ఐపిఎల్ 2026 విజేత‌: పార్టీలో విరుష్క జంట చిందులే చిందులు

బాలీవుడ్ నటి అనుష్క శర్మ - స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క‌పుల్ ఆర్సీబీ జట్టు సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేస్తూ జరుపుకున్న ప్రత్యేక పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Update: 2026-06-01 05:28 GMT

గెలుపు తెచ్చే హుషారు మామూలుగా ఉంటుందా... ఒళ్లంతా పుల‌కించిపోతుంది.. త‌నువు ఉర‌క‌లెత్తుతుంది..! ఆపై ఇక చిందులే చిందులు.. పార్టీ నైట్ లో ఫుల్ గా డ్యాన్సులే డ్యాన్సులు.. ముఖ్యంగా జీటీపై సునాయాస పోరులో టైటిల్ గెలుచుకుని ఆర్సీబీ జ‌ట్టు సంబ‌రాలు చేసుకోగా, ఈ నైట్ పార్టీలో విరుష్క జంట స్టెప్పుల‌తో హుషారెత్తిపోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్‌- 2026) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్.సి.బి) మరోసారి చరిత్ర సృష్టించింది. గత సీజన్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ ఏడాది కూడా తమ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుని రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ బ్యాక్-టు-బ్యాక్ విజయంతో బెంగళూరు క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పోస్ట్-మ్యాచ్ వేడుకలలో భాగంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ - స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క‌పుల్ ఆర్సీబీ జట్టు సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేస్తూ జరుపుకున్న ప్రత్యేక పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (జీటీ) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సునాయాస‌ విజయాన్ని నమోదు చేసింది. టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ కోహ్లీ అండ‌తో సులువుగా ఛేధించింది. నిజానికి జీటీపై ఆర్సీబీ బౌలర్లు, బ్యాటర్లు ప్రదర్శించిన ఉమ్మడి పోరాటం ఈ విజ‌యానికి దారి తీసింది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగి గుజరాత్ టైటాన్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లినికల్ పెర్ఫార్మెన్స్‌తో మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు. ఈ విజయంతో విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో ఆర్సీబీ జట్టుకు ఇప్పటివరకు మొత్తంగా రెండు ఐపీఎల్ టైటిళ్లను అందించినట్లయింది.

విరాట్ కోహ్లీ మైదానంలో ఆడుతున్నప్పుడు అతడి సతీమణి అనుష్క శర్మ ఇచ్చే సపోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ 2026 సీజన్‌లో విరాట్ ఆడిన అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుష్క శర్మ వ్యక్తిగతంగా మైదానానికి హాజరు కాలేకపోయినా.. అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు .. ముఖ్యంగా గ్రాండ్ ఫైనల్ పోరుకు మాత్రం ప్రత్యేకంగా హాజరై స్టాండ్స్ నుండి కోహ్లీని ఉత్సాహపరిచారు. ఈ సీజన్ పొడుగునా విరాట్ మైదానంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతుంటే స్టాండ్స్‌లో కూర్చున్న అనుష్క శర్మ తీవ్రమైన ఎమోషన్స్‌కు లోనైన సందర్భాలు కెమెరా కంటికి చిక్కాయి. ముఖ్యంగా కోహ్లీ సెంచరీలు చేసినప్పుడు ఆనందబాష్పాలు రాల్చడం.. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురవడం వంటి దృశ్యాలు అభిమానుల దృష్టిని క్యాప్చుర్ చేసాయి.

ఫైనల్ మ్యాచ్ ముగిసి ట్రోఫీ చేతికందిన తర్వాత అసలైన సంబరాలు మొదలయ్యాయి. వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ డ్యాన్స్ ఫ్లోర్‌పై ఆర్సీబీ స్క్వాడ్‌తో కలిసి స్టెప్పులేస్తూ, కేరింతలు కొడుతూ కనిపించారు. ఎప్పుడూ మైదానంలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే విరాట్ టైటిల్ గెలిచిన ఆనందంలో భార్య అనుష్కతో కలిసి ఎంతో హ్యాపీగా చిందేయడం అభిమానులకు కంటికింపుగా క‌నిపిస్తోంది. ఇద్దరు సూపర్‌స్టార్లు తమ జట్టు విజయాన్ని ఇంతలా ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ ని ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.



Tags:    

Similar News