డేటా సెంటర్ హబ్ గా విశాఖ.. తాజాగా రిలయన్స్ ఓకే
ఐటీ హబ్ అన్నంతనే హైదరాబాద్ గుర్తుకు వస్తుంటుంది. ఇప్పుడు విశాఖ వంతు వచ్చింది.;
ఐటీ హబ్ అన్నంతనే హైదరాబాద్ గుర్తుకు వస్తుంటుంది. ఇప్పుడు విశాఖ వంతు వచ్చింది. కాకుంటే డేటా సెంటర్ హబ్ గా ఉక్కునగరి మారనుంది. దిగ్గజ కంపెనీ గూగుల్ విశాఖలో తన మెగా డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్ననిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. అనంతరం మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ సైతం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ డిజిటల్ కనెక్షన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ గా మరో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేసింది. ఇందుకోసం విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు.
విశాఖను డేటా సెంటర్ హబ్ గా మార్చాలన్న ఏపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 6వేల మెగావాట్ల డేటా సెంటర్లను విశాఖలో ఏర్పాటు చేయాలని.. ఇవన్నీ2030 నాటికి అందుబాటులోకి రావాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టార్గెట్ కు తగ్గట్లు ఇప్పటికే గూగుల్.. బ్రూక్ షీల్డ్.. రిలయన్స ఇండస్ట్రీలు మొత్తం మూడు వేల మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓకే చెప్పేయటం తెలిసిందే. మరో మూడు సంస్థలు సైతం తమ డేటా సెంటర్లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని.. త్వరలోనే సానుకూల ఫలితాలు వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.వీటితో పాటు మరిన్ని సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. సిఫీ టెక్నాలజీస్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించటం తెలిసిందే.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకే చేసిన డేటా సెంటర్ విషయానికి వస్తే..విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్కు అనుబంధంగా విశాఖలోని డేటా సెంటర్ ను నిర్వహిస్తారు. రిలయన్స్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు ఉన్న నెట్ వర్క్లలో ఒకటి ఉంటుందని చెబుతారు. రానున్న 3 నెలల్లో డేటా సెంటర్లకు అవసరమైన ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. సాంకేతికంగా ఏపీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న చంద్రబాబు కోరిక నెరవేరుతుందని చెప్పాలి.