ఢిల్లీ వేదికగా బీసీ మంత్రుల కసరత్తు.. రిజర్వేషన్ల కోసం ఆఖరి పోరాటం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం గట్టిపోరాటం చేస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది.

Update: 2026-10-06 10:52 GMT

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం గట్టిపోరాటం చేస్తున్నట్లు ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో గట్టి వాదనలు వినిపించి బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతి తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏవిధమైన వాదనలు వినిపించాలనే అంశంపై ఢిల్లీ వేదికగా భారీ కసరత్తు చేస్తోందని చెబుతున్నారు.




 


బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీం గత తీర్పులు కూటమి సర్కారును ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురైందని చెబుతున్నారు. దీంతో కూటమి సర్కారు న్యాయనిపుణలతో సంప్రదింపులు మొదలుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. రిజర్వేషన్ల పరిమితి లక్ష్మణరేఖ ఏం కాదని, అవసరమైన సందర్భాల్లో పెంచడంలో తప్పులేదని ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించడం ఎలా అన్న విషయమై విస్తృత సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. ప్రధానంగా 34 శాతం బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా సుప్రీం తీర్పు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఆ బాధ్యతలను బీసీ నేతలకు అప్పగించిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహననాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి తదితరులు ఢిల్లీలో న్యాయనిపుణులతో వరుసగా సమావేశమవుతూ సుప్రీంకోర్టులో వినిపించాల్సిన వాదనలపై మార్గనిర్దేశం చేస్తున్నారని అంటున్నారు. గత శనివారం హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేయగా, ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రాజకీయ వ్యూహం

సుప్రీం విచారణలో ఏ విధమైన వాదనలు వినిపించాలనే అంశంతోపాటు పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగేలా ఆదేశాలు పొందడం బీసీ మంత్రుల లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించని పక్షంలో రాజకీయంగా నష్టం లేకుండా ఏ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలనే అంశాన్ని కూటమి నేతలు ముందుగానే సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తాము చిత్తశుద్ధిగా పనిచేశామని, ఇందుకు బీసీ నేతలే సాక్ష్యమని ప్రచారం చేసుకోవడంలో భాగంగా సీనియర్ మంత్రులను ఢిల్లీకి పంపినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్లపై చివరి వరకు పోరాడాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని చాటిచెప్పేలా పక్కా ప్లాన్ తో ప్రభుత్వం అడుగులు వేస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News