రేవంత్ తెలివే తెలివి.. బాబు భేటీలోనూ భట్టినే హైలెట్ చేశారుగా!
ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వారు.. తాను కాకుండా తన సహచర మంత్రివర్గ సభ్యుల్ని హైలెట్ చేసే కార్యక్రమానికి పెద్దగా ఇష్టపడరు.;
ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వారు.. తాను కాకుండా తన సహచర మంత్రివర్గ సభ్యుల్ని హైలెట్ చేసే కార్యక్రమానికి పెద్దగా ఇష్టపడరు. ఈ అంశంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూటు సపరేటుగా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన తీరు చూస్తే.. కార్యక్రమం ఏదైనా కానీ.. తనను తాను ఎక్కువ ఫోకస్ అయ్యేలా చేసుకునే కన్నా.. ప్రభుత్వంలో కీలకమైన కొందరి నేతలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.
మిగిలిన వారి కంటే కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు ఆయన పెద్దపీట వేస్తుంటారు. అది అవార్డుల కార్యక్రమం కావొచ్చు. మరొకటి కావొచ్చు. ఆయనతో కలిసి పాల్గొనే కార్యక్రమం ఏదైనా సరే.. తానే చొరవ తీసుకొని భట్టికి అధిక ప్రాధాన్యం దక్కేలా చేయటం కనిపిస్తుంది. ఈ తీరును చూసిన వారంతా విస్మయానికి గురవుతుంటారు. అందునా.. రేవంత్ మైండ్ సెట్ తెలిసిన వారికి అయితే.. ఈ తీరు ఒక పట్టాన మింగుడుపడదు.
అయితే.. ముఖ్యమంత్రిగా రేవంత్ విపరీతమైన పరిణితిని సాధించారని కొందరంటే.. మరికొందరు మాత్రం కాంగ్రెస్ కల్చర్ ను బాగా అవపోసన పట్టినట్లుగా వ్యాఖ్యానిస్తారు. ఢిల్లీ వేదికగా రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగటం.. వివిధ ప్రాజెక్టుల అంశంపై కలిసి కూర్చొని మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. తనతో పాటు డిప్యూటీ సీఎం మొదలు పలువురు మంత్రుల్ని తన వెంట భేటీకి తీసుకెళ్లగా.. సీఎం చంద్రబాబు మాత్రం తమ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ ను వెంట బెట్టుకొని రాలేదు. ఆ విషయాన్ని అలా వదిలేసినా.. తాజా భేటీలో భట్టిని హైలెట్ చేసేందుకు సీఎం రేవంత్ చేసిన ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తర్వాత ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించేందుకు ఉప ముఖ్యమంత్రి భ్టటి విక్రమార్క చేత ఇప్పించటం.. తాను వారి మధ్యలో ఉండటం చేశారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు హైలెట్ అవుతారు. వారిచుట్టూనే వ్యవహారం నడుస్తుంటుంది. అందుకు భిన్నంగా డిప్యూటీ సీఎం భట్టిని హైలెట్ చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నాలు అందరికి కొట్టొచ్చినట్లుగా కనిపించటం చూస్తే.. రేవంత్ తెలివే తెలివి అన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపించాయి.