ద‌డ పుట్టిస్తున్న విమాన ప్రయాణాలు.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ వెనుక టాప్ సీక్రెట్!

నేటి కాలంలో విమాన ప్రయాణాలు అంటేనే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Update: 2026-10-06 08:51 GMT

నేటి కాలంలో విమాన ప్రయాణాలు అంటేనే ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పటిలా సురక్షితమైన ప్రయాణాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా మారుతోంది. దీనికి విమానంలో తలెత్తే సాంకేతిక లోపాలు ఒకెత్తు అయితే.. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలు (జియో పాలిటిక్స్), దేశాల మధ్య పోరాటాలు, విద్వేషాలు మరో ఎత్తుగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులే లక్ష్యంగా మారుతుండటంతో.. విదేశాలకు వెళ్లాలంటేనే ప్రజల్లో దడ పుడుతోంది. కేవలం బిజినెస్ క్లాస్ ప్రయాణికులే కాకుండా.. సాధారణ యాత్రలకు వెళ్లేవారు కూడా బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఇలాంటి ఆందోళనకర తరుణంలోనే ఇటీవల ఫ్లై దుబాయ్ విమానం పెను ముప్పు నుంచి బయటపడిందన్న వార్తలు రావడం.. ఆ వెంటనే లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడం మరింత భయపెట్టింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. విమానాన్ని సురక్షితంగా కిందకు దించడానికి ఏ విధమైన నియమ నిబంధనలు పాటిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా అత్యవసర ల్యాండింగ్‌కు ముందు విమానం ఇంధన బరువును తగ్గించుకోవడం ఎంతవరకు సురక్షితమనే సాంకేతిక అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

అయితే విమానాలు ల్యాండ్ అవ్వడానికి ముందు ఆకాశంలో గాలిలో చక్కర్లు కొట్టడాన్ని ఏవియేషన్ భాషలో `హోల్డింగ్` అంటారు. ఫ్లైట్ ట్రాకర్లలో విమానాలు ఇలా రౌండ్లు కొట్టడాన్ని చాలా మంది ఏదో ప్రమాదం జరిగిందని భయపడుతుంటారు. కానీ కేవలం ఇంధనాన్ని తగ్గించుకోవడమే కాకుండా ఇలా రౌండ్లు కొట్టడానికి మరికొన్ని అత్యంత కీలకమైన సాంకేతిక కారణాలు కూడా ఉంటాయి.

దీనికి సంబంధించిన ప్రధాన కారణాల్లో మొదటిది ఎయిర్‌స్పేస్ రద్దీ. రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ల్యాండింగ్ కోసం విమానాల మధ్య సరైన దూరం పాటించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానాన్ని నిర్దిష్ట ఎత్తులో గాలిలోనే చక్కర్లు కొట్టాలని సూచిస్తారు. అలాగే ఉరుములు, మెరుపులు, భారీ వర్షం లేదా దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ల్యాండింగ్ తాత్కాలికంగా వీలుకాకపోతే.. వాతావరణం అనుకూలించే వరకు విమానాన్ని హోల్డింగ్ పాటర్న్‌లోనే ఉంచుతారు.

ఇక చివరిగా... విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సిబ్బందికి పరిస్థితిని అంచనా వేయడానికి ఈ చక్కర్లు కొట్టడం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే భారీ విమానాలలో ఇంధనం నిండుగా ఉంటుంది. టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి రావాల్సి వస్తే ఆ అధిక బరువుతో ల్యాండ్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే సురక్షితమైన ల్యాండింగ్ బరువు వచ్చే వరకు ఇంధనాన్ని గాలిలోనే మండుస్తూ ఖాళీ చేయడానికి పైలట్లు ఈ హోల్డింగ్ విధానాన్ని అనుసరిస్తారు.

Tags:    

Similar News