30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు.. ఎందుకో? అన్నది ఎవరో తెలుసా?

కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉందని ఆరోపించారు.

Update: 2024-04-28 08:25 GMT

తెలంగాణ రాజకీయాలను మొన్నటివరకు కుదిపేసిన అంశం ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ ట్యాపింగ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని.. ప్రతిపక్ష నేతల కదలికలను పసిగిట్టి వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు ట్యాపింగ్ ను ఓ ఆయుధంగా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ట్యాపింగ్ ను సీరియస్ గా తీసుకుంది. ఓ దశలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పడు ఆయన ఇంటి సమీపంలోనే ట్యాపింగ్ కోసం ఏర్పాట్లు చేశారనే కథనాలు వచ్చాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ట్యాపింగ్ చేసి.. బీఆర్ఎస్ నేతలు పోలీసు వాహనాల్లో డబ్బులు తరలించారని, ఈ డబ్బున ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వినియోగించారనే అభియోగాలూ వినిపించాయి.

30 మంది పాత్ర ఉందా..?

నవంబరు ఆఖరులో జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 3న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. కాగా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రమేయం ఉందని ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి, పోలీసుల వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లి పంచి గెలిచిన విషయం బయటపడిందని పేర్కొన్నారు. త్వరలోనే వీరిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కేసులో కేసీఆర్, హరీశ్రావు కూడా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. ముప్పై మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగానే.. జనగామలో కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఎమ్మెల్యే అవుతారని రాజగోపాల్రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని కోరారు.

Read more!

బీఆర్ఎస్ ను బతకనివ్వం బీఆర్ఎస్ను బతికి బట్టకట్టనిచ్చేదే లేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేళ్లు కేసీఆర్ దోచుకుతిన్నదంతా కక్కిస్తామన్నారు. కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలని, ఎక్కువ మాట్లాడితే బొక్కలో వేస్తామని హెచ్చరించారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవిత తీహార్ జైల్లో ఉందని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

గులాబీ పార్టీకి మిగిలేదెందరు?

బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీకి మిగిలింది 36 మంది. ఇందులో 30 మందిపై అనర్హత వేటు పడుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముగ్గురే మిగులుతారు అన్నమాట. ఈ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావేనా? చూద్దాం.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అవుతాయో?

Tags:    

Similar News