‘ప్రశ్నించడం మా హక్కు.. ఈ బెదిరింపులు వద్దు!’ నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
మెగా బ్రదర్స్ తో యుద్ధానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మెగా బ్రదర్స్ పై డైరెక్ట్ ఫైట్ కు సిద్ధమవుతున్న సంకేతాలిస్తున్నారు ప్రకాష్ రాజ్.
మెగా బ్రదర్స్ తో యుద్ధానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మెగా బ్రదర్స్ పై డైరెక్ట్ ఫైట్ కు సిద్ధమవుతున్న సంకేతాలిస్తున్నారు ప్రకాష్ రాజ్. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పోటీ చేస్తానంటూ పవన్ చేసిన ప్రకటనపై ట్విటర్ (ఎక్స్) వేదికగా ఘాటుగా స్పందించిన ప్రకాష్ రాజ్ తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ పై విరుచుకుపడ్డారు. లీడర్ ను ఫాలో అవ్వండి అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కు కౌంటరుగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ప్రశ్నించడం మా హక్కు.. బెదిరింపులు వద్దు అంటూ ప్రకాష్ రాజ్ హెచ్చరించారు.
నాగబాబు ట్వీట్ సంచలనం
ఎక్స్ వేదికగా నాగబాబు, ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ ఫైట్ హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో జనసేన పార్టీ వ్యవహారాలపై నాగబాబు ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. అందులో వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ లో మండిపడ్డారు. దీంతో ఈ ఇద్దరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. "నాయకుడి మాటే శాసనం. ఆయన దారిలో ఉన్న దెయ్యాలను, భూతాలను ఎవరూ చూడలేదు, ఆయనొక్కడికే ఏది రైటో, ఏది రాంగో తెలుసు. మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ఎలాంటి ప్రశ్నలు లేకుండా లీడర్‌ను ఫాలో అవ్వండి" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. "నోళ్లు మూసుకుని లీడర్‌ను ఫాలో అవ్వండి" అనే పదంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. దీనినే ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు.
లైన్ లోకి వచ్చిన ప్రకాష్ రాజ్
సాధారణంగానే సమాజంలో జరిగే పరిణామాలపై, రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ప్రకాష్ రాజ్.. నాగబాబు ట్వీట్‌పై కూడా తీవ్రంగా స్పందించారు. నాగబాబును ట్యాగ్ చేస్తూ ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నోరు మూసుకుని పనిచేయమనడంలో మీ ఉద్దేశం అంటూ నాగబాబును ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్న వాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయిందా?" అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో నిలదీశారు. ప్రజస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, నాయకులు సమాధానం చెప్పి తీరాల్సిందేనని ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి’ అంటూ ఆయన వాడిన పదాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు.