ఆర్సీబీకి షాక్.. కేసు నమోదు
తమ జట్టు మొదటి ఐపీఎల్ టైటిల్ అందించడంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.;
తమ జట్టు మొదటి ఐపీఎల్ టైటిల్ అందించడంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఆ సంబరాలే ఇప్పుడు విషాదానికి దారితీశాయి. బెంగళూరులో నిర్వహించిన విక్టరీ పరేడ్ హడావుడిగా సరైన ఏర్పాట్ల లేకుండా చేపట్టడం వల్ల 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇప్పుడు ఈ ఘటనపై క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.
- అసలు విషాదం ఎలా జరిగింది?
చిన్నస్వామి మైదానంలో జరగబోయే విక్టరీ పరేడ్ కోసం అభిమానులు వేలాదిగా చేరుకున్నారు. మొదట్లో పరేడ్ జరిగే విషయమై అయోమయం నెలకొంది. ఒక్కసారిగా రద్దు చేస్తూ, మళ్లీ ప్రకటన చేస్తూ యాజమాన్యం తప్పిదాలను దాచింది. మైదానం సామర్థ్యం 35,000 మాత్రమే అయినా, దాదాపు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ మంది అభిమానులు అక్కడకు తరలివచ్చారు. ఫ్రీ పాస్‌లు ఇచ్చారని చెప్పినా అవి సకాలంలో ఇవ్వకపోవడం, గేట్లు మూసివేయడం, పోలీసుల తగిన చర్యలేమి లేకపోవడంతో తొక్కిసలాట ఏర్పడింది.
- పోలీసులు లాఠీచార్జ్, అమాయకుల మృతి
అభిమానులు మైదానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో చెలరేగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి కారణంగా పోలీసులు, బెంగళూరు యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- బెంగళూరు యాజమాన్యం, డిఎన్ఏపై కేసులు
ఈ దుర్ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభమైంది. క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పై కేసులు నమోదయ్యాయి. అలాగే ఈవెంట్‌ను నిర్వహించిన డిఎన్ఏ సంస్థపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరు యాజమాన్యం ట్విట్టర్‌లో చేసిన ప్రకటనపై కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
ఒక్కసారి జాగ్రత్తగా ప్లాన్ చేసి, పోలీసులతో సమన్వయం సాధించి, అభిమానుల భద్రతను పరిగణలోకి తీసుకుని పరేడ్ నిర్వహించి ఉంటే.. ఈ విషాదం జరగేదే కాదు. కానీ హడావిడిగా చేసిన ప్లానింగ్, సమర్థవంతమైన వ్యవస్థాపన లేకపోవడం.. ఈ ప్రాణనష్టం వెనుక ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ సంఘటన ఇకపై అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ఆటగాళ్లు, అభిమానుల భద్రతల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని బలంగా చూపుతోంది.