కెనడాలో ఇండియాలోలాగా రెచ్చిపోతే.. ఈ భారతీయ మహిళకు ఎంత గతి పట్టిందంటే?
కెనడా వీధుల్లో 'మన ఊరి పంచాయితీ' ఫార్ములాను అమలు చేయబోయి.. చట్టం తీగ లాగితే ఐఫోన్ ఊడినంత పని చేసుకుంది ఒక భారతీయ మూలాల మహిళ.
కెనడా వీధుల్లో 'మన ఊరి పంచాయితీ' ఫార్ములాను అమలు చేయబోయి.. చట్టం తీగ లాగితే ఐఫోన్ ఊడినంత పని చేసుకుంది ఒక భారతీయ మూలాల మహిళ. "నన్ను వీడియో తీస్తావా రౌడీ?" అంటూ స్వదేశీ స్టైల్లో ఫోన్ లాక్కొని.. బ్యాక్‌ప్యాక్ పట్టుకుని లాగితే సరిపోతుందనుకుంది పాపం.. కానీ అక్కడున్నది మన దేశపు వీధి చివర వీధి రౌడీలు కాదు... పద్ధతిగా అరెస్ట్ చేసి పక్కన కూర్చోబెట్టే కెనడా పోలీసులు. "నేను పబ్లిక్‌లో ఉంటే నన్ను వీడియో తీయడం నేరం" అని అక్కడ ఆర్డర్లు వేస్తే చెల్లదని తెలియక పైగా కార్‌కి సరిగ్గా ఇన్సూరెన్స్ కూడా లేకుండా రోడ్డుపై హంగామా చేసి... చివరికి చట్టం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. 'మన దగ్గరైతే చూసుకుందాం' అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌కి.. కెనడా కెమెరాలకి మధ్య జరిగిన ఈ రోడ్డు రచ్చ... విదేశాల్లో ఉంటూ "నాకు ఈ రూల్స్ తెలీవ్" అని కవర్ చేసే బ్యాచ్‌కి ఒక పర్ఫెక్ట్ ఐ ఓపెనర్..
విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ స్థానిక చట్టాలపై అవగాహన ఉండటం అత్యంత ఆవశ్యకం. మన స్వదేశంలో సాధారణంగా అనిపించే కొన్ని చర్యలు విదేశీ వీధుల్లో తీవ్రమైన చట్టపరమైన సమస్యలకు దారితీస్తాయి. ‘మన ఊరి పంచాయితీ’ ఫార్ములాను కెనడా రోడ్లపై అమల్లోకి తెస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నిరూపించే ఘటన తాజాగా కెనడా దేశంలోని కాల్గరీ నగరంలో చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న ఓ మహిళ రోడ్డుపై పాదచారితో ఘర్షణకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే వాహనంలో ప్రయాణిస్తున్న మహిళ ఆమెతో ఉన్న వ్యక్తి రోడ్డు దాటుతున్న పాదచారికి దారి ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై సదరు పాదచారి నిలదీయడమే కాకుండా ఆధారాల కోసం తన మొబైల్ ఫోన్‌లో రికార్డింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ వాహనం దిగి బహిరంగ ప్రదేశంలో తనను వీడియో తీయడం నేరమని వాగ్వాదానికి దిగింది. అంతటితో ఆగకుండా బాధితుడి ఫోన్‌ను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి అతడి బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని లాగుతూ శారీరక ఘర్షణకు పాల్పడింది. సమాచారం అందుకున్న కెనడా పోలీసులు వెంటనే స్పందించి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పట్ల భౌతిక దాడికి దిగడం, రవాణా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఆ వాహనానికి సరైన ఇన్సూరెన్స్ కూడా లేదన్న ఆరోపణలపై సమగ్ర విచారణ ప్రారంభించారు.
ఈ సంఘటన కెనడాలో నివసించే కొత్త వలసదారులు, విద్యార్థులు.. ఉద్యోగులకు ఒక పర్ఫెక్ట్ ఐ ఓపెనర్ అని చెప్పవచ్చు. కెనడా, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో రోడ్డు దాటే పాదచారులకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి డ్రైవర్లు తప్పనిసరిగా వాహనాన్ని నిలిపి వారికి దారి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఘటనలను కెమెరాలో బంధించడం అక్కడ చట్టబద్ధమే తప్ప నేరం కాదు. ఒకవేళ ఎవరైనా వీడియో తీస్తున్నారన్న కోపంతో వారిపై దాడి చేయడం లేదా ఫోన్ లాక్కోవడం తీవ్రమైన క్రిమినల్ ఆఫ్‌న్స్ కిందకు వస్తుంది.
ఏదేమైనా విదేశాల్లో ఉన్నప్పుడు "నాకు స్థానిక నిబంధనలు తెలీవు" అని చెప్పడం చట్టం ముందు రక్షణగా నిలవదు. రోడ్డుపై ఎలాంటి వివాదం తలెత్తినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా శాంతంగా ఉండటం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడమే సురక్షితమైన మార్గం. స్వదేశంలో ఉన్న సామాజిక అలవాట్లతో ప్రవర్తిస్తే తీవ్రమైన కేసులు, జైలు శిక్ష లేదా దేశం నుంచి పంపించివేసే డిపోర్టేషన్ ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.