గాల్లోనే 30 టన్నుల ఇంధనం ఎందుకు వదిలేసింది? బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అసలు ఏం జరిగింది?
మబ్బుల్లో నుంచి నేలకు దిగేసరికి మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్లయింది.. మృత్యువు వాకిలిదాకా వెళ్ళొచ్చిన ఆ కొన్ని నిమిషాలు.. వెయ్యి గుండెల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయినంత పని జరిగింది.
మబ్బుల్లో నుంచి నేలకు దిగేసరికి మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్లయింది.. మృత్యువు వాకిలిదాకా వెళ్ళొచ్చిన ఆ కొన్ని నిమిషాలు.. వెయ్యి గుండెల చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయినంత పని జరిగింది. లండన్ నుంచి అమెరికాలోని చికాగోలో ఉన్న తమ ఆత్మీయులను కలుసుకునేందుకు నవ్వుతూ ఎక్కిన విమానం.. కొన్ని నిమిషాల్లోనే కన్నీటి కావ్యమవుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఆకాశంలో ప్రయాణిస్తున్న వేళ సరిగ్గా ఐర్లాండ్ మీదుగా వెళ్తుండగా విమానంలో ఊపిరి ఆడని పరిస్థితిర్పడింది. క్యాబిన్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోవడంతో ప్రాణవాయువు కొరత ఏర్పడి సుమారు 37 వేల అడుగుల ఎత్తులో విమానం మరణ మృదంగం మోగించింది. ప్రయాణికుల కళ్ళలో భయం పక్కనున్న వారిని గట్టిగా పట్టుకున్న వణుకుతున్న చేతులు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిమిషాల వ్యవధి ఆకాశంలో నరకాన్ని చూపించింది.
కానీ ఆ ప్రయాణికులకు తమ పైలట్ల రూపంలో దేవుడు కనిపించాడు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కేవలం 9.5 నిమిషాల్లోనే విమానాన్ని 9 వేల అడుగుల సురక్షిత ఎత్తుకు తీసుకొచ్చి ప్రయాణికులకు ఊపిరి పోశారు. అయితే ల్యాండ్ అవ్వడానికి విమానం బరువు మరో పెద్ద అడ్డంకిగా మారింది. ఎంత ప్రాణభయం ఉన్నా ల్యాండింగ్ సమయంలో రన్ వేపై విమానం పేలిపోకుండా ఉండేందుకు, దాదాపు 30 టన్నుల ఇంధనాన్ని గాల్లోనే వదిలేయాల్సి వచ్చింది. బ్రిస్టల్ ఛానల్ మీదుగా ఇంధనాన్ని డంప్ చేస్తూ చావు అంచుల దాకా వెళ్ళిన విమానాన్ని పైలట్లు లండన్ హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా దించిన క్షణంలో ప్రయాణికులు పొంగిపొర్లిన కన్నీళ్లతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆకాశంలో సాగిన గంటన్నర మరణ పోరాటం, చివరికి పైలట్ల సాహసంతో సురక్షితంగా ముగిసింది.
ఇటీవల లండన్ నుంచి అమెరికాలోని చికాగోకు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి ప్రయాణమైన ఈ బోయింగ్ 777 విమానం ఐర్లాండ్ వైమానిక ప్రాంతంలోకి చేరుకోగానే విమాన క్యాబిన్‌లో ప్రెషరైజేషన్ ఒత్తిడి వేగంగా పడిపోవడాన్ని పైలట్లు గుర్తించారు. దాంతో వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అంతర్జాతీయ ఎమర్జెన్సీ సంకేతమైన 7700 స్క్వాక్ కోడ్‌ను ప్రసారం చేశారు.
ఆ సమయంలో విమానం దాదాపు 37,000 అడుగుల భారీ ఎత్తులో ప్రయాణిస్తోంది. క్యాబిన్ ఆల్టిట్యూడ్ 10,500 అడుగులకు చేరినట్లు సందేశాలు రావడంతో భద్రతా నిబంధనల ప్రకారం ప్రయాణికులకు ప్రాణవాయువు కొరత రాకుండా ఉండేందుకు పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. కేవలం 9.5 నిమిషాల వ్యవధిలోనే విమానాన్ని 9,000 అడుగుల ఎత్తుకు దించి వేశారు. అనంతరం చికాగో ప్రయాణాన్ని రద్దు చేసుకుని తిరిగి లండన్ వైపు విమానాన్ని మళ్లించారు.
అయితే లండన్ ల్యాండింగ్‌కు ముందు మరో పెద్ద సమస్య ఎదురైంది. సుదీర్ఘ ప్రయాణాల కోసం టేకాఫ్ సమయంలో విమానంలో భారీగా ఇంధనాన్ని నింపుతారు. సాధారణంగా గమ్యస్థానానికి చేరుకునే లోపు ఆ ఇంధనం ఖర్చయి విమానం బరువు తగ్గుతుంది. కానీ అత్యవసర పరిస్థితిలో ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే తిరిగి రావడం వల్ల ఈ విమానం తన సురక్షిత మ్యాక్సిమం ల్యాండింగ్ వెయిట్ కంటే సుమారు 30 టన్నుల అధిక బరువుతో ఉంది. అంత బరువుతో ల్యాండ్ చేస్తే ల్యాండింగ్ గేర్లు విరిగిపోవడం లేదా విమానం రన్ వేపై అదుపు తప్పి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఈ ప్రమాదాన్ని నివారించడానికి పైలట్లు బ్రిస్టల్ ఛానల్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఫ్యూయల్ డంపింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 30 టన్నుల ఇంధనాన్ని గాల్లోకే విడుదల చేశారు. విమాన బరువును సురక్షిత పరిమితికి తగ్గించిన తర్వాత హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న ఎమర్జెన్సీ గ్రౌండ్ వాహనాలు, ఫైర్ ఇంజన్ల నడుమ విమానాన్ని అత్యంత సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన జరగగానే ఇదివరకు వార్తల్లో నిలిచిన ఫ్లైదుబాయ్ ఘటనతో పోలుస్తూ రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే రెండింటికీ ఎలాంటి సంబంధం లేదని విమానయాన వర్గాలు స్పష్టం చేశాయి. ప్రెషరైజేషన్ సమస్య ఎందుకు వచ్చిందనే దానిపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. సెకన్ల వ్యవధిలో పైలట్లు తీసుకున్న సరైన నిర్ణయాలు, ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్ల ఆకాశంలో మొదలైన ఉత్కంఠ సురక్షితంగా ముగిసి వందలాది ప్రాణాలు కాపాడబడ్డాయి.