రాజాసింగ్ ఆ పార్టీలోకి...కమలానికి షాకిచ్చేలా ?

ఇక గోషామహల్ ప్రజలతో మమేకం అయ్యే రాజాసింగ్ పక్కా హిందూత్వవాది. ఆయనలో దూకుడు ఎక్కువ. అందుకే పార్టీలో అత్యధికులకు ఆయన పడని వారిగా మారారు.;

Update: 2025-07-11 17:30 GMT

బీజేపీకి రాజా సింగ్ తలనొప్పిగా మారారా. ఆయనను పార్టీ నుంచి వదిలించేసుకున్నామని భావించవచ్చు కానీ ఆయన మాత్రం రేపటి రోజున ప్రత్యర్థిగా నిలిచి బీజేపీ రాజకీయాన్ని తనదైన శైలిలో దెబ్బతీయనున్నారా అంటే అవును అని అంటున్నారు. రాజాసింగ్ బీజేపీలో 2014 ఎన్నికలకు ముందు చేరి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారు. హ్యాట్రిక్ రికార్డు అన్న మాట.

నిజానికి బీజేపీలో అలా గెలిచిన వారు తక్కువే అని అంటారు. గోషామహల్ ని బీజేపీకి పెట్టని కోటగా మార్చింది రాజాసింగ్ అని అంటారు. అంతకు ముందు ఆయన 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఆయన 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి కార్పోరేటర్ గా తొలి పర్యాయంలోనే నెగ్గారు. అలా 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా పనిచేశారు. ఇక రాజాసింగ్ గోషామహల్ లో జన్మించినా ఆయన పూర్వీకులు అంతా ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. అలా వారంతా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు.

ఇక గోషామహల్ ప్రజలతో మమేకం అయ్యే రాజాసింగ్ పక్కా హిందూత్వవాది. ఆయనలో దూకుడు ఎక్కువ. అందుకే పార్టీలో అత్యధికులకు ఆయన పడని వారిగా మారారు. ఇకపోతే బీజేపీతో పేచీ తెచ్చుకున్న రాజాసింగ్ అయితే తనను బీజేపీకి దూరం చేశారు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా తన రాజీనామా ఆమోదంపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా రాజాసింగ్ స్పందించారు.అందులో తాను హిందుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని ఆయన స్పష్టం చేశారు. ఏ పదవి, అధికారం ఆశించి రాజీనామా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గళం వినిపిస్తూనే ఉంటానని రాజాసింగ్ ట్వీట్ చేశారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు, రాత్రి పని చేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పని చేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి, నిజాయితీతో పని చేస్తాను. నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను. జై శ్రీ రామ్ అంటూ రాజాసింగ్ ట్వీట్ లో స్పష్టం చేశారు.

ఇక రాజాసింగ్ తన గళం వినిపిస్తూ ఉంటాను అని చెప్పడంతో ఆయన రాజకీయం ఆలోచనలు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజా సింగ్ రాగానే తన నిర్ణయం ప్రకటిస్తారు అని అంటున్నారు. ఆయన శివసేనలో చేరుతారు అని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేన బీజేపీకి ప్రత్యర్థిగా ఉంది. అక్కడ శివసేనను పక్కన పెట్టారు. చీల్చారు, అయితే పూర్వ వైభవం కోసం శివసేన కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఠాక్రే బ్రదర్స్ కలిసారు. మహా రాజకీయంలో మళ్లీ శివసేన ఊపందుకుంటుంది అన్న భావాన్ని పంపించారు.

ఇపుడు తెలంగాణా గడ్డ మీద కూడా శివసేన తన సత్తా చాటాలని చూస్తోంది అంటున్నారు దాంతో వీర హిందూత్వ అయిన రాజా సింగ్ ని పార్టీలోకి తీసుకుంటుంది ఆయనకే బాధ్యతలు అప్పగిస్తుంది అని అంటున్నారు. రాజాసింగ్ తొందరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శివసేన నుంచి గోషామహల్ లో పోటీకి దిగుతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే బీజేపీకి భారీ షాక్ తప్పకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే రాజాసింగ్ కి అక్కడ మంచి ఆదరణ ఉంది. ఇప్పటిదాకా ఆయన ఓటమి చూడలేదు. ఒకవేళ ఆయన గెలవకపోయినా ఓట్ల చీలిక ద్వారా బీజేపీకి భారీ నష్టం చేకూరుస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News