రాజాసింగ్ రాజీనామా ఆమోదం.. వాట్ నెక్ట్స్?
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కి చేసిన రాజీనా మాను అధిష్టానం ఆమోదించింది.;
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కి చేసిన రాజీనా మాను అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్.. రాజాసింగ్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా బహిరంగ లేఖ రాశారు. రాజీనామాకు సంబంధించి.. చేసిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించినట్టు దీనిలో పేర్కొన్నారు. అయితే.. సదరు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమకు లభించలేదని తెలిపారు.
దీంతో రాజాసింగ్ చేసిన ఆరోపణలను కొట్టి పారేస్తున్నట్టు బీజేపీ అధిష్టానం పేర్కొంది. ఈ క్రమంలో రాజా చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఈ ఆమోదం తక్షణమే అమల్లోకి వస్తుందని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. ఇక, నుంచి పార్టీకి-రాజాసింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా.. గత నెల 30న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుం డా తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీకి అప్పటి వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన.. కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పిం చారు. పనిలో పనిగా పార్టీపైనా నిప్పులు చెరిగారు. సైద్ధాంతికతను.. హిందూత్వను వదిలేస్తున్నారని.. రాజా సింగ్ ఆరోపించారు. సిఫారుసులతో పదవులు కట్టబెడుతున్నారని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను నామినేషన్ వేసేందుకు ఎందుకు అనుమతించలేదో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇలా.. రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడంతోపాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారు.
ఏం జరుగుతుంది?
1) ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. మహారాష్ట్రలోని శివసేన శాఖను హైదరాబాద్‌కు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రాజాసింగ్‌ను అధ్యక్షుడిని చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర లో శివసేన రెండు ముక్కలై.. బాల్ ఠాక్రే వారసుడు.. ఉద్దవ్ ఠాక్రే వర్గంగా కొనసాగుతున్న శివసేనను తెలంగాణలో విస్తరిస్తే.. దానికి రాజాసింగ్ ప్రెసిడెంట్ అయ్యే చాన్స్ ఉంది.
2) ఆర్ ఎస్ ఎస్‌కు కరడుగట్టిన సైనికుడుగా ఉన్న రాజాసింగ్.. బీజేపీని వదిలి వేసినా.. ఆర్ ఎస్ ఎస్‌లో కొనసాగుతారు. కాబట్టి.. ఆయన బంధం కొనసాగుతుంది.
3) బీజేపీని ఇంతకన్నా ఎక్కువగానే తిట్టిపోసి బయటకు వచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారు. అయితే.. తర్వాత కాలంలో వారిని అవసరాల ప్రాతిపదికగా.. పార్టీలోకి మళ్లీ తీసుకున్నారు. సో.. ఈ ఫార్ములా రాజాసింగ్కు కూడా అప్లయ్ అయ్యే అవకాశం లేకపోలేదు.