బీజింగ్ కు వస్తున్న ట్రంప్.. ఆ రెండింటి కోసమే నంటూ సోషల్ మీడియాలో వైరల్..

నిన్నటి వరకు చైనాపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించి, ‘డ్రాగన్‌ను ఉతికి ఆరేస్తాం’ అన్న నాయకుడు.. ఇప్పుడు నేరుగా బీజింగ్‌లోనే ల్యాండ్ అవ్వబోతుండడం చూస్తుంటే, ప్రపంచ దౌత్యనీతిలో పెద్ద స్కెచ్ నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు.;

Update: 2026-05-11 10:42 GMT

నిన్నటి వరకు చైనాపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించి, ‘డ్రాగన్‌ను ఉతికి ఆరేస్తాం’ అన్న నాయకుడు.. ఇప్పుడు నేరుగా బీజింగ్‌లోనే ల్యాండ్ అవ్వబోతుండడం చూస్తుంటే, ప్రపంచ దౌత్యనీతిలో పెద్ద స్కెచ్ నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాగబోయే ఈ పర్యటన ఇప్పుడు గ్లోబల్ విలేజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శత్రువు ఇంటికి వెళ్లి మరీ విందు ఆరగిస్తున్నారా? లేక ఏదైనా కొత్త షరతులు విధిస్తున్నారా? అన్నది పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ పర్యటనపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ మంటలు, మరోవైపు ట్రేడ్ వార్ చలిమంటల మధ్య ట్రంప్ వేయబోయే అడుగులు ప్రపంచ భవిష్యత్తును ఎలా మారుస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

బీజింగ్ వేదికగా ఇరాన్ సెటిల్మెంట్?

ట్రంప్ బీజింగ్ పర్యటనలో ప్రధాన అజెండా ఇరాన్ - అమెరికా యుద్ధ మేఘాలను తొలగించడమేనని లీకులు అందుతున్నాయి. గతంలో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఫలించలేదు. దీంతో ఇరాన్‌తో సన్నిహితంగా ఉండే చైనాను ఒప్పించడం ద్వారా, పశ్చిమ ఆసియాలో మండుతున్న మంటలను చల్లార్చాలని ట్రంప్ యోచిస్తున్నట్లు ఊహా గానాలు వినిపిస్తున్నాయి. యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా దాని ప్రభావం పడుతుండడంతో.. చైనా ద్వారా ఒక దౌత్యపరమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన భావిస్తున్నారు.

టారిఫ్‌ల పంచాయితీ.. చైనాకు బంపర్ ఆఫర్లు!

సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం, ఈ పర్యటనలో టారిఫ్‌ల అంశం అత్యంత కీలకం కానుంది. చైనా వస్తువులపై అగ్రరాజ్యం విధిస్తున్న ఆంక్షలను సడలించేందుకు ట్రంప్ ‘భారీ ఆఫర్లను’ సిద్ధం చేసినట్లు సమాచారం. అమెరికాకు కావాల్సిన రాయితీలను చైనా ఇస్తే, ప్రతిగా ట్రేడ్ వార్‌కు ముగింపు పలకాలని ట్రంప్ చూస్తున్నారు. ‘బిజినెస్ అంటే ఇవ్వడం - తీసుకోవడం’ అని నమ్మే ట్రంప్, షీ జిన్‌పింగ్‌తో ఎలాంటి డీల్ కుదుర్చుకుంటారోనన్న భయం అమెరికాలోని హార్డ్ కోర్ రిపబ్లికన్లలో కనిపిస్తోంది. డ్రాగన్‌కు ఇచ్చే ఆ ఆఫర్లు మరీ భారీగా ఉంటే, అది అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

భారత్ రియాక్షన్.. మౌనం వెనుక ఉన్న గూఢచార్యం

ఇక ఈ పరిణామాలపై భారతదేశం స్పందన అత్యంత ఆసక్తికరంగా ఉంది. ట్రంప్ చైనా పర్యటనపై భారత్ చాలా ఆచి తూచి స్పందిస్తోంది. ‘ఇది రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక పర్యటన’ అని పైకి చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. అమెరికా-చైనా మధ్య దోస్తీ కుదిరితే, అది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాధాన్యతను తగ్గిస్తుందా..? లేదా చైనా మరింత బలపడుతుందా..? అన్న కోణంలో భారత విదేశాంగ శాఖ విశ్లేషణలు చేస్తోంది. అయితే, అధికారికంగా మాత్రం ‘ప్రపంచ శాంతి కోసం జరిగే ఏ ప్రయత్నానికైనా మా మద్దతు ఉంటుంది’ అనే క్లాసిక్ స్టేట్‌మెంట్ ఇచ్చి భారత్ తన దౌత్య హుందాతనాన్ని కాపాడుకుంది.

డ్రాగన్ కోటలో ట్రంప్ మేజిక్ పనిచేస్తుందా..?

ట్రంప్ పర్యటన అంటేనే ఒక షో మ్యాన్ షిప్. బీజింగ్ వీధుల్లో ఆయన చేసే హంగామా, షీ జిన్‌పింగ్‌తో చేసే కరచాలనం వెనుక వెయ్యి అర్థాలు ఉంటాయి. అయితే, చైనా అంత సులభంగా అమెరికా అగ్రిమెంట్లకు తలొగ్గుతుందా? అన్నది ప్రస్తుతం సందేహం. ఒకవైపు తైవాన్ ఇష్యూ, మరోవైపు టెక్నాలజీ వార్ నడుస్తుండగా.. కేవలం 3 రోజుల పర్యటనతో అన్నీ మారిపోతాయని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ, ట్రంప్ లాంటి అన్ ప్రిడిక్టబుల్ నేత ఏ క్షణాన ఎలాంటి బాంబు పేలుస్తారో ఎవరూ చెప్పలేరు.

మొత్తానికి, డ్రాగన్ కోటలో ట్రంప్ వేసే అడుగులు ‘శాంతి’ని తెస్తాయో లేక ‘సంక్షోభాన్ని’ పెంచుతాయో తెలియాలంటే మే 15 వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ మీమ్స్, చర్చలు ఆగవు!

Tags:    

Similar News