చమటోడుస్తున్న రాహుల్...గాంధీల కొత్త హిస్టరీ !

రాహుల్ గాంధీ గాంధీల వంశంలో ఐదవ తరం వారసుడు. మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ లో కీలక నేతగా గత శతాబ్దంలో ఉండేవారు. ఆయన వారసుడిగా కుమారుడు జవహర్ లాల్ రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగారు

Update: 2026-10-06 18:02 GMT

రాహుల్ గాంధీ గాంధీల వంశంలో ఐదవ తరం వారసుడు. మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ లో కీలక నేతగా గత శతాబ్దంలో ఉండేవారు. ఆయన వారసుడిగా కుమారుడు జవహర్ లాల్ రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగారు. ఈ దేశానికి ప్రధానిగా పదిహేడేళ్ళ పాటు పనిచేశారు. ఇక నెహ్రూ కుమార్తె శ్రీమతి ఇందిరా గాంధీ తండ్రికి తగిన తనయగా ఆ వారసత్వాన్ని నిలిపారు. పదహారేళ్ల పాటు దేశాన్ని ఆమె ప్రధానిగా ఏలారు, ఉక్కు మహిళగా పేరు గడించారు.

రాజీవ్ హయాంలోనూ :

రాజీవ్ గాంధీ నాలుగో తరం గాంధీల వారసుడు, ఆయన అయిదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. వీరందరిలో ప్రతిపక్షంలో ఉన్నది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే. ఇక ఇందిరమ్మ మూడేళ్ళ పాటు ఉంటే రాజీవ్ రెండేళ్ళు ఉన్నారు. అయితే వారంతా అధికార పక్షం మీద పోరాటం చేశారు. కానీ కఠిన పరీక్షలు అయితే ఎదుర్కోలేదు, పైగా వారు అంతకు ముందు అందలాలు అందుకుని మాజీ ప్రధానులుగా ట్యాగ్ లైన్ తో విపక్షంలోకి వచ్చారు.

రాహుల్ ది రాళ్ల బాట :

ఇక తన తండ్రి నాయనమ్మలతో పోలిస్తే రాహుల్ ది రాళ్ల బాటగానే చెప్పాల్సి ఉంటుంది. ఆయన నిజానికి రాచబాటలో నడవాల్సిన గాంధీ వంశీకుడు. ఎందుకో రాహుల్ గాంధీ ఆరంభంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలంగా ప్రధాని కాలేకపోయారు. గత పుష్కర కాలంలో మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ని ఓట్లను సీట్లను పెంచుకుంటూ వెళ్తున్నా రాహుల్ ముందు ఇంకా కష్టాల దారులు ఎన్నో ఉన్నాయి. పైగా ఆయన ఉన్న ప్రస్తుత రాజకీయ శకం క్లిష్టమైనది గా ఉంది. కాంగ్రెస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. దాని మూలాలు అన్నీ కరిగి ఇపుడు కొస మెరుపులు మెరుస్తున్న వేళ రాహుల్ సారధ్యం అందుకోవడమే గమనార్హం.

కఠోరమైన శ్రమగా :

గాంధీ వంశీకులు అంటే ప్రధాని పీఠం వారి కోసమే వేచి ఉంటుంది అన్నది ఒక రాజకీయ నానుడు. వారు పుట్టిందే సీటు అందుకోవడానికి అన్నట్లుగా రాజకీయం సాగుతూ వచ్చింది. అయితే రాహుల్ గాంధీ విషయంలో మాత్రం అది రివర్స్ లో నడుస్తోంది. అందుకే రాహుల్ గాంధీ దేశంలో తొలి రాజ్యాంగబద్ధమైన పదవి అయిన లోక్ సభలో అపొజిషన్ లీడర్ స్థాయి అందుకోవడానికి పదేళ్ళు పట్టింది. ఇక రాహుల్ గాంధీకి బీజేపీ నరేంద్ర మోడీ నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ లో ఆయన నాయకత్వం నిరూపించుకోవడం ఒక పరీక్షగా ఉంటే మిత్ర పక్షాల మధ్యన నేతగా వెలిగి నిలవడం మరో పరీక్ష. మొదటి పరీక్షలో రాహుల్ నెగ్గారు. కాంగ్రెస్ కి ఆయన డైనమిక్ లీడర్ గా ఈ రోజున కనిపిస్తున్నారు. ఇండియా మిత్రుల మెప్పు అందుకోవాల్సి ఉంది. ఈ రెండోది పూర్తి అయితే కనుక ఎన్డీయే మీద ఆయన చేసే యుద్ధంలో కీలక మలుపుకి చేరుకుంటారని అంటున్నారు.

ఎండల్లో సైతం :

ఇక గాంధీ వంశీకులు ఎవరూ చేయని విధంగా రాహుల్ గాంధీ భారీ పాదయాత్ర చేశారు. దేశంలో అనేక ప్రాంతాలను తిరిగారు. అంతే కాదు ఆందోళనలను వరసగా చేస్తున్నారు. తాజాగా చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో ఆయన నిరసన కార్యక్రమాలను చేపట్టారు. గంటల పాటు ఎర్రటి ఎండలో చేసిన ఈ నిరసన రాహుల్ కి సరికొత్త అనుభవంగా ఉంది. గతంలో ప్రధాని ఇంటి వద్ద మెరుపు నిరసన చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన ముక్కుకు గాయం అయింది అని రాహుల్ చెప్పారు. ఇపుడు కూడా ఢిల్లీలో ఆందోళన నేపధ్యంలో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఇలా అరెస్టులు నిరసనలు తోపులాటలు నినాదాలు అన్నీ కూడా రాహుల్ గాంధీ నడుస్తున్న రాజకీయ దారులలో కఠిన పరీక్షలుగానే చూస్తున్నారు. మరి ఈ పోరాటాలకు ఫలితం ఉంటుందా అంటే దానికి జనాలు తీర్పునే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News