ఏపీ రాజ్యసభ రేసులో అన్నామలై..?

ఏపీలో బీజేపీకి కేటాయించిన రాజ్యసభ స్థానం నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టవంతుడు ఎవర్న చర్చ జరుగుతోంది.;

Update: 2025-04-18 06:35 GMT
Who Will BJP Send to Rajya Sabha from Andhra Pradesh

ఏపీలో బీజేపీకి కేటాయించిన రాజ్యసభ స్థానం నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టవంతుడు ఎవర్న చర్చ జరుగుతోంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో రాజ్యసభ లక్కీచాన్స్ ఎవరికన్న చర్చ మొదలైంది. ఏపీ బీజేపీ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్న నేతలు ఒకరిద్దరు ఉండగా, ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నేతల పేర్లే వినిపిస్తుండటంతో కమలనాథుల నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి పెంచుతోంది.

రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో బీజేపీ నేతలు పదవులు పండగ చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం దక్కించుకోగా, ముగ్గురు ఎంపీలుగా గెలిచారు. ఇక తెలంగాణకు చెందిన బీసీ నేత క్రిష్ణయ్య కు బీజేపీ కోటలో రాజ్యసభ సీటు దక్కింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం కూడా బీజేపీకి కేటాయించడంతో ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతం ఏపీ బీజేపీలో రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే చాన్స్ కొద్దిమందికే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తోపాటు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి, అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం వంటి కొద్ది మంది మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నేతలుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ఉన్నా, వారిలో సీనియర్లుగా, ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి పదవులను చేపట్టే అనుభవం ఉన్న వారు పెద్దగా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. దీంతో రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని మళ్లీ ఆయనకే కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఓ వైపు జరుగుతున్నా, అది ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో త్వరలో కేంద్ర మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉన్నందున, కేంద్ర మంత్రివర్గంలో చేరే ఇతర రాష్ట్రాల నాయకులకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుుతున్నారు. 2014-19లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా ఓ కీలక నేతకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకున్న అన్నామలైని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చని అంటున్నారు.

Tags:    

Similar News