రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి ?

ఎవరీ రాజారెడ్డి అని ఆశ్చర్యపోనవసరం లేదు. వైఎస్సార్ కుటుంబంలోనే కొత్త తరం యువకుడు అని గుర్తుకుంచుకుంటే చాలు.;

Update: 2025-09-08 11:00 GMT

ఎవరీ రాజారెడ్డి అని ఆశ్చర్యపోనవసరం లేదు. వైఎస్సార్ కుటుంబంలోనే కొత్త తరం యువకుడు అని గుర్తుకుంచుకుంటే చాలు. నిజానికి రాజారెడ్డి అంటే వైఎస్సార్ తొలి తరం పేరు గుర్తుకు వస్తుంది. వైఎస్సార్ కి ఆయన తండ్రి. అయితే ఆ పేరుతో వైఎస్సార్ కి ఒక మనవడు ఉన్నాడు. వైఎస్ షర్మిల కుమారుడే ఈ రాజారెడ్డి. ఇపుడు నవతరం ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాజారెడ్డి అడుగు పెడుతున్నారు అన్న ప్రచారం అయితే చక్కర్లు కొడుతోంది. తన తల్లి ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారానే అరంగేట్రం చేయడానికి రాజారెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు. దానికి శుభారంభంగా తల్లి షర్మిలతో కలసి రాజారెడ్డి కర్నూల్ కి వస్తున్నారు అని అంటున్నారు.

నాల్గవ తరం ఎంట్రీ :

వైఎస్సార్ ఫ్యామిలీలో తొలి తరంలో రాజారెడ్డి రాజకీయాల వైపు నడిచారు. ఆయన పులివెందుల సర్పంచ్ గా పనిచేశారు. ఆయన సతీమణి వైఎస్సార్ తల్లి కూడా పులివెందుల సర్పంచ్ గా చేశారు. ఇక వైఎస్సార్ ని రాజకీయాల్లో ప్రోత్సహించింది రాజా రెడ్డి అని చెబుతారు. వైఎస్సార్ వారసుడిగా జగన్ 2009లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయడంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక వైఎస్సార్ తనయ షర్మిల కూడా భారీ పాదయాత్ర నిర్వహిస్తూ వైఎస్సార్ పార్టీ కోసం పనిచేయడం ద్వారా 2013లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత ఆమె తన అన్న వైఎస్ జగన్ ని తో విభేదించి 2021లో వైఎస్సార్ టీపీని ఏర్పాటు చేశారు. 2023లో దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి 2024 జనవరిలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆమె కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు.

తల్లితో కలిసి రావడంతో :

రాజారెడ్డి విషయానికి వస్తే అమెరికాలో చదువుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి వివాహం జరిగింది. తన తల్లితో కలిసి తాత వైఎస్సార్ వర్ధంతికి జయంతికి ఆయన ఇడుపులపాయలో పెద్దాయన సమాధి వద్ద నివాళి అర్పిస్తూ కనిపిస్తారు అంతకు మించి ఆయన రాజకీయంగా ఏమీ సందడి చేసింది లేదు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తల్లితో కలసి తొలిసారి రాజకీయ కార్యక్రమానికి రాజా రెడ్డి హాజరు అవుతున్నారు అంటే దాని మీదనే అతి పెద్ద చర్చ సాగుతోంది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటేనే వారసులు ఎవరైనా ఈ వైపుగా తొంగి చూస్తారు. అలాంటిది షర్మిలతో పాటు వస్తున్నాడు అంటే ఆ యువకుడికి కూడా రాజకీయ అభిలాష ఉందని అంటున్నారు.

అమ్మమ్మ విజయమ్మ దీవెనలతో :

ఇక కర్నూల్ మార్కెట్ యార్డు వద్ద ఉల్లి రైతులను పరామర్శించేందుకు పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల వస్తున్నారు. ఆమెతో పాటుగా హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి రాజారెడ్డి బయలుదేరారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే తన అమ్మమ్మ విజయమ్మ దీవెనలు ఆయన తీసుకోవడం. బయటకు వచ్చి మరీ విజయమ్మ మనవడిని ఆశీర్వదించారు అంటే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అంటున్నారు. వైఎస్సార్ సతీమణిగా ఆమె దీవెనలతో యువనేతగా ఎదిగేందుకు రాజారెడ్డి రంగంలోకి దిగబోతున్నారు అని అంటున్నారు.

గత కొంతకాలం నుంచే :

ఇపుడు అయితే బయటకు వచ్చింది కానీ గత కొంతకాలంగానే రాజారెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయం అయితే చర్చగా ఉందని చెబుతున్నారు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కుటుంబానికి మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఆ పార్టీ నుంచే రాజారెడ్డి తన రాజకీయ అరంగేట్రం చేస్తారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఏపీలో ప్రస్తుతం ఇబ్బంది పడుతోంది. సరైన ప్రజాకర్షణ శక్తి ఉంటే పార్టీ తిరిగి పుంజుకుంటుంది అని అంటున్నారు. షర్మిల తన శక్తి మేరకు పనిచేస్తున్నా యువ తేజంగా కుమారుడు రంగంలో ఉంటే మరింతగా జనంలోకి పార్టీ వెళ్తుందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ షర్మిల వైసీపీ నుంచి అన్న జగన్ నుంచి దూరం జరిగి సొంత పార్టీ పెడతారు అని ఒక టీడీపీ అనుకూల మీడియా అప్పట్లో రాసిన వార్త నిజం అయింది. ఇపుడు అదే మీడియా రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం కచ్చితంగా ఉంటుందని చెబుతోంది అంటే ఇది కూడా జరిగి తీరుతుందని అంటున్నారు. మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఈ ఫ్యాక్టర్ ని కూడా ఉపయోగించుకుంటారు అని అంటున్నారు.

Tags:    

Similar News