కాక్‌పిట్ ఫైట్ ఇప్పుడే కొత్త కాదు.. సోనూసూద్ సూచన ఆచరణీయమేనా?
వాస్తవానికి జర్మన్‌వింగ్స్ ఘటన తర్వాతే అంతర్జాతీయ విమానయాన సంస్థలు అప్రమత్తమై కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చాయి.
విమాన ప్రయాణాల భద్రత- కాక్‌పిట్ (సారథ్య గది) భద్రతా విధానాలపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా విమాన ప్రయాణీకుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో కాక్ పిట్‌లోకి ఇతర పైలట్ల ప్రవేశం వంటి అంశాలపై ప్రముఖ నటుడు సోనూసూద్ చేసిన ఒక సూచన ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విమానయాన భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సోనూసూద్ లేవనెత్తిన ఈ ఆలోచన - చర్చ కొత్తదేమీ కాదని గతంలో జరిగిన కొన్ని ఘోర విమాన ప్రమాదాల సమయంలోనూ ఇలాంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరిగిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
సోనూసూద్ చేసిన ఈ ప్రస్తావన ప్రధానంగా మార్చి 2015లో జరిగిన జర్మన్‌వింగ్స్ ఫ్లైట్ 9525 ఘోర దురంతాన్ని గుర్తుచేస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్ తలుపుల భద్రతా విధానాలు, అత్యవసర యాక్సెస్ కోడ్‌ల పనితీరుపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. విమాన ప్రయాణంలో పైలట్ల మధ్య సమన్వయం, అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తితే అనుసరించాల్సిన ప్రొటోకాల్స్ ఎంత కీలకమో ఆ దుర్ఘటన ప్రపంచానికి చాటి చెప్పింది. సరిగ్గా అలాంటి భద్రతా లోపాలు లేదా క్లిష్ట పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే అప్పట్లో పలువురు నిపుణులు కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.
జర్మన్‌వింగ్స్ విమాన ప్రమాదంలో కో-పైలట్ ఉద్దేశపూర్వకంగానే ప్రధాన పైలట్‌ను కాక్‌పిట్ వెలుపల ఉంచి, లోపల నుండి తలుపు లాక్ చేసి విమానాన్ని కూల్చివేశాడు. ఆ సమయంలో అత్యవసర కోడ్ ఉపయోగించి బయట ఉన్న పైలట్ లోపలికి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నించినా.. లోపలి నుండి `డినై` (తిరస్కరణ) బటన్ నొక్కడం వల్ల తలుపు తెరుచుకోలేదు. ఈ దారుణ సంఘటన విమానయాన రంగంలో భద్రతా వైఫల్యాలను.. ముఖ్యంగా సాంకేతిక నియంత్రణలో ఉన్న లోపాలను ప్రపంచం ముందుంచింది.
అప్పట్లోనే నటుడు సోనూసూద్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ విమానయాన సంస్థలకు ఒక కీలక సూచన చేశారు. పైలట్లకు ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య వచ్చినా లేదా ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా... కాక్‌పిట్ లోపల ఉన్నవారితో సంబంధం లేకుండా.. బయట ఉన్న సిబ్బంది నేరుగా లోపలికి ప్రవేశించేలా ఒక ప్రత్యేక ఎమర్జెన్సీ ఓవర్‌రైడ్ కోడ్ లేదా అదనపు రక్షణ వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చని సూచించారు.
వాస్తవానికి జర్మన్‌వింగ్స్ ఘటన తర్వాతే అంతర్జాతీయ విమానయాన సంస్థలు అప్రమత్తమై కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. ఇందులో భాగంగా కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు సిబ్బంది ఉండేలా నిబంధనను మరింత కఠినతరం చేశారు. ఒకవేళ ఒక పైలట్ బయటకు వెళ్లాల్సి వస్తే.. మరో సిబ్బంది లోపల ఉండేలా ప్రొటోకాల్స్ మార్చారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణీకుల భద్రతను మరింత సురక్షితంగా మార్చేందుకు సోనూసూద్ లాంటి ప్రముఖులు ఇస్తున్న సూచనలు విమానయాన రంగంలో భద్రతా ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబయ్ విమానం (FZ1073) విషయంలో చోటుచేసుకున్న హైజాకింగ్ యత్నం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఒమన్‌కు చెందిన కో-పైలట్ ఒంటరిగా ఈ ఉగ్రచర్యకు తెగబడిన `లోన్ వోల్ఫ్` తీవ్రవాది అని.. ఆ విమానంతో బెన్ గురియన్ విమానాశ్రయాన్ని లేదా నగరంలోని ఏదైనా భారీ భవనాన్ని ఢీకొట్టి 9/11 తరహాలో భారీ విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నినట్లు అమెరికా, ఇజ్రాయెల్ నివేదికలు .. అలాగే యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడించారు. సోను సూద్ సూచన ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనే.. అయితే ఇది ఎంతవరకూ ఆచరణలో సాధ్యమో విమానయాన సంస్థలు నిర్ణయించాల్సి ఉంటుంది.