పాలు కల్తీకి కారణమేంటి? దర్యాప్తులో సంచలన విషయాలు!

రాజమహేంద్రవరంలో కల్తీ పాలన ఘటనపై సంచలన సమాచారం బయటకు వస్తోంది. అమృతం లాంటి పాలు విషంగా మారడానికి కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు, వైద్యాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.;

Update: 2026-02-24 06:15 GMT

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనపై సంచలన సమాచారం బయటకు వస్తోంది. అమృతం లాంటి పాలు విషంగా మారడానికి కారణాలు ఏంటన్న కోణంలో పోలీసులు, వైద్యాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఘటనకు కారణమైన వరలక్ష్మి డెయిరీ యజమాని గణేష్ ను రాజమండ్రి పోలీసుస్టేషన్ లో విచారించారు. ఈ నెల 15 రాత్రి ఏం జరిగింది? 16న పాలు సరఫరా చేసిన తర్వాత వాటిన సేవించిన వారు ఎందుకు అనారోగ్యానికి గురయ్యారన్న అంశాలపై అధికారులు ఫోకస్ చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం, బాధితుల రక్త నమూనాల్లో లభించిన సమాచారం ప్రకారం ఘటనపై ఓ నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు.

రాజమహేంద్రవరం ఘటనకు పాలు కల్తీ జరగడమే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కల్తీ ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రమాదవశాత్తూ పాలు లో ఏమైనా కలిసిందా? అనేది తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. విశాఖ ల్యాబ్ నుంచి పాలు కల్తీపై ఈ రోజు సాయంత్రానికి నివేదిక వస్తుందని అంటున్నారు. అయితే నిందితుడు గణేష్ ను విచారించిన సమయంలో ఇచ్చిన సమాచారం పాలు కల్తీకి కారణం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. పాలును నిల్వ చేసిన ఫ్రిడ్జిలో కూలెంట్ ఆయిల్ లీకైన మరునాడు ఘటన జరిగినట్లు నిందితుడు గణేష్ అధికారుల విచారణలో వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 15 వరలక్ష్మి డెయిరీలోని శీతలీకరణ కేంద్రంలో కూలెంట్ లీకై ఓ క్యాన్ లో కలిసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ప్రతిరోజూ తాను మూడు క్యానులలో పాలను సేకరిస్తానని గణేష్ పోలీసులకు తెలిపాడు. ఈ నెల 15న రాత్రి కూలెంట్ ఆయిల్ లీకై ఉండొచ్చని, అది గుర్తించకుండా మరునాడు అతడు పాలను సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. మూడు క్యానుల్లో పాలు ఉండగా, ఒక దాంట్లో కూలెంట్ ఆయిల్ కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఈ పాలను సేవించిన వారు అస్వస్థతకు గురై ఉండొచ్చని అంటున్నారు. కూలెంట్ లీకైన విషయాన్ని 17వ తేదీన తాను గుర్తించినట్లు నిందితుడు గణేష్ తెలిపాడని అంటున్నారు.

అయితే శీతలీకరణ కేంద్రంలో కూలెంట్ గా వాడుతున్న ఇథలీన్ గ్లైకాల్ కారణంగానే ఈ దుష్పరిమాణం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ ను కార్లు, ట్రక్కులు, హెచ్.వీ.ఏ.సీ సిస్టమ్స్, పరిశ్రమల్లోని చిల్లర్ లలో వినియోగిస్తారు. డీ-ఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ప్లూయిడ్, పెయింట్స్, ప్లాస్టిక్, పాలిస్టర్ ఫైబర్లలోనూ దీనిని వాడతారని చెబుతున్నారు. కానీ, ఆహారంగా తీసుకునే డెయిరీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఇథలీన్ గ్లైకాల్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదని అంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఫుడ్ గ్రేడ్ ప్రొపైలీన్ గ్లైకాల్ ను వినియోగిస్తారని చెబుతున్నారు. అయితే ఖర్చు తక్కువ అనే ఉద్దేశంతో కొన్ని డెయిరీల నిర్వాహకులు ప్రొఫైలీన్ గ్లైకాల్ కి బదులుగా ఇథలీన్ గ్లైకాల్ ను వాడుతుంటారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. వరలక్ష్మీ డెయిరీలోనూ కూలెంట్ గా ఇథలీన్ గ్లైకాల్ వాడటం వల్లే పాలు విషంగా మారాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇథలీన్ గ్లైకాల్ అత్యంత ప్రమాదకర రసాయనమని అధికారులు వివరిస్తున్నారు. 100 నుంచి 200 మిల్లీ లీటర్ల పరిణామంలో మనిషి శరీరంలోకి ఇది చేరితే ప్రాణాంతకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం మూడు దశల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పదార్థాలు తీసుకున్న 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు మత్తుగా ఉంటుందని, తలనొప్పి వికారం వాంతులు నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అదేవిధంగా 12 గంటల తర్వాత మెటబాలిక్ యాసిడోసిస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక మూడో దశలో ఒక రోజు తర్వాత మూత్ర పిండాలు దెబ్బతిని మూత్ర రావడం నిలిచిపోతుందని వివరిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఇవే లక్షణాలతో ఐదుగురు మరణించినట్లు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలు చేదుగా ఉన్నాయని బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన అధికారులు వరలక్ష్మీ డెయిరీలో తనిఖీలు చేయగా, ఇథలీన్ గ్లైకాల్ లీకైన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News