రేవంత్ సవాళ్ల ‘ఎర’కు కేసీఆర్ చిక్కుతారా?

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజాపాలన - ప్రగతి ఉత్సవాల సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి.

Update: 2026-06-06 07:54 GMT

‘‘కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చ పెడదాం. ఒకవేళ ఆ చర్చలో నేను ఓడిపోతే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు క్షమాపణలు చెబుతా’’

‘‘వచ్చే ఎన్నికల్లో నా సంగతి చూస్తానంటున్న కేసీఆర్ కు పాలమూరు గడ్డపై సవాలు విసురుతున్నా. నిన్ను మళ్లీ మొలకెత్తనివ్వం. మీ పార్టీ జెండాలు ఎగురనివ్వం. గద్దెలు కూలుతాయి. పార్టీ గుర్తును మర్చిపోవాల్సిందే’’

‘‘వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావటం ఖాయం. ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు తథ్యం. వచ్చే ఎన్నికల్లో ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన ఊళ్లలో కేసీఆర్ ఓట్లు అడగాలి. నేను ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఊళ్లల్లో ఓట్లు అడుగుతా. ఇలా చేస్తే కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావు’’

‘‘పాలూమరు ప్రాజెక్టులపై పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వాళ్ల పాపాలు తీరవు. ప్రజలు క్షమించరు’’

‘‘ప్రజలు ఇచ్చిన ధైర్యంతో గల్లీలో ఉండే కేడీతోనైనా.. ఢిల్లీలో ఉండే మోడీతో అయినా కోట్లాడతా. కేసీఆర్ మేకవన్నె పులి అని గుర్తించక రెండుసార్లు ముఖ్యమంత్రి చేశాం. దొంగలకు సద్దులు మోసే వారితో జాగ్రత్తగా ఉండాలి. మన వారైనా అప్రమత్తత అవసరం. వనపర్తిలో ఒకరు.. పాలమూరులో ఒకరు మోపు అయ్యారు’’

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజాపాలన - ప్రగతి ఉత్సవాల సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి. ఎప్పటిలానే ఆయన తరచూ తాను చెప్పే కొన్ని మాటల్ని ఈ సభలోనూ రిపీట్ చేశారు. ఎప్పటిలానే మరోసారి కేసీఆర్ కు సవాలు విసిరారు. గతంలో అసెంబ్లీకి రావాలని తరచూ కోరే ఆయన..ఇటీవల కాలంలో అసెంబ్లీలో చర్చకు రావాలన్న ఛాలెంజ్ చేశారు. గతానికి ఈసారి తేడా ఒక్కటే. అసెంబ్లీలో నిర్వహించే చర్చలో తాను కానీ ఓడితే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు క్షమాపణలు చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీకి రావాలని తరచూ అడిగే రేవంత్.. సవాలు విసిరి.. ఆ వెంటనే క్షమాపణలు కూడా చెబుతానన్న మాటను చూస్తే.. ఏమైనా కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించి.. చర్చల ముగ్గులోకి దించి.. తాను అనాల్సిన మాటల్ని అనేందుకు అవసరమైన వేదికను సిద్దం చేసినట్లుగా కనిపిస్తుంది. కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించేందుకు ఆయన తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేయటం కనిపిస్తుంది. తాజాగా విసిరిన సవాలు.. ‘ఎర’ మాదిరి ఉండటం గమనార్హం. చర్చలో ఓడిపోతే సారీ చెబుతానని చెప్పటం ద్వారా.. ప్రత్యర్థులు స్పందించేలా చేయాలన్న ఆలోచన రేవంత్ మాటల్లో కనిపిస్తోంది.

అయితే.. రేవంత్ ను ముఖ్యమంత్రిగా గుర్తించేందుకు కేసీఆర్ తర్వాత కేటీఆర్ సైతం సిద్ధంగా లేని పరిస్థితి. అలాంటప్పుడు గులాబీ బాస్.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ తో చర్చల సంవాదానికి దిగేందుకు ససేమిరా అనటం ఖాయం. అలాంటి వేళ.. కేసీఆర్ ను చర్చకు తీసుకొచ్చేందుకు తరచూ సవాళ్లు విసురుతున్నారు రేవంత్. ఇదంతా ఎందుకంటే.. ఒక వ్యూహంలో భాగంగానే. ముఖ్యమంత్రి హోదాలో పదే పదే సవాలు విసురుతున్నా.. కేసీఆర్ సారూ ఎందుకు స్పందించరు? ఆయన చేసింది కరెక్టే అయితే.. రేవంత్ సవాలును స్వీకరించి.. చర్చలో పాల్గొని.. రేవంత్ సర్కారు తీరుపైనిప్పులు చెరగాలి కదా? తనపై చేస్తున్న విమర్శలు.. ఆరోపణలకు బలమైన సమాధానం చెప్పాలి కదా? అన్న ఆలోచన ప్రజల్లో కల్పించే ప్రయత్నంలోనే రేవంత్ తరచూ సభకు రావాలని.. తనతో చర్చకు రావాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారంలో ఉన్న రేవంత్ తో తలపడేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరంటున్నారు. రేవంత్ లాంటి నేతతో తమ బాస్ తలపడటం ఏమిటి? అన్నది గులాబీ నేతల మాటగా చెబుతున్నారు. ఏమైనా.. రేవంత్ వేస్తున్న సవాళ్ల ఎరకు కేసీఆర్ చిక్కుతారా? లేదంటే.. ఎప్పటిలానే తనదైన గుంభనంతో అలానే ఉండిపోతారా? అన్నది ప్రశ్న.

Tags:    

Similar News