రాజాసింగ్‌కు ప‌గ్గాలా? బీజేపీలో త‌లోమాట‌!

దేశ‌వ్యాప్తంగా ఒకేసారి 9 రాష్ట్రాల్లో బీజేపీ ఆయా రాష్ట్రాల అధ్య‌క్షుల‌ను మార్చుతోంది. కొంద‌రికి కొన‌సాగే అవ‌కాశం కూడా క‌ల్పించ‌నుంద‌నే చ‌ర్చ సాగుతోంది.;

Update: 2025-06-29 05:34 GMT

దేశ‌వ్యాప్తంగా ఒకేసారి 9 రాష్ట్రాల్లో బీజేపీ ఆయా రాష్ట్రాల అధ్య‌క్షుల‌ను మార్చుతోంది. కొంద‌రికి కొన‌సాగే అవ‌కాశం కూడా క‌ల్పించ‌నుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. దేశ‌వ్యాప్తంగా నిర్దేశిత రాష్ట్రాల్లో బీజేపీ చీఫ్‌ల‌కు సంబంధించి సంస్థాగ‌త ఎన్నిక‌లను నిర్వ‌హిస్తారు. దీనికి ఎవ‌రైనా పోటీ చేయొచ్చు. సోమ‌వారం దీనికి సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. అదే రోజు `చీఫ్‌` ప‌ద‌విని కాంక్షిస్తున్న‌వారు.. నామినేష‌న్ దాఖ‌లు చేసుకునే అవ‌కాశం ఉంది. దీంతో ఆశావ‌హులు ఆగ‌మేఘాల‌పై రెడీ అవుతున్నారు.

ఇలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర బీజ‌పీ ప‌గ్గాల కోసం ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోటీ ప‌డాల‌ని భావిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. నేను పోటీ చేస్తా! అని కూడా ప్ర‌క‌టించారు. అంతేకాదు.. త‌న‌ను ఎవ‌రూ కాద‌న‌లేర‌ని.. ఎమ్మెల్యేగా ఉన్న వారిని పోటీ చేయ‌కూడ‌ద‌ని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని కూడా రాజా వ్యాఖ్యానించారు. తన నామినేష‌న్ ప‌త్రాల‌ను తానే స్వ‌యంగా అందించ‌నున్న‌ట్టు కూడా రాజా సింగ్ ప్ర‌క‌టించారు. ఇక్క‌డితో కూడా ఆగ‌కుండా.. ప్ర‌స్తుత చీఫ్ కిష‌న్ రెడ్డిపైనా కామెంట్లు చేశారు.

త‌న‌ను కిష‌న్ రెడ్డే నామినేట్ చేస్తే సంతోషిస్తాన‌ని రాజా సింగ్ చెప్పారు. తాను నామినేష‌న్ వేయ‌డం ఖాయ‌మ‌ని కూడా వెల్ల‌డిం చారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న కిష‌న్ రెడ్డికి ఇప్ప‌టికే చాలా రోజులు పొడిగింపు ఇచ్చారు. గ‌తంలో బండి సంజ‌య్ చీఫ్ గా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. కిష‌న్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో రెండు బాధ్య‌త‌లు ఆయ‌న‌కు ఇబ్బందిగా మార‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించ‌నున్నారు. మ‌రోవైపు.. ఈ సీటును సొంతం చేసుకునేందుకు.. మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. అదేస‌మ‌యంలో గ‌తంలో రాష్ట్ర అధ్య‌క్షుడిగా చేసిన ల‌క్ష్మ‌ణ్ కూడా ఈ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలావుంటే.. అస‌లు రాజాసింగ్ ప్ర‌క‌ట‌న‌పై సొంత పార్టీ నాయ‌కులు ఏమ‌నుకుంటున్నార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. రాజానా? అంటూ.. ఒక‌రిద్ద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌ను పార్టీ చీఫ్ చేస్తే.. రోజుకో కేసు.. పూట‌కో పోలీసు స్టేష‌న్ చుట్టూ తిర‌గాల్సి ఉంటుంద‌ని మ‌రికొంద‌రు నాయ‌కులు ఆఫ్ దిరికార్డుగా వ్యాఖ్యానించారు. రాజాసింగ్ ఉంటే బీజేపీ పూర్తిగా హిందూత్వ అజెండాను అమ‌లు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌నికొంద‌రు అంటే.. అంత హిందూత్వ అయితే.. రాష్ట్రంలో క‌ష్ట‌మ‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. ఇలా.. రాజాసింగ్‌కు ప‌గ్గాల‌పై త‌లోమాట మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News