అమృతమా? కాలకూట విషమా?.. తెల్లటి పాల వెనుక నల్లటి నిజాలు

గోదావరి తీరాన పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఇలాంటి 'తెల్లటి విషం' వ్యాపారం సాగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది.;

Update: 2026-02-23 14:38 GMT

రాజమహేంద్రవరంలో వెలుగుచూసిన కల్తీ పాల ఉదంతం కలకలం రేపుతోంది. గోదావరి తీరాన పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఇలాంటి 'తెల్లటి విషం' వ్యాపారం సాగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. కల్తీ పాలు తాగిన నలుగురు ఇప్పటికే మరణించగా, మరో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. అదేసమయంలో కల్తీ పాలు తాగిన బాధితులు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక వైద్య శిబిరాల్లో బారులు తీరుతున్నారు. వైద్య పరీక్షల నివేదిక కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ప్రతి ఉదయం మన గుమ్మం ముందు వినిపించే పాలవాడి పిలుపు ఆరోగ్యానికి నాంది అనుకుంటాం. ఇంటిల్ల పాది మొత్తం పాలవాడు తెచ్చే పాలతోనే రోజును ఆరంభిస్తుంటారు. వృద్ధులు, పిల్లలు ఒకరేంటి ప్రతి ఇంటా పాలు లేనిదే రోజు గడవని పరిస్థితి. అంత ముఖ్యమైన పాలను విషంగా మార్చి విక్రయించడానికి మించిన నేరం లేదని అంటున్నారు. అమృతంలా భావించి మనం తాగే ఆ కప్పు టీ కాలకూట విషంగా మారి మన ప్రాణాలను కబళించే స్థితిలో ఉంటే.. ఆ భయాన్ని మాటల్లో వర్ణించగలమా? తెల్లటి పాల వెనుక దాగున్న నల్లటి నిజాలు షేక్ చేస్తున్నాయి.

రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో పాలు కల్తీపై మరోసారి విస్తృత చర్చ జరుగుతోంది. వ్యాపారంలో లాభాల కోసం కొందరు చేస్తున్న పాపమే కల్తీ పాల వ్యాపారంగా చెప్పవచ్చు. పాలను చిక్కగా చేసేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే రసాయనాలు శరీరంలోని ముఖ్య అవయవాలను దెబ్బతీస్తన్నాయి. రాష్ట్రంలో డెయిరీలకు సరఫరా చేస్తున్న పాలలో సైతం ఇలాంటి కల్తీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలను కల్తీ చేసేందుకు వ్యాపారులు వాడుతున్న సరుకులు భీతి గొలుపుతున్నాయి. గతంలో వెలుగు చూసిన కొన్ని ఉదంతాల్లో పాలను ఎలా కల్తీ చేస్తున్నారో గుర్తించారు.

కల్తీ పాలలో ఎన్నో రకాలు

పాలను నురగ వచ్చేలా చేసేందుకు యూరియా, డిటర్జెంట్స్ లిక్విడ్ సోపులను వాడుతున్నట్లు చెబుతున్నారు. ఇవి కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన వారు ముందుగా అస్వస్థతకు గురయ్యారు. గంటల వ్యవధిలోనే వారి కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులకు మూత్రం నిలిచిపోవడం గమనిస్తే పాలలో ఖచ్చితంగా యూరియా కలిసి వుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాలు విరిగిపోకుండా కొందరు ఫార్మాలిన్ కలుపుతుంటారని చెబుతున్నారు. నిజానికి ఇది శవాలను కుళ్లిపోకుండా ఉంచేందుకు వాడే రసాయనంగా చెబుతున్నారు. ఇది శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో పాలు కల్తీ వల్ల 87 శాతం మంది క్యాన్సర్ ముప్పు ఎదుర్కొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లోనే హెచ్చరించింది. ఇక కొందరు సింథటిక్ మిల్క్ తయారు చేస్తూ యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారని అంటున్నారు. యూరియా, కాస్టిక్ సోడా, శుద్ధి చేసిన నూనె కలిపి ఈ పాలు తయారు చేస్తుంటారని అంటున్నారు. ఇవి విషంతో సమానం. గుండె సంబంధిత వ్యాధులను కలిగించడమే కాకుండా అధిక రక్తపోటుకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాల కల్తీని కొద్దిపాటి జాగ్రత్తలతో ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చని చెబుతున్నారు.

కల్తీని గుర్తించడం ఎలా?

పాలలో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోవడానికి చిట్కాలు ఉన్నట్లే.. రసాయనాలతో తయారుచేసిన పాలను కూడా ఇంట్లోనే తేలిగ్గా గుర్తుపట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో గచ్చుపై ఒక చుక్క పాలను వేయడం ద్వారా పాలు స్వచ్ఛమైనవా కాదా అని తేలికగా తెలుసుకోవచ్చని అంటున్నారు. పాలు స్వచ్ఛమైనవి అయితే, అవి నెమ్మదిగా కదులుతూ వెనుక ఒక తెల్లటి గీతగా ఉంటుందని, అదే కల్తీ చేసిన పాలు అయితే, ఎటువంటి గీత లేకుండా వేగంగా కిందకు జారిపోతాయని అంటున్నారు. అదేవిధంగా పాలల్లో డిటర్జెంట్ లేదా సోప్ వాటర్ కలిపితే అవి విషపూరితంగా మారుతాయి. దీనిని గుర్తు పట్టడానికి ఒక గాజు గ్లాసులో కొద్దిగా పాలను తీసుకుని అంతే మోతాదులో నీరు కలిపి, వాటిని బాగా షేక్ చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దట్టమైన నురుగు వచ్చి, అది చాలా సేపటి వరకు తగ్గకపోతే అందులో డిటర్జెంట్ కలిపినట్లుగా అనుమానించాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా యూరియా కలిపిన పాలు రుచిని మార్చవు కానీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని అంటున్నారు. ఒక స్పూన్ పాలను తీసుకుని అందులో అర స్పూన్ సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే పాలలో యూరియా ఉందా? లేదా? అన్న విషయం తేలిపోతుందని చెబుతున్నారు. కందిపప్పు పొడి కలిపిన తర్వాత అందులో ఎర్రటి లిట్మస్ పేపర్ ఉంచాలని, ఆ పేపర్ నీలం రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్లు అర్థం చేసుకోవాలని అంటున్నారు. అదేవిధంగా సింథటిక్ పాలును కూడా ఇంట్లోనే తేలిగ్గా గుర్తించవచ్చని అంటున్నారు. సింథటిక్ పాలుగా అనుమానం వస్తే వెంటనే ఆ పాలను అరచేతిలో పోసుకుని బాగా రుద్దడం ద్వారా కల్తీని గుర్తించవచ్చని అంటున్నారు. పాలలో సోపు తగిలినట్లు జిగటగా అనిపిస్తే అవి సింథటిక్ పాలు అని గుర్తించాలని చెబుతున్నారు. అదేవిధంగా సింథటిక్ పాలు వేడి చేసిన తర్వాత పసుపు రంగులోకి మారిపోతాయని, ఇటువంటి పాలను అస్సలు సేవించకూడదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News