పశువు కంటే హీనమా? ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై రవిశాస్త్రి సంచలన ఆవేదన
ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై స్పందిస్తూ రవిశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన దిగ్గజ నాయకుడు.. 1992లో పాకిస్తాన్‌కు చారిత్రాత్మక ప్రపంచకప్ అందించి ఆ దేశానికే ఐకాన్‌గా మారిన క్రీడా రత్నం.. ఆ తర్వాత ప్రజాదరణతో దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ‘లీడర్ ఆఫ్ మెన్’ ఇమ్రాన్ ఖాన్.. కానీ కాలం తిరగబడింది. నేడు అదే ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలు నలిగిపోతున్నారు. రాజకీయ కక్షసాధింపులు, కఠినమైన జైలు నియమాల మధ్య ఆయన అనుభవిస్తున్న నరకయాతన చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్.. దిగ్గజ వ్యాఖ్యాత రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు క్రీడాభిమానుల హృదయాలను పిండేస్తున్నాయి.
మనిషినైనా అలా చూడకూడదు!
ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంపై స్పందిస్తూ రవిశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "నేను రాజకీయ నాయకుడిని కాను.. కానీ ఒక క్రీడాకారుడిగా.. తోటి మనిషిగా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అని రవిశాస్త్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు, సిద్ధాంత విభేదాలు ఏవైనా కావచ్చు.. కానీ ఒక మనిషిని, అందులోనూ దేశానికి ప్రధానిగా పనిచేసి.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న క్రీడా దిగ్గజాన్ని పశువు కంటే హీనంగా చూడటం అమానుషమని స్పష్టం చేశారు.
కంటి చూపు పోయినా దయలేదా?
అడియాలా జైలులోని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు దాదాపు 85 శాతం క్షీణించిందనే వార్తలు రవిశాస్త్రిని తీవ్రంగా కలచివేశాయి. సరైన వైద్యం అందక ఒక మహానాయకుడి ఆరోగ్యం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోవడం మానవత్వానికే మచ్చ అని ఆయన అభిప్రాయపడ్డారు. శత్రు దేశమైనా, రాజకీయ ప్రత్యర్థి అయినా.. బంధీగా ఉన్న వ్యక్తికి కనీస వైద్య సదుపాయాలు అందించడం మానవతా బాధ్యత అని గొంతు విప్పారు.
నాడు విశ్వవిజేత.. నేడు ఏకాకి ఖైదీ
2023 ఆగస్టు 5 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌పై తోషాఖానా సహా అనేక కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు గంభీరంగా మాట్లాడిన ఆ స్వరం, మైదానంలో ఆధిపత్యం చెలాయించిన ఆ రూపం.. నేడు జైలు గోడల మధ్య నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 1992 ప్రపంచకప్‌లో జట్టును ఒంటిచేత్తో విజేతగా నిలిపిన దృఢ సంకల్పం ఉన్న నాయకుడికి ఈ పరిస్థితి రావడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాలోకం తట్టుకోలేకపోతోంది.
రాజకీయ కక్షలు ఉండొచ్చు.. కోర్టు విచారణలు సాగొచ్చు.. కానీ ఒక క్రీడా వీరుడికి.. మాజీ ప్రధానికి దక్కాల్సిన ప్రాథమిక హక్కులు, వైద్య సదుపాయాలు అందించకపోవడం దారుణం. రవిశాస్త్రి చేసిన ఈ ఆవేదన పూరిత వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే దారితీశాయి. ఇకనైనా పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించి ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం, మానవతా దృక్పథంతో కూడిన సౌకర్యాలు కల్పిస్తుందో లేదో చూడాలి.