విజయ్ కి మిత్రులతోనే రాజకీయ సంకటం

కానీ విజయ్ సినీ నటుడు పైగా ఆయన భావాలు వేరు అని చెబుతారు. ఆయన కూడా తన పార్టీ పేరులో తమిళం కలిపారు.;

Update: 2026-05-11 11:30 GMT

విజయ్ వెండి తెర మీద నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వారు. ఆయన సూపర్ స్టార్ ఇమేజ్ ని సినిమా రంగంలో అనుభవించి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఇక విజయ్ రాజకీయ పంధా కూడా ఇప్పటికి ఆరు దశాబ్దాలుగా ఉన్న బలమైన ద్రవిడ పార్టీలకు అవి అనుసరిస్తున్న గట్టి ద్రవిడ సిద్ధాంతాలకు ఆల్టర్నేటివ్ ఫిలాసఫీగా ఉంది. కులం మతం భాష వీటి విషయంలో విజయ్ ఉదారంగా ఉంటారని ఆయన రాజకీయం చూస్తే అర్ధం అవుతోంది. ఈనాటి యువతరం ప్రత్యేకించి జెన్ జీ అభిరుచులను విజయ్ ఇక్కడే ఒడిసిపట్టుకున్నారు. అందుకే ఆయన ఎక్కడా తన ఎన్నికల ప్రసంగాలలో కూడా కులం మతం వంటి వాటి గురించి పెద్దగా చెప్పింది లేదు. బహుశా ఈ ధోరణి నచ్చి ఆయనకు నవతరం అంతా ఓట్లు కుమ్మరించి ఉండొచ్చు.

తమిళ గీతం రచ్చ :

తమిళనాడుకు ఒక రాష్ట్ర గీతం ఉంది. తమిళ తాయ్ పేరుతో సాగే రాష్ట్ర గీతాన్ని ఏ అధికార సభలో అయినా కచ్చితంగా ముందు ఆలపిస్తారు. అయితే విజయ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదట వందే మాతరం ఆలపించారు, ఆ తరువాత జనగణమన గీతం ఆలపించి మూడవ గీతంగా తమిళ తాయ్ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. దాంతో సరిగ్గా ఇక్కడే మిత్రులైన సీపీఐ సీపీఎం, వీసీకే పార్టీలు పట్టుకున్నాయి. మూడవ గీతంగా రాష్ట్ర గీతమా అంటూ మిత్రులు గుర్రుమంటున్నారు

గతంలో కూడా వివాదం :

నిజం చెప్పాలీ అంటే స్టాలిన్ సీఎం గా ఉన్నపుడు తమిళ గీతాన్ని మొదట ఆలపించడం మీదనే నాటి గవర్నర్ రవికి అలాగే డీఎంకే ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. బడ్జెట్ సెషన్లు రెండు ఏకంగా గవర్నర్ మధ్యలో నుంచే వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ప్రచారం జరిగింది. అంత పట్టుగా కట్టుగా తమిళ గీతాన్ని వాదాన్ని ద్రవిడ సిద్ధాంతాన్ని అస్థిత్వాన్ని అక్కడి పార్టీలు అనుసరిస్తాయి. ఇక జనగణమన వందేమాత్రం జాతీయ గీతాలు అయినా తమిళులు తమ రాష్ట్రమే ఫస్ట్ అంటారు. నిజానికి తమిళనాడు కూడా దేశంలో అంతర్భాగం. ఈ విషయంలో మాత్రం వారు ఒప్పుకోరు, హిందీకి హిందూత్వకు వారు ఎపుడూ వ్యతిరేకంగానే ఉంటారు.

కొత్త ఆలోచనలతో :

కానీ విజయ్ సినీ నటుడు పైగా ఆయన భావాలు వేరు అని చెబుతారు. ఆయన కూడా తన పార్టీ పేరులో తమిళం కలిపారు. కానీ వీఎటి మీద అంతగా పట్టుబట్టి మొండిగా వ్యవహరించాలనుకునే వారు కాదని చెబుతారు. ఆయన మొదటి నుంచి చెబుతున్నట్లుగా మానవతం మన కులం మతం అన్న విధానమే అనుసరిస్తారు. ఈ క్రమంలోనే విజయ్ తన కేబినెట్ ప్రమాణ స్వీకార సందర్భంగా రాష్ట్ర గీతం మూడవ ప్లేస్ లోకి వచ్చినా అంతగా గుర్తించలేదని అంటారు. అయితే దీని మీద మిత్రులు రచ్చ చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. మరో వైపు చూస్తే విజయ్ పార్టీకి కరెక్ట్ గానే మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ కి సరిపడగానే ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రులు ఇలా ప్రతీ విషయం మీద యాగీ చేస్తూ పోతే ప్రభుత్వం తుమ్మితే ఊడే ముక్కుగా ఉంటుందా అన్న చర్చ కూడా వస్తోంది. అయితే విజయ్ కి కోట్లాది మంది పట్టం కట్టారు, దాంతో ఆయన ఆలోచనల మేరకు పాలన చేస్తారు మిత్రులు గుర్రుగా ఉన్నా కన్నెర్ర చేసినా సానుభూతి ఆయనకే వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News