ఐకానిక్ పోలవరం.. రూ.2,300 కోట్లకు చంద్రబాబు ప్లాన్

వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా పనులను పరుగులు తీయిస్తోందని అంటున్నారు.

Update: 2026-10-06 12:40 GMT

వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా పనులను పరుగులు తీయిస్తోందని అంటున్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తిచేయడంతో పాటు ఆ పనులకు సమాంతరంగా జల విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం జల విద్యుత్ కేంద్రంలోని తొలి యూనిట్ లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ను జాతీయ రహదారితో అనుసంధానించేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఐకానిక్ వంతెన నిర్మాణానికి రూ.2,300 కోట్లు అవసరం అవుతాయని, ఆ మేరకు నిధులు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెబుతున్నారు.

గడువు లోగా పోలవరం ప్రాజెక్టు పనులు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, ప్రారంభోత్సవం నాటికి పోలవరం చుట్టూ ఇతర అభివృద్ధి పనులను పట్టాలెక్కించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. ఆయన సూచనల మేరకు జాతీయ రహదారిని ప్రాజెక్టుకు అనుసంధానించే బ్రిడ్జి కోసం రూ.2,300 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ నివేదికను తీసుకుని సీఎం చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. బుధవారం రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోలవరం విషయంలో రాష్ట్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సివస్తోందని చెబుతున్నారు. ఇక పర్యాటకాభివృద్ధికి కీలకమైన ఐకానిక్ వంతెనకు నిధులు కేటాయించాలని సీఎం స్వయంగా ఢిల్లీకి వెళ్లనుండటం ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పోలవరం కోసమే చర్చించేందుకు సీఎం ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పోలవరంలో స్పిల్ వేపై బ్రిడ్జి నిర్మాణ ప్రస్తావన ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరగలేదని అంటున్నారు. తొలిసారిగా సీఎం చంద్రబాబు ఈ విషయమై కల్పించుకుని కేంద్రంతో మాట్లాడాలని నిర్ణయించడంతో ఎటువంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠ రేపుతోందని చెబుతున్నారు.

ఇక ఇదే సమయంలో పోలవరం జల విద్యుత్ కేంద్రంలో పనులు ప్రభుత్వానికి కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. గోదావరి పుష్కరాల నాటికి జల విద్యుత్ కేంద్రం పూర్తి చేసేలా ప్రస్తుతం పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలియూనిట్ లో స్టాటర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఈ స్టాటర్ అత్యంత కీలకంగా చెబుతున్నారు. దీని ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తి దిశగా తొలి అడుగు పడినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యూనిట్ లో 80 మెగావాట్ల చొప్పున మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుందని అంటున్నారు.

Tags:    

Similar News