ఆరుగురి బలి కోరిన అభిమానం.. చిన్నస్వామి స్టేడియంలో పెద్ద విషాదం
తొక్కిసలాటలో తొలుత ఇద్దరు.. తర్వాత నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. అనంతరం ఆరుగురు చనిపోయినట్లుగా పేర్కొంటున్నారు.;
అభిమానం ఆరుగురిని బలిగొంది.. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో పెద్ద విషాదం జరిగింది.. విజయ యాత్ర విషాద యాత్రగా మారింది.. అభిమాన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ తొలి టైటిల్ కొట్టిన ఆనందం ఆరుగురి పాలిట మరణ శాసనమైంది.
బుధవారం బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసిలాట చోటుచేసుకుంది. ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ జట్టుకు వారి సొంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయ యాత్ర నిర్వహించాలని భావించింది. కానీ, ట్రాఫిక్ గురించి తెలిసిన పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనే వార్తలు వచ్చాయి. అయితే, చిన్నస్వామి స్టేడియంలో సన్మానం జరుగుతుందనే వార్తదలు రావడంతో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులకు గాయాలు అయినట్లు కథనాలు వస్తున్నాయి. కొందరు 20 మంది గాయపడినట్టు చెబుతున్నారు.
అంతకంతకూ పెరుగుతున్న మరణాలు..
తొక్కిసలాటలో తొలుత ఇద్దరు.. తర్వాత నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వచ్చాయి. అనంతరం ఆరుగురు చనిపోయినట్లుగా పేర్కొంటున్నారు. కాగా, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కల్పించుకుని అభిమానులను అదుపు చేస్తున్నారు.
ఏది ఏమైనా.. ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ కప్ గెలిచిందన్న సంబరంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కప్ గెలిచాక.. బుధవారం ఆర్సీబీ జట్టు సొంత నగరం బెంగళూరుకు వచ్చింది.