ఉత్తరాంధ్ర కు మరో డేటా సెంటర్...ఎక్కడంటే ?

ఉత్తరాంధ్రా ఇటీవల కాలంలో పరిశ్రమలు ప్రాజెక్టుల రాకతో మోతెక్కిపోతోంది. వరసబెట్టి అనేక ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు అన్నీ ఉత్తరాంధ్రాలో క్యూ కడుతున్నాయి.

Update: 2026-05-25 03:36 GMT

ఉత్తరాంధ్రా ఇటీవల కాలంలో పరిశ్రమలు ప్రాజెక్టుల రాకతో మోతెక్కిపోతోంది. వరసబెట్టి అనేక ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు అన్నీ ఉత్తరాంధ్రాలో క్యూ కడుతున్నాయి. ఐటీ సెక్టార్ అంతా ఉత్తరాంధ్రాలో ల్యాండ్ అవుతోంది. అలాగే అనేక ఇతర పరిశ్రమల చూపు కూడా అక్కడే ఉంది. ఉత్తరాంధ్రాలో అంతర్జాతీయ విమానాశ్రయం గా భోగాపురం ఉంది. అలాగే చుట్టు పక్కల కూడా ఒక పారిశ్రామిక వాతావరణం నిర్మాణం అవుతోంది. అతి పెద్ద సిటీగా విశాఖ ఉంది. దీంతో పెట్టుబడులు వెల్లువగా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయి.

విజయనగరంలో డేటా సెంటర్ :

ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖ జిల్లా ఆనందపురంలో ఏర్పాటు అవుతోంది. గత నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దానికి శంకుస్థాపన చేశారు. 2028 నాటికి ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేలా డెడ్ లైన్ కూడా విధించారు. ఇపుడు మరో డేటా సెంటర్ వస్తోంది. ఈసారి దీనిని విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. దాంతో నిన్నటి దాకా వెనుకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం ఇపుడు ఐటీ హంగులతో సరికొత్త కళను సంతరించుకోనుంది అని అంటున్నారు.

ఏఐ డేటా సెంటర్ గా :

విజయనగరం జిల్లాలోని పోలిపల్లి భోగాపురం తూర్పు ప్రాంతాలలో ఈ మేరకు స్థల పరిశీలన పూర్తి అయింది. ఇక్కడ దాదాపుగా 855 ఎకరాల భూములను ఈ డేటా సెంటర్ కి కేటాయింపు చేయడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంతే కాదు రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న ఈ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు విలువ అక్షరాల ఒక లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయలుగా ఉంది.

ఆ పక్కనే ఎయిర్ పోర్టు :

ఈ డేటా సెంటర్ ఇక్కడకు రావడానికి భోగాపురం ఎయిర్ పోర్టు అతి ముఖ్యమైన కారణంగా చెప్పాలి. జూలైలో ఈ ఎయిర్ పోర్టు రెడీ అవుతోంది. దాంతో ఈ చుట్టు పక్కన పరిశ్రమలు వస్తాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు నిజం అయ్యాయి.అందుకే ఈ డేటా సెంటర్ ని ఎయిర్ పోర్టు కి సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పూర్వ రంగం అయితే పూర్తి అయింది తొందరలోనే ఈ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన చేసుకుంటుంది. కేవలం ఇదే కాదు రానున్న కాలంలో ఈ జిల్లాకు అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు భారీ పరిశ్రమలు కూడా తరలి వస్తున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయనగరం జిల్లా ఇపుడు విశాఖతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది అని గట్టిగా చెప్పాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News