వావ్ సీఎం రేవంత్.. ఒక్క స్పీచ్ తో ప్రపంచం తనవైపు చూసేలా చేశారు
రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను బూతల సీఎంగా అభివర్ణిస్తుంటారు. పోట్టోడు అంటూ గేలి చేసే ప్రయత్నం చేస్తారు.;
రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను బూతల సీఎంగా అభివర్ణిస్తుంటారు. పోట్టోడు అంటూ గేలి చేసే ప్రయత్నం చేస్తారు. ఆయన మేనేజ్ మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎక్కెసం చేస్తారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? రేవంత్ కు ఆ స్టేచర్ లేదంటూ దెప్పి పొడిచే ప్రయత్నం చేశారు. ఇలా.. ఆయన్ను గేలి చేయటం.. చిన్నచూపు చూడటం.. తక్కువగా అంచనా వేయటం లాంటివి తరచూ చేస్తుంటారు. ఆయన పెద్దగా చదువుకోలేదని.. ముఖ్యమంత్రికి ఉండాల్సిన విజన్ లేదన్నట్లుగా ఆయన తీరు ఉందని విమర్శలు చేస్తుంటారు. అయితే.. ముద్రల్ని తన ఒక్క స్పీచ్ తో మటు మాయం అయ్యేలా చేయటమే కాదు.. ప్రపంచ టెక్ దిగ్గజాలు మొదలు ప్రధాని నరేంద్ర మోడీ వరకు అందరూ తనవైపు చూసేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చేసిన పదకొండు నిమిషాల స్పీచ్ చారిత్రకంగా అభివర్ణించాలి. టెక్ ప్రపంచంపై ఒక రాజకీయ నాయకుడికి ఇంతటి స్పష్టత ఉందా? పాలనాపరంగా చేపట్టాల్సిన అంశాలపై రేవంత్ విజన్ మ్యాప్ అందరిని ఆకట్టుకోవటమే కాదు.. తన ప్రసంగంతో హైదరాబాద్ ఇమేజ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా చేశారని చెప్పాలి. అందరిని అంతలా ఆకట్టుకునే అంశాలు సీఎం రేవంత్ ప్రసంగంలో ఏం ఉన్నాయి? అన్నది చూస్తే.. పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఏఐ విషయంలో పాలకులకు ఉండాల్సిన విజన్ మాత్రమే కాదు.. ప్రభుత్వాలు తక్షణం చేపట్టాల్సిన అంశాల్నిఆయన చెప్పినట్లైంది. అన్నింటికి మించి చక్కటి ఇంగ్లిషులో ఆయన చేసిన ప్రసంగం ఒక ఎత్తు అయితే.. స్పీచ్ లో ఉన్న కంటెంట్ కు టెక్ ప్రపంచం ఫిదా అయ్యేలా చేశారని చెప్పాలి. సీఎం రేవంత్ ప్రసంగంలోని అంశాల్ని ఆయన మాటల్లోనే చెబితే..
- తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్ పవర్ హౌస్‌గా మారాలి. కేంద్రంలో ఏఐ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం.
- ఈ రంగంపై చర్చలు.. భాగస్వామ్యాల కోసం అందర్నీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. రాష్ట్రంలో పని చేయటానికి ముందుకు రావాలని జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని కోరుతున్నా. ఈ రంగంలో కలిసి పని చేసేందుకు వీలుగా జీఎస్టీ కౌన్సిల్.. నీతి ఆయోగ్ తరహాలో ఏఐపై నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.
- మానవజాతి సాధించిన అత్యున్నత ఆవిష్కరణ కృత్రిమ మేధ. గతంలో నిప్పును కనుగొన్నప్పుడు.. చక్రాన్ని ఆవిష్కరించినప్పుడు.. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ప్రపంచం ఎలాంటి పెను మార్పులకు లోనైందో.. ఇప్పుడు ఏఐ వల్ల కూడా అలాంటి పరివర్తనాత్మక క్షణాలను మనం చూస్తున్నాం.
- విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతే. ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదు.
- గతంలోని ఆవిష్కరణలు మనిషి శారీరక శ్రమను తగ్గిస్తే, ఏఐ నేరుగా మనిషి మేధస్సుకే సవాల్ విసురుతోంది. స్వయం ప్రతిపత్తి, నిర్ణయాధికారం కలిగిన ఏఐ.. రోబోటిక్స్‌కు తోడైతే అద్భుతాలు సృష్టిస్తుంది.
- ఏఐతో పోటీ పడటంలో ప్రపంచం ఇప్పటికే బిజీ అయిపోయింది. కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయి. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాల తరహాలో.. ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదు. సాఫ్ట్ వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాల్సి ఉంది.
- సాఫ్ట్ వేర్ రంగంలో మనం సర్వీసులను అందించినా ప్రపంచ స్థాయి ఉత్పత్తులనుతయారు చేయలేకపోయాం. గూగుల్ సెర్చ్.. గూగుల్ మ్యాప్స్.. ఎక్స్.. ఫేస్ బుక్.. యూట్యూబ్.. వాట్సప్ లను భారతీయులు ఉపయోగిస్తున్నా.. ఆ కంపెనీల్లో మనవాళ్లుపని చేస్తున్నా.. అవి మన సొంతం మాత్రం కాదు. వాటిని మనం క్రియేట్ చేయలేదు.
- ఏ దేశమైనా ప్రపంచ గమనాన్ని నిర్దేశించటానికి వినియోగం - ఉత్పత్తి అన్న రెండే దారులు ఉన్నాయి. ఏఐతో మనం ఆ రెండూ చేయొచ్చు.కాబట్టి ఆ రంగంలో భారత్ లీడర్ గా ఎదగాలి. చిప్స్.. గ్రీన్ ఎనర్జీ.. డేటా స్టోరేజ్.. ప్లాట్ ఫామ్స్.. అప్లికేషన్లు.. సర్వీసుల్లో ప్రపంచంలో తొలి మూడు స్థానాల్లో నిలిచేందుకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను తయారు చేసుకోవాలి.
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. సెమీ కండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలి. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూం నిర్వహించేందుకు తెలంగాణ సిద్థంగా ఉంది.
- ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని భారత్‌లో స్థాపించాలి. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై నెలకొంటున్న ఆందోళనల నేపథ్యంలో.. కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యలు.. ఏఐతో సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయి. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలి. స్టార్ట్‌పలకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలి.
- దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నా.
- ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలి. బాధ్యతాయుతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలి. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదే.
రేవంత్ ఇమేజ్ ఇప్పుడు సీఎంకు మించి.. గ్లోబల్ టెక్ విజనరీ!
కొన్నిసార్లు అద్భుతాలు సాదాసీదాగా షురూ అవుతాయి. ఇప్పుడు అలాంటిదే ఒక దేశ రాజకీయ రంగంలో చోటు చేసుకుంది. జాతీయ.. అంతర్జాతీయ దిగ్గజాలు ఉన్న వేదిక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రసంగించేందుకు పదకొండు నిమిషాల సమయం లభించింది. ఆయన ప్రసంగించే సమయంలో.. ఆ వేదిక వద్ద ఉండి.. ఆయన మాటల్ని విన్న రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు టెక్ దిగ్గజాల జాబితాను చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. తనకు లభించిన సమయాన్ని అద్భుతంగా వినియోగించుకున్న రేవంత్ ను ఇప్పుడు సాదాసీదా ముఖ్యమంత్రిగా చూసే పరిస్థితి లేదు. ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన గ్లోబల్ టెక్ విజనరీ.
