కొత్త సర్కారుకు ఆర్ బీఐ భారీ గిఫ్టు.. రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్

గతంలో ఎప్పుడూ లేనంత భారీగా గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ ను ప్రకటించింది.

Update: 2024-05-23 10:30 GMT

కలిసి రావటం అంటే ఇలానే ఉంటుందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా కొన్ని వారాలుగా సా..గుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరో రెండు దశలు మిగిలి ఉండటం తెలిసిందే. వచ్చే నెల (జూన్) 4 తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలువెల్లడి కానున్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆ రోజు చేపడతారు. ఈ షెడ్యూల్ అంతా అందరికి తెలిసిందే. తాజాగా కొత్తగా కొలువు తీరే ప్రభుత్వానికి భారీ సాంత్వన కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది భారత రిజర్వు బ్యాంకు.

గతంలో ఎప్పుడూ లేనంత భారీగా గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ ను ప్రకటించింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరినంతనే ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం.. ఇంత భారీ మొత్తం రిజర్వు బ్యాంకుకు ఎలా సాధ్యమన్నది. ఆర్ బీఐ ఆదాయం వ్యయాల మధ్య తేడాను మిగులుగా వ్యవహరిస్తారు.

ఇంతకూ రిజర్వు బ్యాంకుకు ఆదాయం ఏయే మార్గాల్లో వస్తుందన్నది చూస్తే.. దేశ.. విదేశీ సెక్యూరిటీల మీద వచ్చే వడ్డీ.. సేవలపై రుసుములు.. కమీషన్లు.. విదేశీ మారక ద్రవ్యం లావాదేవీలపై లాభం.. అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలంతో ఆర్ బీఐకు ఆదాయం వస్తుంది. ఇక.. దీని ఖర్చులు చూస్తే.. కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. డిపాజిట్లు.. రుణాలపై వడ్డీల చెల్లింపు.. సిబ్బంది జీతభత్యాలు.. పింఛన్లు.. ఆఫీసు నిర్వహణ ఖర్చులు.. ఆకస్మిక పరిస్థితులు.. తరుగుదలకు కేటాయింపుల్ని చేపడతారు. ఈ రెండింటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ప్రభుత్వానికి బోనస్ రూపంలో ఇస్తారు.

Read more!

గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25 తాత్కాలిక బడ్జెట్ లో ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ గా అంచనా వేశారు. ఆర్ బీఐ తాజా ప్రకటనతో ఇది కాస్తా రెట్టింపు కావటం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్ ను ఆర్ బీఐ చెల్లించింది. అదే అప్పటివరకు అత్యధికం. తాజాగా అంతకు మించి రూ.2,10,874 కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. భారీగా వచ్చే నిధులు కొత్త ప్రభుత్వానికి ఊరట కలిగించేలా చేస్తాయని చెప్పాలి.

ఈ కీలక ప్రకటనను ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు 608వ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసి.. ప్రకటన చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి పరిమితం చేయాలని భావించారు. ఈ మొత్తం రూపాయిల్లో చూస్తే 17.34 లక్షల కోట్లు. ఆర్ బీఐ తాజాగా చేసిన డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఉపశమనంగా మారుతుంది. ఈ డివిడెండ్ గత ఏడాది రూ.83,416 కోట్లు. అంటే.. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ కావటం కొత్త ప్రభుత్వానికి వరంగా మారుతుందని చెప్పాలి.

4

ఇంతకూ ఇంత భారీ మిగులు ఆర్ బీఐకు ఎలా సాధ్యమైందన్న అంశంలోకి వెళితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఆర్ బీఐ ఫారిన్ ఎక్సైంజ్ అసెట్స్ ద్వారా లభించిన అధిక వడ్డీఆదాయాలు భారీ నిధుల బదలాయింపులకు ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. దేశీయ.. అంతర్జాతీయ సెక్యూరిటీలపై అధిక వడ్డీరేట్లు.. విదేశీ మారక ద్రవ్యం భారీ స్థూల విక్రయాలు కూడా సాయం చేశాయని చెబుతున్నారు. ఈ డివిడెంట్ ప్రకటన అంత తేలిగ్గా చేయరు. పలు అంశాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే చేస్తారు.

ఆర్ బీఐ తన ఆదాయ వ్యయాల పట్టికలో ఎంత మొత్తాన్ని తన దగ్గర మిగులు నిధులుగా ఉంచుకోవాలి? కేంద్రానికి ఎంత మొత్తాన్ని మిగుల మొత్తాన్ని బదలాయించాలి? అనే అంశంపై ఆర్ బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలోని కమిటీ ఒక ఫ్రేమ్ వర్కును రూపొందించింది. దీని ప్రకారం సీఆర్ బీ (కంటింజెంట్ రిస్క్ బఫర్) 5.5 -6.5 శాతంగా ఉండాలని పేర్కొంది. దీని ప్రకారమే మిగులు బదలాయింపులు జరుగుతాయి. అందుకు తగ్గట్లే తాజా ప్రకటన వెలువడింది.

Tags:    

Similar News