ఆ నేతలు నన్ను అవమానిస్తున్నారు.. రాజగోపాల్ రెడ్డి సంచలన పోస్ట్..
తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి అత్యంత ఆదరణ కలిగిన నేత. మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బింధువు.;
తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి అత్యంత ఆదరణ కలిగిన నేత. మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బింధువు. కోమటి రెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ పై నోరు పారేసుకున్నారు. తాను రేవంత్ అధ్యక్షుడిగా ఉండగా పని చేయనని పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బైపోల్ ను ఎదుర్కొన్న ఆయన ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2023లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. తనకు మంత్రి పదవి ఇస్తామని వాగ్ధానం చేశారు అందుకే మళ్లీ సొంత పార్టీలోకి వచ్చానని చెప్పుకచ్చారు రాజగోపాల్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి స్థానం లభించలేదు. దీంతో ఆయన చాలా సార్లు చాలా సమావేశాల్లో తన నిరసనను తెలిపారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుందని పార్టీ నాయకులు తలలు పట్టుకునే వారు.
మంత్రి పదవి వాస్తవమేనన్న భట్టి..
రేవంత్ కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న మాట వాస్తవమేనని, కానీ పార్టీ అంతర్గత నిర్ణయం, సామాజిక సమీకరణల వల్ల ఇవ్వలేకపోయామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసేలా చెప్పడంపై భట్టికి ధన్యవాదాలు చెప్పారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉండేందుకు ముఖ్య నేతలు అడ్డుపడుతున్నారని, తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. తాను మంత్రి పదవి కోసం చూడడం లేదని, ఒక వేళ మంత్రి అయితే నా నియోజకవర్గం సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తానని, అందుకే మంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరిస్తూ.. భట్టికి ఎక్స్ వేధికగా ధన్యవాదాలు చెప్పారు.
నియోజకవర్గానికే మేలు జరుగుతుందని పోస్ట్..
ఏది ఏమైనా మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ తో మారోసారి వార్తల్లోకెక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గానికే మేలని చెప్పుకచ్చిన ఆయన తనపై తన సొంత పార్టీ పెద్దలు అనుసరిస్తున్న ధోరణిని ఎండగట్టారు.