ఏకైక- హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. రాజాసింగ్ దారెటు.. కాంగ్రెస్-బీఆర్ఎస్?
2014లో తెలంగాణలో గెలిచిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజాసింగ్.. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.;
2014లో తెలంగాణలో గెలిచిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజాసింగ్.. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో 2018లో గెలిచిన ఏకైక బీజేపీ శాసనసభ్యుడైన రాజాసింగ్ ఇప్పుడు కమలం పార్టీకి దూరమయ్యారు. మరి ఆయన దారులు ఎటు...?
2023లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. వారిలో రాజాసింగ్ ఒకరు. మిగతావారికంటే ఈయన భిన్నం.. ఎందుకంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే. బహుశా తెలుగు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే ఈయనేనేమో...? లేదా ఆ ఒకరిద్దరిలో రాజాసింగ్ ఒకరేమో?
పాతబస్తీలో గోషామహల్ నుంచి మూడోసారి గెలిచిన రాజాసింగ్ బీజేపీకి రామ్ రామ్ చెప్పారు. మజ్లిస్ పార్టీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తూ వస్తున్న రాజాసింగ్ మరిప్పుడు ఏం చేస్తారు? స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటారా? లేక బీఆర్ఎస్ లో చేరుతారా? అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజాసింగ్ బీజేపీ శాసనసభా పక్ష నేత పదవిని ఆశించారు. కానీ, కొన్ని అంశాల ప్రాతిపదికన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అండదండలు ఉన్నప్పటికీ రాజాసింగ్ కు నిరాశ తప్పలేదు. అప్పటినుంచి పార్టీతో ఆయన అంటీముట్టనట్లు ఉంటున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. హైదరాబాద్ నియోజకవర్గంలో మహిళను నిలిపినా మద్దతు కూడా ప్రకటించలేదు.
రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా? అనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని పలుసార్లు ప్రశంసించారు. మరోవైపు రాజాసింగ్ బీఆర్ఎస్ వైపు మొగ్గడానికి అవకాశం తక్కువే. ఆ పార్టీకి రాజాసింగ్ దూరం అన్నట్లుగానే ఉంటుంది వ్యవహార శైలి.
ఈ రెండూ కూడా కాకుండా రాజాసింగ్ బీజేపీలోనే కొనసాగే చాన్సులు ఎక్కువ. ఆయనపై ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యల కేసులు ఉన్నాయి. అందులోనూ పాతబస్తీలో నెగ్గాలంటే రాజాసింగ్ కు బీజేపీ వంటి పార్టీనే అవసరం. అటు బీజేపీకి కూడా రాజాసింగ్ ను వదులుకునే ఉద్దేశం ఉండదు. కాబట్టి ఆయనను బుజ్జగించి పార్టీలోనే కొనసాగించే అవకాశాలే అధికం.