వైసీపీపై మంత్రి కేశవ్ సెటైర్లు.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీ..

విపక్ష నేత బొత్స ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా మాట్లాడితే, ఆర్థిక మంత్రి కేశవ్ కౌంటర్ అటాక్ చేయడం, సభ వెలుపల కూడా ఇదే అంశంపై ఇరుపక్షాలు విమర్శలు చేసుకోవడం చర్చకు దారి తీసింది.;

Update: 2026-02-26 19:30 GMT

శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ వాడివేడిగా సాగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై విపక్షం విరుచుకుపడటం, అందుకు తగ్గట్టుగా అధికార పార్టీ ఎదురుదాడి చేయడంతో మండలి సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. గురువారం రాయలసీమ నీటి ప్రాజెక్టులపై సభలో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటుచేసుకుంది. విపక్ష నేత బొత్స ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా మాట్లాడితే, ఆర్థిక మంత్రి కేశవ్ కౌంటర్ అటాక్ చేయడం, సభ వెలుపల కూడా ఇదే అంశంపై ఇరుపక్షాలు విమర్శలు చేసుకోవడం చర్చకు దారి తీసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై శాసనమండలిలో వైసీపీ లేవనెత్తిన ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసేలా చేశారంటూ విపక్షం వైసీపీ ఆరోపించింది. దీనిపై మంత్రి కేశవ్ సమాధానమిస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ప్రకటనను సభలో ప్రస్తావించారు. జగన్ సీఎంగా ఉండగానే కోర్టుకు వెళ్లి పనులు నిలిచిపోయేలా చేశామని హరీశ్ రావు చేసిన ప్రకటనను ఆర్థిక మంత్రి కేశవ్ గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ధ్వజమెత్తారు.

ఇక మండలి వెలుపల కూడా ఇదే అంశంపై వైసీపీపై విమర్శలు చేశారు ఆర్థిక మంత్రి కేశవ్. విపక్షాన్ని వాకౌట్ అంటూ టాకౌట్ పార్టీగా అభివర్ణించారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రశ్నలు వేసి వైసీపీ ఇరకాటంలో పడిందని కేశవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ వేస్తున్న ప్రశ్నలపై తాము చర్చలు పెట్టామని, అయితే వారు అనుకున్న విధంగా జవాబులు చెప్పాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మండలిలో శాంతిభద్రతలు, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై వైసీపీ లేవనెత్తిన అంశాలను తాము చర్చించామని గుర్తు చేశారు.

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై వైసీపీ కనీసం నోటీసు ఇవ్వలేదని ఆర్థిక మంత్రి కేశవ్ ఎత్తిచూపారు. సభలో రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందుకు వచ్చి వైసీపీ ప్రశ్నలపై స్టేట్మెంట్ ఇస్తున్నా, వినకుండా వాకౌట్ చేస్తున్నారని ఆర్థిక మంత్రి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలిలో వ్యవసాయంపై చర్చిద్దామని, 4వ తేదీన మరోసారి లడ్డూ విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కల్తీ నెయ్యిపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మాట్లాడేందుకు సిద్ధమన్నా, వైసీపీ సభ్యులు పారిపోయారని వ్యాఖ్యానించారు. తమపై విమర్శలు చేయాలని చూసి వైసీపీ తిరిగి ఆత్మరక్షణలో పడిపోయిందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News