ఈ మాటకు తగ్గట్లే ఆయన ఏఐ సమ్మిట్ ప్రసంగం ఉండటంతోపాటు.. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆయన ప్రసంగం అనంతరం చప్పట్లతో అభినందించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ అందరి కంట్లో పడటమే కాదు.. ఆయనతో పలువురు మాట్లాడే ప్రయత్నం చేయటం కనిపించింది. ఇంతకూ రేవంత్ స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో చూస్తే.. ఆయన ప్రసంగం ఎంత మందిని ఆయన వైపు చూసేలా.. ఆయన గురించి తెలుసుకునేలా చేసిందో అర్థమవుతుంది. ఇంతకూ సీఎం రేవంత్ స్పీచ్ ఇచ్చే వేళలో అక్కడ ఎవరెవరు ఉన్నారన్న వివరాల్ని చూస్తే..
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
- బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా
- భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే
- గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్
- నెదర్లాండ్స్ ప్రధాని డిక్ షూఫ్
- ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పొ
- ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్
- స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని
- స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్
- యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కజకిస్థాన్ ప్రధాని ఒల్జాస్ బెక్టెనోవ్
- మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలం
- సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్
- ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్
- పలువురు కేంద్ర మంత్రులు
- మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
- అస్సాం ముఖ్యమంత్రి హిమంతు బిశ్వశర్మ
టెక్ దిగ్గజాలు
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
- ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్
- మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్
- అడోబ్ సీఈఓ శంతను నారాయణ్
- ఎన్విడియా ప్రతినిధులు
- ముఖేశ్ అంబానీ
- టాటా సన్స్ నటరాజన్ చంద్రశేఖరన్
- సునీల్ భారతి మిట్టల్
- నందన్ నిలేకని
- ఇన్పోసిస్ సీఈవో సలీల్ పరేఖ్
- హెచ్ సీఎల్ టెక్ ఛైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా
- హెచ్ సీఎల్ టెక్ సీఈవో సి విజయకుమార్
- సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి
- జోహో కార్పొరేషన్ కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు
- పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఆనంద్ దేశ్ పాండే
- జయ్ చౌదరి
తెలుగు మీడియా కవరేజ్ ఇలానా? సీఎం రేవంత్ స్పీచ్ తర్వాత భారీ మిస్!
జాతీయ మీడియాకు ముఖ్యమైనది కాకపోవచ్చు. కానీ.. ప్రాంతీయ మీడియాకు కీలకమైన అంశాల్ని ప్రధాన మీడియా సంస్థలు మిస్ కావటం చూసినప్పుడు.. కొన్ని కీలక అంశాలకు అసలు ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది. మీడియా సంస్థల ప్రాధాన్యతలు.. ప్రయార్టీలను చూసుకున్నా.. స్థానిక అంశాలకు పెద్దపీట వేయాలి కదా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే.. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఒక చారిత్రక స్పీచ్ కు ఒక మోస్తరు ప్రాధాన్యతను ఇవ్వటం మినహా.. దానికి సంబంధించి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని కవర్ చేసే విషయంలో ప్రదర్శించిన తీరు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
నోరు తెరిస్తే చాలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తిట్టే తిట్లకు ఎంత టోడైనా బెదిరిపోవాల్సిందేనని.. ఆయన నోట్లో నానకుండా ఉండాలన్నట్లుగా కొందరు భావిస్తారు. తమకు తాము రేవంత్ కంటే మెరుగైన నేతలమని భావించే ప్రత్యర్థులకు తప్పు వదిలేలా.. తిట్ల దండకాన్ని అందుకునే తీరుకు జడవాల్సిందే. అలాంటి రేవంత్ లో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. ఒక అంతర్జాతీయ సమ్మిట్ లో ప్రసంగించటం ఒక ఎత్తు అయితే.. టైమ్లీగా మాట్లాడటం.. అందరి చూపు తన మీద పడేలా చేయటం మామూలు విషయం కాదు.
