ముగ్గురు ఇన్ ముగ్గురు అవుట్ ....జూబ్లీ ఎన్నిక తరువాత భారీ మార్పులు ?
తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.;
తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడెన్ గా అజారుద్దీన్ మంత్రి అయిపోయారు. ఏ సభలోనూ సభ్యుడు కానీ అజరుద్దీన్ కి మినిస్టర్ యోగం పట్టడం వెనక హై కమాండ్ ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు కూడా హైకమాండ్ మరో ప్రయోగానికి తెర తీస్తోంది అని అంటున్నారు మంత్రుల పనితీరుని అంచనా వేయడంతో పాటు విమర్శలు ఆరోపణలు ఉన్న వారి విషయంలో ఒకింత సీరియస్ గా ఉండే చాన్స్ ఉందిట. అలాగే మరికొందరికి అవకాశం ఇవ్వడం ద్వారా రెండేళ్ళు పూర్తి చేసుకోబోతున్న రేవంత్ కేబినెట్ కి కొత్త రూపు ఇవ్వాలని భావిస్తోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
ఇన్ అయ్యేది ఆమె :
విజయశాంతి తెలంగాణా కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఉన్నారు. ఆమె ఎమ్మెల్సీగా కూడా ఆ మధ్య నామినేట్ చేయబడ్డారు. అది అనూహ్యమైన నిర్ణయం. హైకమాండ్ ఆమె పేరు చేర్చింది అన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ హైకమాండ్ ఆశీస్సులు ఆమెకు నిండుగా ఉన్నాయని చెబుతున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ గా ఆమె సేవలను వాడుకోవాలని హైకమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఆమె సినీ గ్లామర్ పాపులారిటీ కూడా కాంగ్రెస్ ని మరింతగా పెంచేందుకు దోహదపడతాయని భావిస్తున్నారుట. దాంతో ఆమె పేరు అయితే కొత్త మంత్రుల జాబితాలో గట్టిగా వినిపిస్తోంది అని అంటున్నారు.
ఆయనకూ చాన్స్ :
అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌండ్ కి సైతం మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఆయన కీలకమైన బీసీ నేతగా ఉన్నారు. ఇదే తీరున బాలూ నాయక్ కి సైతం బెర్త్ దక్కవచ్చునని అంటున్నారు. మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఈ ముగ్గురినీ కొత్తగా తీసుకుంటారని అంటున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వారిలో ముగ్గురి మీద వేటు తప్పదని అంటున్నారు.
పొన్నం సురేఖ కోమటిరెడ్డి అవుట్ :
బీసీ మంత్రులుగా ఉన్న ఇద్దరు కీలక నేతలకు పదవీ గండం ఉందని అంటున్నారు. వారిలో పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో పొన్నం కి పీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తే సురేఖను పూర్తిగా పక్కన పెడతారు అని అంటున్నారు. అలాగే నల్గొండకు చెందిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీద వేటు పడుతుందని అంటున్నారు. అంటే ముగ్గురు ఇన్ ముగ్గురు అవుట్ అన్న మాట.
ప్రభుత్వం ఫోకస్ పెరగాలి :
రెండేళ్ళకు దగ్గర పడుతున్న కాంగ్రెస్ మంత్రి వర్గంలో సరైన కో ఆర్డినేషన్ లేదని అలాగే శాఖల విషయంలో చాలా మంది మంత్రులు తన పనితీరుని చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో అనేక మంది మంత్రుల శాఖల్లో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను రానున్న కాలంలో భర్తీ చేసే విధంగా హైకమాండ్ భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది అని అంటున్నారు. ఈ ప్రచారం అంతా ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కధనం మేరకు సాగుతోంది అంటున్నారు.