కూట‌మి స‌ర్కారు ఎఫెక్ట్‌: ఈసారి 'ద‌స‌రా' అద‌ర‌హో..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.

Update: 2026-10-06 12:35 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఏటా జ‌రిగేదే క‌దా..అని అనుకోవ‌చ్చు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం ఈ ఉత్స‌వాల‌కు ప్ర‌త్యేక హంగులు అద్ది.. అద‌ర‌హో అని అనిపించేలా చేస్తోంది. సాంకేతిక‌త‌ను వినియోగించి.. భక్తుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఆ విశేషాలు చూస్తే.. నిజ‌నంగానే ద‌స‌రా అద‌ర‌హో..అనేలా సాగ‌నుంద‌న‌డంలో సందేహం లేదు.

తొలిసారి ఆన్‌లైన్‌లో..

శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఇంద్రకీలాద్రి భక్తుల కోసం ప్రత్యక్ష విశేష ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్లను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆన్‌లైన్ విధానంలో విశేష సేవల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పవిత్ర విశేష సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ఈ ఆన్‌లైన్ టికెట్లు వీలు క‌ల్పిస్తాయి. ప్ర‌త్య‌క్షంగా ఆయా సేవ‌ల‌ను.. ఇంట్లో కూర్చునే వీక్షించడంతోపాటు పాల్గొన‌వ‌చ్చు కూడా.

పోస్ట‌ల్ సేవ‌లు..

దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే చేర్చేందుకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా ఉత్సవాలకు నేరుగా రాలేని భక్తుల కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రసాదం కిట్ ధరను 116 రూపాయ‌లుగా నిర్ణయించారు. భ‌క్తులు త‌మ‌ సమీపంలోని ఏదైనా ప్రధాన పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి క‌న‌క‌దుర్గ‌మ్మ‌ ప్రసాదం కిట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక ప్రసాదం కిట్‌లో ల‌డ్డు ప్రసాదంతో పాటు శక్తి కంకణం, అమ్మవారి కుంకుమ, అక్ష‌తలు ఉంటాయి. ఇది కూడా ఈ ఏడాది నుంచే ప్రారంభించారు.

రారండో రండి!

క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో ఈ నెల 11 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభం కానున్నాయి. అలాగే, `విజయవాడ ఉత్సవ్ 2.0` పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం కూడా ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు కేంద్ర మంత్రులు ఆయా ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, అమ‌లాపురం పార్ల‌మెంటు స‌భ్యులు హ‌రీష్ బాల‌యోగి త‌దిత‌రులు.. ఆహ్వాన ప‌త్రిక‌లు అందించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీలను మంగ‌ళ‌వారం ఢిల్లీలో క‌లుసుకుని వారికి ఆహ్వాన ప‌త్రిక‌లు అందజేశారు. త‌ప్ప‌కుండా ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరారు.

ల‌డ్డూ ఏటీఎం..

దుర్గ‌మ్మ ప్ర‌సాదం కోసం క్యూలైన్‌లో నిల‌బ‌డ‌కుండా.. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ల‌డ్డూ ఏటీఎం కూడా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లోనే భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మ‌న‌కు ఎన్ని బాక్సులు(ఒక్కొక్క బాక్సులో 6 ల‌డ్డూలు ఉంటాయి) కావాల‌ని అనుకుంటే.. ఒక్కొక్క దానికి 100 చొప్పున చెల్లించి.. ఈ ఏటీఎం నుంచి తీసుకోవ‌చ్చు. ఫోన్ పే, గూగుల్ పేల‌తో స్కాన్ చేయ‌డం ద్వారా ఈ సౌక‌ర్యాన్ని భ‌క్తులు వినియోగించుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News