హిట్లర్ మాట.. రేవంత్ ను భారీ డ్యామేజ్ చేసిందా?
ఈ రెండు పదాల మధ్య అక్షరాల తూకానికి.. ఆ పదాలకు వచ్చే అర్థం చాలా ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగం ఏదైనా.. కొన్ని మాటలు నిషిద్ధమన్నట్లుగా ఉంటాయి
ఆత్మవిశ్వాసానికి.. అతి విశ్వాసానికి మధ్య తేడా చాలా ఎక్కువ. ఈ రెండు పదాల మధ్య అక్షరాల తూకానికి.. ఆ పదాలకు వచ్చే అర్థం చాలా ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగం ఏదైనా.. కొన్ని మాటలు నిషిద్ధమన్నట్లుగా ఉంటాయి. ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. కొన్ని పదాల్ని ప్రయోగించటం లేని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లే. నిజానికి.. సదరు పదంతో వచ్చే ప్రయోజనం కంటే జరిగే డ్యామేజ్ ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు అలాంటి తప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేశారని చెప్పాలి. బెంగళూరులో జరిగిన ఒక కాన్ క్లేవ్ లో పాల్గొన్న సీఎం రేవంత్.. తాను ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ గురించి చెప్పుకునే క్రమంలో హిట్లర్ మాటను వాడటం తెలిసిందే.
దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచ చరిత్రలో ‘హిట్లర్’ ను నెగిటివ్ తప్పించి.. పాజిటిల్ గా తీసుకునే వారు.. పరిస్థితులు లేవు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే.. అంతకు మించిన వ్రధా ప్రయాస మరొకటి ఉండదు. ఎంతటి ఉక్కు సంకల్పం అవసరమని చెప్పినా.. అవేవీ హిట్లర్ పదాన్ని వాడేందుకు వీలుగా ఉండవన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందునా.. జాతీయ మీడియా మొత్తం ఫోకస్ చేసే వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఉండాలి.
పార్టీ అధినాయకత్వం వద్ద ఎన్ని మంచి మార్కులు ఉన్నా.. ఇలాంటి తప్పులు వరుస పెట్టి చేస్తే.. ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం ఆవిరి అవుతుందన్న విషయాన్ని రేవంత్ మర్చిపోకూడదు. ఇటుక.. ఇటుక పేర్చినట్లుగా తన పొలిటికల్ కెరీర్ ను నిర్మించుకున్న రేవంత్.. ఇటీవల కాలంలో తనను తాను విపరీతంగా డ్యామేజ్ చేసుకున్న సందర్భం ఏమైనా ఉందంటే అది హిట్లర్ మాట ఆయన నోటి నుంచి రావటమే.
ప్రపంచ చరిత్రలో అత్యంత కిరాతకంగా వ్యవహరించి.. లక్షల మంది అమాయకుల్ని తన మూర్ఖత్వం అత్యంత దారుణంగా చంపేసిన రక్తపిపాసిని.. పాజిటివ్ గా ప్రస్తావించాలన్న ఆలోచనే తప్పుగా చెప్పాలి. అయితే.. తాను వాడిన హిట్లర్ పదంతో తనకు జరుగుతున్న డ్యామేజ్ ను గుర్తించిన సీఎం రేవంత్.. వివాదాలకు సాధారణంగా దూరంగా ఉండే తన మంత్రివర్గ సహచరుడు.. మంత్రి శ్రీధర్ బాబునురంగంలోకి దించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ నోటి నుంచి వచ్చిన హిట్లర్ మాటకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో చిరంజీవి హీరోగా హిట్లర్ పేరుతో సినిమా వచ్చిందని.. కానీ ఆ సినిమా ప్రధాన ఉద్దేశం వేరన్న ఆయన.. సీఎం రేవంత్ మనసులో ఉన్నది వేరన్నట్లుగా వివరించే ప్రయత్నం చేశారు. హిట్లర్ మాటను సీఎం వాడకం వెనుక.. హైడ్రా విషయంలో ఎంతటి కమిట్ మెంట్ తో ఉన్నామన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా ఆయన చెబుతున్నా... రేవంత్ నోటి నుంచి వచ్చిన హిట్లర్ మాట... దాని సందర్భం.. ఆ టైంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే.. శ్రీధర్ బాబు ఇస్తున్న జస్టిఫికేషన్ ఏ మాత్రం సూట్ కాని పరిస్థితి.
ఇటీవల కాలంలో తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న రేవంత్.. ఆ ఉత్సాహాన్ని అలానే ఉంచుకోవాలే తప్పించి.. దాన్ని అత్యుత్సాహంగా మార్చకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తొందరపాటుతో అనే చిన్న మాటలు సైతం భారీగా డ్యామేజ్ చేస్తాయన్న విషయాన్ని ఆయన సన్నిహితులు ఆయనకు వివరించాల్సిన అవసరం ఉందన్న మాట వినినిస్తోంది. రేవంత్ నోటి నుంచి వచ్చిన హిట్లర్ మాటను కవర్ చేసేందుకు పడుతున్న ప్రయాస చూసిన తర్వాత అయినా.. తన నోటినుంచి వచ్చే మాటలు.. తాను పోల్చే పోలికల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని రేవంత్ గుర్తిస్తే మంచిది.