అప్పు తీసుకుని లాటరీ టికెట్...దెబ్బకు మారిన కూరగాయల వ్యాపారి ఫేట్
జాతకంలో ఉంటే ఎవరూ అదృష్టాన్ని చెరిపేయలేరు అంటారు. అదే జరిగింది. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు.;
జాతకంలో ఉంటే ఎవరూ అదృష్టాన్ని చెరిపేయలేరు అంటారు. అదే జరిగింది. ఒక సాధారణ కూరగాయల వ్యాపారి ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ దెబ్బకు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. ఇంతకీ ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటి అంటే అప్పు తెచ్చిన అదృష్టం అని చెప్పాలి. ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకుని కొన్న లాటరీ టికెట్ ఆయనను ఏకంగా పదకొండు కోట్లకు అధిపతిని చేసింది.
శాశ్వతంగా దీపావళి :
దీపావళి రోజున లాటరీ టికెట్ కొన్న ఆ ఆసామికి ఇంట్లోనే శాశ్వతంగా దీపావళి వెలుగులు చిందాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దీపావళి బంపర్ లాటరీలో రాజస్థాన్ కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహరా విజేతగా నిలిచి పదకొండు కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చిత్రమేంటి అంటే ఆ విజేత ఎవరో తెలియక నిర్వాహకులు ఎంతో వెతికారు. అయితే తానుగా అమిత్ సెహరా లాటరీ ఆఫీసుకు వచి తన వివరాలు అన్నీ సమర్పించడంతో ఆ సొమ్ముని ఆయనకు అందించారు.
డబ్బుల్లేక లేట్ :
లాటరీ తనకు తగిలిందని తెలుసు. అందుకుంటే కోటీశ్వరుడిని అని తెలుసు. అయినా కూడా ఆ సొమ్ము అందుకోవడానికి లాటరీ ఆఫీసు దాకా రావడానికి కనీసం మాత్రం డబ్బులు లేవు. అందుకే విజేతగా ప్రకటించి చాలా రోజులు అయినా అమిత్ సెహరా రాలేకపోయారు. ఈ విషయం లాటరీ నిర్వాహకులకు అమిత్ సెహెరా చెబుతూంటే వారే షాక్ తిన్నారు. అప్పు చేసి కొనడమేంటి, తీరా విజేత అయినా కూడా రావడానికి ప్రయాణం ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడమేంటి అని వారు ఆశ్చర్యపోయారు. అయితే ఆయన లక్కీ ఫెలో అన్నది వారికి అర్థమైంది ఆఫీసులో అడుగుపెడుతూనే కోటీశ్వరుడు అని కూడా తెలుసు. అందుకే సాదర మర్యాదలు అన్నీ చేసి మరీ విజేత సొమ్ము ఇచ్చారు.
ఇది కదా ఉదారత :
సరే లక్కు తొక్కేశాడు, కోట్లు వచ్చి ఒడిలో పడ్డాయి, రాత్రికి రాత్రి కోటీశ్వరుల జాబితాలోకి చేరిపోయాడు. మరి మనసుని మనీ లాగేయాలి కదా. అక్కడే కూరగాయల వ్యాపారి అమిత్ సెహెరా అందరికీ భలే నచ్చేశాడు. తాను టికెట్ కొన్నందుకు డబ్బులు అప్పు ఇచ్చిన స్నేహితుడిని మరచిపోలేదు, అతని ఇద్దరు కుమార్తెలకు చెరో యాభై లక్షలు ఫిక్సుడు డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకుని తాను ఎప్పటికీ మనిషినే అని రుజువు చేసుకున్నాడు.
బ్యాక్ గ్రౌండ్ ఇదీ :
ఇక అమిత్ సెహెరా బ్యాక్ గ్రౌండ్ చూస్తే రాజస్థాన్ లోని కోటిపుట్ లో కూరగాయలు అమ్ముతాడు. అయితే పంజాబ్ లాటరీతో లింక్ ఏంటి అంటే అక్కడే ఉంది మరో తమాషా. తన బంధువులు పంజాబ్ లోని మొగలో ఉంటారు. వారి ఇళ్లకు వెళ్ళే క్రమంలో దారిలోని భఠిండాలో టీ తాగేందుకు తన స్నేహితుడు ముఖేష్ తో కలసి ఆగాడు, అతని ప్రోత్సాహంతోనే లాటరీ టికెట్ అపుడే అప్పు చేసి కొన్నాడు. ఇక ఫ్రెండ్ వద్ద తీసుకున్నది వేయి రూపాయలు అయితే లాటరీలో వచ్చింది 11 కోట్ల రూపాయలు. ఇక తన ఆనందానికి అవధులు లేవని అమిత్ సెహర అంటున్నాడు. ఈ దెబ్బకు తన కష్టాలు అప్పులు ఇబ్బందులు తొలగిపోయాయని చెబుతున్నారు. దీంతో తాను తన కుటుంబం ఉన్నత స్థానానికి చేరిపోయామని సంబరపడుతున్నాడు.