అందుకు నిదర్శనంగా ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చెప్పాలి. తనకు ఇచ్చిన పదకొండు నిమిషాల సమయాన్ని అద్భుతంగా వినియోగించుకున్న రేవంత్.. ఏఐపై విజన్ ఎలా ఉండాలి? పాలసీ పరంగా ప్రభుత్వాలుఏం చేయాలి? భారతదేశం ఏం చేస్తే బాగుంటుంది? లాంటి ప్రశ్నల్ని సంధించకుండా.. స్పష్టమైన సూచనలు చేయటం విశేషం. ఆయన ప్రసంగంలోని స్పష్టత జాతీయ, అంతర్జాతీయ అధినేతలతో పాటు.. టెక్ ప్రపంచంలో దిగ్గజాలు అనే వారిని సైతం సీఎం రేవంత్ వైపు చూసేలా చేశాయి. అందుకు తగ్గట్లే.. సీఎం రేవంత్ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చప్పట్లు కొట్టటం మాత్రమే కాదు.. అభినందన పూర్వకంగా వ్యవహరిచటం హైలెట్ గా చెప్పాలి.
అంతేనా.. సీఎం రేవంత్ ప్రసంగం తర్వాత ఆయన్ను తన పక్క కూర్చీలో కూర్చోబెట్టుకొని మాట్లాడటం.. పలు అంశాల్ని చర్చించటం.. కార్యక్రమం జరిగిన అరగంట సేపు ఆయన పక్కన సీట్లోకూర్చెబెట్టుకోవటం లాంటివి కీలక పరిణామాలు ఎందుకు కావు? అలాంటి అంశాల్ని కవర్ చేయాల్సిన బాధ్యత జాతీయ మీడియాకు ఉండకపోవచ్చు. కానీ.. ప్రాంతీయ మీడియా.. అందునా తెలుగు మీడియా.. అదీ కాదనుకుంటే.. కనీసం తెలంగాణలోని ప్రధాన మీడియా సంస్థలైనా కవర్ చేయాలి కదా? ఆ అంశాల్ని ప్రస్తావించాలి కదా? అదేమీ చేయకుండా.. ఆయన స్పీచ్ ను యాంత్రికంగా.. సీఎంవో ఇచ్చిన పస లేని (పూర్తిగా కాకున్నా సీఎం రేవంత్ మాట్లాడినంత ఎఫెక్ట్ తరహాలో) ప్రెస్ నోట్ ను ఇచ్చేస్తే ఏం బాగుంటుంది? దేశ ప్రధాని మోడీని ఆకర్షించటంతో పాటు.. ఇతర దేశాధినేతలు సైతం సీఎం రేవంత్ ప్రసంగానికి ఫిదా అయినట్లుగా ఏఐ సమ్మిట్ లో జరిగిన పరిణామాలు ఏవీ తెలుగులోని దిగ్గజ మీడియా సంస్థల చూపు పడకపోవటం దేనికి నిదర్శనం?
సీఎం రేవంత్ 11 నిమిషాల స్పీచ్ తర్వాత కట్ చేస్తే.. ఎంతో జరిగింది!
అనవసరమైన చెత్తకు సంబంధించిన అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత.. చరిత్రగతిని.. రాష్ట్ర రూపురేఖల్ని మార్చే సందర్భాలకు మీడియా.. సోషల్ మీడియా.. జర్నలిస్టులు ఇచ్చే ప్రాధాన్యత కొన్నిసార్లు పరిమితంగా ఉంటుంది. నిజానికి జర్నలిజంలో ‘న్యూస్ నోస్’ అనే మాటను తరచూ ప్రస్తావిస్తుంటారు. మిగిలిన వారికి చురుకైన జర్నలిస్టులకు మధ్య ఉండే తేడా ఏమంటే.. ఏ అంశం అయితే ఇంపాక్ట్ (ప్రభావం) చూపిస్తుందో దాన్ని అంతే ప్రభావవంతంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది.
