మోడీకి యాంటీగా మరో నేషనల్ ఫ్రంట్ ?

దేశ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి దేశంలో రాజకీయ ప్రయోగాల గురించి గుర్తుండే ఉంటుంది.;

Update: 2026-04-20 04:00 GMT

దేశ రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి దేశంలో రాజకీయ ప్రయోగాల గురించి గుర్తుండే ఉంటుంది. 1977లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీలు అన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. అలా కుడి ఎడమలు అన్నీ సిద్ధాంతాలు పక్కన పెట్టి ఒక్కటి అయ్యాయి. కుడి సిద్ధాంతాలు ఉన్న బీజేపీ ఎడమ భావజాలం ఉన్న కమ్యూనిస్టులు ఒకే వేదిక మీదకు రావడమే ఆనాటి రాజకీయ సంచలనం. అలా దేశంలో అనాటికి ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ ని అలాగే ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీని తొలిసారి ఓడించిన ఘనతను జనతా పార్టీ దక్కించుకుంది.

నేషనల్ ఫ్రంట్ తో ఢీ :

అదే విధంగా మరో పదేళ్ళు తిరిగేసరికి 1988 నాటికి నేషనల్ ఫ్రంట్ పేరుతో మరో రాజకీయ కూటమి జాతీయ స్థాయిలో ఏర్పడింది. ఇందులో కూడా కుడి ఎడమ పార్టీలు ఉన్నాయి. మధ్యే వాద పార్టీలు నాయకత్వం వహించాయి. అలా వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. ఈ రెండు ప్రయోగాలు కాంగ్రెస్ ని గద్దె దించేందుకే పనికి వచ్చాయి కానీ ఆ తరువాత అంతా కలిసి దీర్ఘ కాలం ఉండేందుకు మాత్రం ఏ విధంగానూ ఉపయోగపడలేదు.

ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే బీజేపీ లేదా వామపక్షాలు ఈ కూటములకు నాయకత్వం వహించలేదు. ఆ రోజులలో మధ్యేవాద పార్టీలు ఎక్కడికక్కడ బలంగా ఉండేవి. దాంతో అవే ముందు వరసలోకి వచ్చి కుడి ఎడమలను కూడగట్టాయి.

వారే గేమ్ చేంజర్ గా :

ఇపుడు దేశంలో మరోసారి మధ్యే వాద పార్టీలే గేమ్ చేంజర్ గా మారబోతున్నాయా అన్న చర్చ అయితే వస్తోంది. ఈ రోజున బీజేపీ దేశంలో బలంగా ఉంది. అయితే ఆ పార్టీకి ఊతమిస్తున్నవి మధ్యేవాద పార్టీలు. అవి ఏపీలో టీడీపీ జనసేన అయినా తమిళనాడులో అన్నా డీఎంకే తదితర పార్టీలు అయినా కర్ణాటకలో జేడీఎస్ అయినా బీహార్ లో జేడీయూ అయినా లేదా మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ అయినా కూడా ఇవన్నీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేతో కలసి ప్రయాణిస్తున్నాయి. బీజేపీ కూడా మధ్యే వాద పార్టీల బలాన్ని గుర్తించి వారితో దోస్తీ చేస్తూ అధికారానికి దగ్గర అయింది. ఇది 1999 ఎన్నికల నుంచి మొదలైంది. ఆ దూరదృష్టి వాజ్ పేయి అద్వానీలది అయితే దానిని నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు.

అసంతృప్తిగా ఉన్నారా :

అయితే వాజ్ పేయి హయాంలో మధ్యేవాద పార్టీలకు ఎంతో విలువ గౌరవం స్వేచ్చ ఎన్డీయేలో లభించేవి అన్న చర్చ కూడా ఉంది. ఆనాడు అనేక కీలక నిర్ణయాలలో జాతీయ స్థాయిలో జరిగే పరిణామాల విషయంలో టీడీపీ లాంటి పార్టీల పాత్ర ఎంతో ఎక్కువగా ఉండేది. అలాగే చంద్రబాబు నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటి వారు వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో కీలక భాగస్వాములుగా ఉండేవారు. బాబు అయితే ఏకంగా ఎన్డీయే కన్వీనర్ గా పనిచేశారు. ఇవన్నీ గతం అయితే తరువాత కాలంలో కాంగ్రెస్ కూడా యూపీయే పేరుతో కూటమిని ఏర్పాటు చేసి వామపక్షాలను మరి కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి రెండు శిబిరాలుగా ఉన్నాయి. ఇందులో బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా విడిగా బలమైన పెద్ద పార్టీలు అయినప్పటికీ కేంద్రంలో సొంతంగా అధికారం సంపాదించే స్థాయిలో ఎంపీలు లేరు అన్నది నిజం. బీజేపీకి 240 మంది ఉంటే కాంగ్రెస్ కి 100 లోపే ఎంపీలు ఉన్నారు.

బీజేపీ వ్యతిరేకతతో :

ఇపుడు చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీ పట్ల వ్యతిరేకతతోనే లోక్ సభలో బిల్లు వీగిపోయింది. ఇది ఇండియా కూటమి వైపు నుంచి కనిపించిన ఐక్యత. ఇదే తీరు ముందు ముందు సాగితే అది మధ్యే వాద పార్టీల పునరేకీకరణకు ఒక మార్గంగా మారుతుంది అని అంటున్నారు. ఆ నేపథ్యంలో మరోసారి జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ లాంటి కొత్త కూటమి ఆవిర్భవించేందుకు ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. దానికి ఇంకా సమయం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ విషయంలో కొంత స్పష్టత ఇస్తాయి. అలాగే అతి ముఖ్యమైన యూపీ గుజరాత్ తదితర రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఏడాది ఉన్నాయి. వాటి ఫలితాల ఆధారంగా దేశంలో బీజేపీయేతర కూటమికి శ్రీకారం చుట్టబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News