రేవంత్ కి జూబ్లీ హిల్స్ పరీక్ష ?

తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. తానే పదేళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెప్పారు.;

Update: 2025-07-22 11:30 GMT

తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. తానే పదేళ్ళ పాటు సీఎం గా ఉంటాను అని చెప్పారు. అది కూడా 2034 అని కూడా అన్నారు. నిజానికి 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ళు అంటే 2033 కావాలి. కానీ మరో ఏడాది పెంచేసి 2034 అని ఎందుకు అన్నారో తెలియదు కానీ మొత్తానికి దశాబ్దం సీఎం తానే అని రేవంత్ రెడ్డి ధీమాగానే చెబుతున్నారు.

ఆయన అన్న దాని మీద కాంగ్రెస్ లో సీనియర్లు గుణుస్తున్నారు సణుక్కుంటున్నారు. అదంతా వేరే విషయం. ఇప్పటికి అయితే రేవంత్ రెడ్డి సీఎం గా ఏణ్ణర్ధ కాలం పూర్తి అయింది. మరో మూడున్నరేళ్ళు చేతులో ఉంది. అయితే అనుకోని ఉపద్రవంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చిపడింది. ఈ ఉప ఎన్నికలో నెగ్గాల్సి ఉంది.

ఇక్కడ చూస్తే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఆ పార్టీ ముంచి మాగంటి గోపీనాథ్ గత రెండు సార్లు నుంచి గెలుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ కి స్వతహాగానే అర్బన్ లో పట్టు ఉంది. 2023లో ఎక్కువ సీట్లు ఇక్కడ నుంచే వచ్చాయి. కాంగ్రెస్ విషయం చూసుకుంటే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అంతటి వారిని దించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఉప ఎన్నిక అంటే ఏమి చేయాలన్నది చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అంతర్గత సర్వేలు చూస్తే బీఆర్ఎస్ మీద కొంతమేర ఆధిపత్యం ఉందని అంటున్నారు. ఇక అధికార పార్టీగా అడ్వాంటేజెస్ ఎటూ ఉంటాయి. ప్రజలు సైతం మరో మూడున్నరేళ్ళ పాటు అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలే ఉంటాయని అంటున్నారు. ఇలా లెక్కలు కొంత పక్కాగా ఉన్నా కాంగ్రెస్ లో అన్ని వర్గాలు కలసి పనిచేయాల్సి ఉంది.

ఇక ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే తెలంగాణాలో వంద సీట్లను గెలిచి తీరుతామని గులాబీ పార్టీ అంటోంది. బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ ఎక్కడా గెలవదని జోస్యం చెబుతున్నారు. కసి పట్టుదలతో బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోరాడుతుంది. దాంతో కాంగ్రెస్ కి సవాల్ అయితే గట్టిగానే ఉంది అని అంటున్నారు.

టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారుట. అజారుద్దీన్ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. లక్షా ఇరవై వేల దాకా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మరో వైపు చూస్తే తెలంగాణా రాజకీయం ఇపుడు అంతా బీసీల రిజర్వేషన్ చుట్టూ తిరుగుతోంది. దాంతో బీసీల నుంచి ఒకరిని పెడితే ఎలా ఉంటుంది అన్న చర్చ నడుస్తోంది.

అయితే ముస్లిం లేకపోతే బీసీ అభ్యర్ధిగా కొత్త వారిని దించాలని చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఇక జూబ్లీ హిల్స్ సీటు విషయంలో గెలుపు కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ రంగంలోకి దిగిపోయింది. ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా జూబ్లీఎ హిల్స్ గెలిచి తీరాలని కాంగ్రెస్ ఉంది. అది కూడా భారీ మెజారిటీతో గెలిచి ప్రతిపక్షం నోరు మూయించాలని చూస్తోంది. ఈ సవాల్ కి తగిన జవాబు చెప్పి తనకు పార్టీలో ప్రభుత్వంలో ఇప్పట్లో తిరుగులేదని చెప్పాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News