ఏఐ లాంటి చరిత్రగతిని తిప్పే సాంకేతిక అంశంలో భారత విజన్ ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావవంతంగా ప్రస్తావించటం.. తనకు కేటాయించిన పదకొండు నిమిషాల స్వల్ప సమయంలో అందరూ ఆలోచించేలా చెప్పటం ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగం తర్వాత కూడా తాను ప్రస్తావించిన అంశాల్ని రోడ్ మ్యాప్ తరహాలో అటు పాలసీ మేకర్లు మాత్రమే కాదు.. టెక్ దిగ్గజాలు సైతం ప్రస్తావించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సాధించిన విజయంగా చెప్పాలి.
నిజానికి ముఖ్యమంత్రి హోదాలో ఇంతకాలం సాగింది ఒక ఎత్తు అయితే.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన చేసిన ప్రసంగం తర్వాత నుంచి ఆయన్ను చూసే తీరు.. ఆయనకు లభించే గౌరవ మర్యాదల లెక్కలు మారిపోతాయని చెప్పకతప్పదు. చదివినంతనే అతిశయోక్తిగా అనిపించినా.. జరిగిన పరిణామాల్ని నిశితంగా గమనిస్తే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆయన్ను అభినందించిన తీరు ఒక ఎత్తు అయితే.. రేవంత్ రెడ్డి తనకు కేటాయించిన కుర్చీ వైపు వెళ్తుండగా.. ఆయన్ను దగ్గరకు పిలిచి కరచాలనం చేయటం.. వెన్ను తట్టి మెర్చుకోవటమే కాదు.. ఆయన్ను తన పక్కన అరగంట పాటు కూర్చోబెట్టుకున్న వైనం చూస్తే.. సీఎం రేవంత్ తన స్పీచ్ తో ఎంత ఇంపాక్ట్ చూపించారో అర్థమవుతుంది. ఆ అరగంట ఎంతో ఉత్సాహంగా ఏఐ అంశాల గురించి మాట్లాడుకోవటం కనిపించింది.
ఈ సెషన్ ముగిసిన తర్వాత హాల్లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా వంటి వారు రేవంత్ వద్దకు వచ్చి ఆయన ప్రసంగాన్నిప్రశంసించటం చూస్తే.. ఆయన సాధించిన విజయం ఎంతన్నది అర్థమవుతుంది. ఈ సదస్సు విరామ సమయంలో గూగుల్ సీఈవో.. అడోబ్ సీఈవో.. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మాన్ లు సీఎం రేవంత్ తో విడిగా మాట్లాడటం చూస్తే.. ఆయన ప్రసంగం టెక్ దిగ్గజాలకు సైతం ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థమవుతుంది.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజానికి కాంగ్రెస్ వాసన దగ్గరకు రానిచ్చేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడరు. అలాంటిది ఒక కాంగ్రెస్ సీఎం చేసిన ప్రసంగానికి ముగ్దుడు కావటమే కాదు.. లేచి నిలబడి చప్పట్లు కొట్టటం.. దగ్గరకు తీసుకొని వెన్ను తట్టటం చూస్తే.. భారత సమాఖ్య వ్యవస్థ సరైన రీతిలో నడిస్తే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ప్రధాని మోడీ నిలుస్తారు. ఈ విషయంలో రేవంత్ గొప్పతనాన్ని గుర్తించేందుకు ఆయన అస్సలు మొహమాట పడలేదు సరికదా.. తమ దేశంలో పాలసీ మేకర్లు ఎంతటి విజనరీగా ఉంటారన్న విషయాన్ని తన చేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శించారని చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ అంతర్జాతీయ ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ విందులోనూ ప్రధాని మోడీ స్వయంగా రేవంత్ ను ఇతర దేశాధినేతలకు పరిచయం చేయటం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పాలి. ఇలాంటివన్నీ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు కదా? చరిత్రలో నమోదు కావాల్సిన వాస్తవాలు కదా? వీటికి ఎలాంటి ప్రాదాన్యతను ఇవ్వకపోవటం చూస్తే.. తెలుగులోని దిగ్గజ మీడియా సంస్థలకు న్యూస్ నోస్ మిస్ అయ్యిందని చెప్పక తప్పదు. కాదంటారా?