివుందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరిగితే సభలో హాజరైన వారిలో సగానికి పైగా సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుత అసెంబ్లీలో టీవీకేకి సంపూర్ణ మెజార్టీ లేకపోవడం, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పార్టీలు స్పీకర్ ఎన్నికల్లోనూ బాసటగా నిలుస్తాయా? లేదా? అన్న విషయమై స్పష్టత లేకపోవడంతో స్పీకర్ ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నిక ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ చతురతకు కూడా పరీక్ష పెడుతోందని అంటున్నారు. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేలా ఆయన ఇతర పార్టీల మద్దతు కూడగడతారా? లేక పోటీకి దిగి తన కూటమిని బలోపేతం చేసుకుంటారో చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.