మళ్లీ ట్రెండింగ్ లో జయాబచ్చన్ వీడియోలు.. జర్నలిస్టుకు షాక్ ఇచ్చిన ఎంపీ!
సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మరోసారి జాతీయ మీడియాలో ప్రధాన వార్తాంశంగా నిలిచారు.
సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మరోసారి జాతీయ మీడియాలో ప్రధాన వార్తాంశంగా నిలిచారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విపక్షాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో జయాబచ్చన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించగా, నిరాకరించిన జయాబచ్చన్ సదరు మీడియా ప్రతినిధి మైక్రో ఫోన్ ను లాక్కునే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. తనను ఏమీ అడగొద్దంటూ చెప్పిన జయాబచ్చన్ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో విపక్షాలు నిర్వహించిన కార్యక్రమం కన్నా, ఎంపీ జయాబచ్చన్ ఒక జాతీయ మీడియా చానల్ ప్రతినిధితో దురుసుగా వ్యవహరించారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. నిరసనలకు హాజరైన జయాబచ్చన్ పక్కన ఓ వ్యక్తి ప్లకార్డులు ప్రదర్శించగా, అందులో ఏముందో చెప్పాలని మీడియా ప్రతినిధి కోరగా, జయా బచ్చన్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. సదరు జర్నలిస్ట్ మైక్రోఫోన్‌ను చేత్తో పక్కకు నెట్టేస్తూ.. ‘పక్కకు జరుగు, నేను నీకు ఏమీ చెప్పను’ అంటూ విసవిసా ముందుకు సాగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ అదే తీరు?
ఎంపీ జయా బచ్చన్ ఇలా సీరియస్ కావడం తరచూ జరుగుతోందని అంటున్నారు. ఆమె ఆగ్రహానికి మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు బలైపోతుంటారని చెబుతున్నారు. సీనియర్ నటిగా, రాజకీయ నాయకురాలిగా సెలబ్రెటీ హోదాలో ఉన్న జయాబచ్చన్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదని అంటున్నారు. దేశ అత్యున్నత సభ అయిన రాజ్యసభలో జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గతంలో రాజ్యసభ సమావేశాల సందర్భంగా అప్పటి చైర్మన్ జగదీప్ ధంఖర్‌తో జయబచ్చాన్ విభేదించడం హాట్ టాపిక్ అయింది. సభలో తన పేరును ‘జయా అమితాబ్ బచ్చన్’ అని పిలవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉందని, భర్త పేరును ప్రతిదానికీ జోడించాల్సిన అవసరం లేదని వాదించారు. అంతటితో ఆగకుండా, చైర్మన్ మాట్లాడిన తీరు (టోన్) సరిగ్గా లేదంటూ ప్రతిపక్ష సభ్యులతో కలిసి సభ నుండి వాకౌట్ చేయడం జాతీయ స్థాయిలో పెద్ద సంచలనమైంది.
అభిమానులపైనా అదే కరకుదనం
కెమెరా కంటికి చిక్కితే చాలు జయా బచ్చన్ అసహనం బయటపడుతుంటుందని చెబుతున్నారు. 2025 ఆగస్టులో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఒక ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చూపుతున్నారు. ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. జయాబచ్చన్ తీవ్రంగా కోపగించుకున్నారు. ‘ఏం చేస్తున్నారు మీరు? మర్యాద లేదా?’ అంటూ ఆ అభిమానిని పక్కకు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా ముంబై విమానాశ్రయంలోను వివిధ ఫంక్షన్లలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినప్పుడు.. ‘మీకు సిగ్గులేదా?, మీరు పడిపోతారు’ అంటూ శాపనార్థాలు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని అంటున్నారు.
బాలీవుడ్ కోసం పార్లమెంటులో గర్జన
2020 సెప్టెంబర్‌లో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నప్పుడు జయా బచ్చన్ రాజ్యసభలో ఘాటుగా స్పందించారు. చిత్ర పరిశ్రమ ద్వారా లబ్ధి పొంది, ఇప్పుడు అదే పరిశ్రమను బద్నాం చేస్తున్నారంటూ కొందరు ఎంపీలను ఉద్దేశించి ‘ఏ పాత్రలో తింటారో.. అదే పాత్రకు రంధ్రం చేస్తారు’ (జిస్ థాలీ మే ఖాతే హై, ఉసీ మే ఛేద్ కర్తే హై) అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. సోషల్ మీడియా, మీడియా సంస్థలు బాలీవుడ్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆమె జీరో అవర్ నోటీసు ఇచ్చి మరీ చిత్ర పరిశ్రమకు మద్దతుగా నిలిచారు.
కాగా, జయా బచ్చన్ వైఖరిపై దేశంలో ఎప్పుడూ రెండు రకాల వాదనలు వినిపిస్తుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని ఒక వర్గం ప్రజలు జయాబచ్చన్ ను వెనుకేసుకువస్తున్నారు. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, ఇబ్బందికర ప్రశ్నలు అడగడం తప్పు అంటూ సమర్థిస్తుంటారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒక ఎంపీగా ఉన్నప్పుడు అంతటి అహంకారం, దురుసు ప్రవర్తన పనికిరాదని కామెంట్లు చేస్తున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు సంయమనంతో సమాధానం చెప్పడం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా, ఎప్పటికప్పుడు వివాదాల కేంద్ర బిందువుగా మారడం జయా బచ్చన్‌కు ఒక అలవాటుగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.