భీమిలిలోనూ ఏడ్చేసిన సత్తిబాబు.. రాజకీయ దిగ్గజానికి ఏమైంది?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Update: 2026-10-06 10:58 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల కాలంలో బొత్స కుటుంబంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆయనను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. మనసులోని బాధను దిగమింగుకోలేక ఆయన కన్నీరు కారుస్తున్న వైనం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోందని చెబుతున్నారు. గత నెలలో బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని వైసీపీ సమావేశాల్లోనూ బొత్స భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

బొత్స లెగసీ కోసం..

ఇక తాజాగా, బొత్స కుమార్తె అనూష భీమిలి ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వేళ కూడా ఆయన కన్నీరు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. తన రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనూషను భీమిలి నియోజకవర్గానికి పరిచయం చేసేందుకు బొత్స ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి బొత్స కుటుంబ సభ్యులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స రాజకీయ లెగసీని కాపాడేలా అనూష ముందుకు వెళ్లాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. మరోవైపు బొత్స సతీమణి, మాజీ ఎంపీ ఝన్సీలక్ష్మి సైతం తన కుమార్తెను రాజకీయంగా ఆదరించాలని కార్యకర్తలను కోరారు.

ఏదీ నాటి దూకుడు

సభ జరుగుతున్నంత సేపూ బొత్స పలుమార్లు తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా ఎంతో దూకుడు స్వభావంతో, రాజకీయ వ్యూహాలతో చెలరేగే బొత్సలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సున్నిత మనస్తత్వం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని చెబుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని ఓర్పు, నేర్పు ప్రదర్శించే బొత్సలో ఇప్పుడు ఆ బింకం సడలినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకోవాలని భావించిన ఆయన, ఇప్పుడు తన పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ క్రియాశీలకం కావాల్సి వస్తోందని అంటున్నారు.

అయితే, ఇటీవల ఆయన వ్యవహారశైలిని గమనిస్తే పూర్వపు దూకుడు కనుమరుగైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో నేతల పార్టీ మార్పులు సర్వసాధారణమే అయినప్పటికీ, బొత్స మాత్రం ఈ పరిణామాలను తేలిగ్గా తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాను అన్నివిధాలుగా ప్రోత్సహించి, రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారడాన్ని ఆయన కలలో కూడా ఊహించి ఉండరని, ఆ మానసిక క్షోభ నుంచే ఆయన ఇంకా బయటపడలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణం చేతనే బొత్స ఇంటా, బయటా జరిగే కార్యక్రమాలలో తన ఆవేదనను అణుచుకోలేక బాహాటంగానే కన్నీటి పర్యంతమవుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.

Tags:    

Similar News