జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందేనా ?
కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటు అయింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా దీనిని రూపొందించారు.
కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటు అయింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా దీనిని రూపొందించారు. ఇక దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52 మధ్యలో జరిగాయి. ఇప్పటిదాకా దేశంలో 18 దాకా లోక్ సభ ఎన్నికలను నాలుగు వందల దాకా శాసన సభ ఎన్నికలను నిర్వహించింది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, రాజ్యసభలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు, శాసన మండళ్లు, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు సైతం ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుకుమార్ సేన్ వ్యవహరించారు.
ఏకైక మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్:
ఇప్పటిదాకా చూస్తే ఇరవై ఆరు మంది దాకా ప్రధాన ఎన్నికల కమిషనర్లు పనిచేశారు. ఏకైక మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఏపీకి చెందిన వీఎస్ రమాదేవి 1990 లో కేవలం కొన్ని రోజులు మాత్రమే పనిచేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి వీరిని నియమిస్తారు. ఇక ప్రస్తుతం జ్ఞానేశ్ కుమార్ భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన 2025 ఫిబ్రవరి 19న బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఉంటుంది. వీటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. అలా చూసుకుంటే జ్ఞానేశ్ కుమార్ 1964 జనవరి 27న జన్మించారు. ఈ లెక్కన ఆయనకు 2029 జనవరిలో 65 ఏళ్లు నిండుతాయి. అందువల్ల ఆయన పదవీ కాలం 2029 జనవరి 26 వరకు ఉంటుంది. అంటే కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో 2029 లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి.
వచ్చే ఏడాది ఆరు :
ఇదిలా ఉంటే దేశంలో వచ్చే ఏడాది అంటే 2027 లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలతో పాటు అదే ఏడాది చివరలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 2028లో చూస్తే మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. 2028లో తెలంగాణ, కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే రానున్న రెండేళ్ళలో మొత్తం 13 రాష్ట్రాల సాసనసభలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దేశంలో ఈ రోజున 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో సగానికి సగం ఈ రెండేళ్ల మధ్యలోనే ఎన్నికలకు వెళ్తున్నాయి. మరి ఇటువంటి కీలక సమయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. తక్షణం తప్పుకోవాలని కోరుతున్నాయి.
నింద అనుకున్నా కూడా :
ఇపుడు దేశంలో చూస్తే అంతటా సర్ ప్రక్రియ సజావుగా లేదని విమర్శలు ఉన్నాయి. దాంతో పాటు 13 కోట్ల ఓట్లు పోవడం అంటే చిన్న విషయం కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పునాది అయిన కేంద్ర ఎన్నికల సంఘం మీద విపక్షాల విమర్శలతో జనంలోనూ చర్చ సాగుతోంది. ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటి రాజ్యాంగ సంస్థ మీద అనుమానాలు ఉన్నపుడు నిజంగా నిష్పాక్షికంగా నిర్వహించినా కూడా విమర్శలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గేది ఉండదు, అది కాస్తా ఎన్నికల మీద కూడా జన విశ్వాసం సడలించేదిగా ఉంటుంది అని ప్రజాస్వామ్య ప్రియులు మేధావులు అంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా జ్ఞానేశ్ కుమార్ హుందాగా తప్పుకోవడమే బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.
ఎలా ఎందుకంటే :
ముందే చెప్పుకున్నట్లుగా ఈ దేశంలో సీఈసీలుగా అనేక మంది పనిచేశారు. కానీ ఎవరి మీద ఈ తరహా అనుమానాలు కానీ ఆరోపణలు కానీ రాలేదు, మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ జ్ఞానేశ్ కుమార్ మీద వచ్చాయి. దాంతో దేశంలో ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల క్రెడిబిలిటీ ముఖ్యం అని అంతా భావిస్తున్నారు. మరి ఈ సమయంలో సీఈసీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్నది చర్చగా ఉంది.