418 రోజల్లో 100 కోట్ల ప్రయాణాలు.. స్త్రీశక్తిలో అరుదైన మైలురాయి, కానీ.. వీటి సంగతేంటి?

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం అరుదైన మైలురాయిని చేరుకుంది. పథకం ప్రవేశపెట్టిన నుంచి నేటి వరకు వంద కోట్ల ప్రయాణాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2026-10-06 16:17 GMT

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం అరుదైన మైలురాయిని చేరుకుంది. పథకం ప్రవేశపెట్టిన నుంచి నేటి వరకు వంద కోట్ల ప్రయాణాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2.40 కోట్ల మంది మహిళలు ఉండగా, ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలకు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్త్రీశక్తి కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు చూపిన వారికి ఫ్రీ టికెట్స్ ఇవ్వగా, ఆ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.3,550 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం కలిగిందని ప్రభుత్వం చెబుతోంది.

ఇక స్త్రీశక్తి పథకం వంద కోట్ల మైలు రాయిని చేరుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విటర్లో ఆనందం వ్యక్తం చేశారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే మహిళల జీవితాల్లో ఈ పథకం ఒక భాగమైపోయినట్టు అర్థమవుతోందని సీఎం వ్యాఖ్యానించారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందని అన్నారు. అదేవిధంగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా స్త్రీశక్తి విజయవంతం అయిందని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీకి బూస్ట్

స్త్రీశక్తి పథకం ఆర్టీసీకి ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా ప్రయాణికుల తరఫున ప్రభుత్వమే రవాణాఖర్చులు చెల్లిస్తుండటంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.3,550 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం కలగగా, ఆ మేరకు డబ్బు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోందని అంటున్నారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు నెలకు రూ.160 కోట్ల చొప్పున ఖర్చు అవుతోందని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఆర్టీసికి సుమారు రూ.2,160 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరినట్లుగా చెబుతున్నారు.

సమస్యల మాటేమిటి?

స్త్రీశక్తితో మహిళలు భారీగా లబ్ధి పొందారని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఆర్టీసీకి మంచి ఆదాయం వచ్చిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కానీ, ఇదే సమయంలో ఆర్టీసీ ప్రయాణికులను వేధిస్తున్న సమస్యలను గాలికి వదిలేశారన్న విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఇదే సమయంలో బస్సుల ఆక్యుపెన్సీకన్నా రెట్టింపు ప్రయాణికులతో తిరగాల్సివస్తోందని అంటున్నారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు రద్దీ వల్ల సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోయిందని, సమయపాలన పాటించడంలో బస్సు సర్వీసులు విఫలం అవుతున్నాయనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నట్లుగా చెబుతున్నారు.

లాభమా? నష్టమా?

స్త్రీశక్తి పథకంతో ప్రభుత్వానికి మేలు జరిగిందా? లేదా? అంటే కచ్చితమైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. బస్సుల కొరత, సమయపాలన లేకపోవడం, డ్రైవర్, కండక్టర్లపై ఒత్తిడి పెరిగిపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఆదాయార్జనతో ఖుషీగా ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరచిపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకేసారి నాలుగైదు బస్సులు రావడం లేకపోతే గంటా రెండు గంటల వరకు బస్సు సర్వీసులు లేకపోవడం వంటి సమస్యలతో మహిళా ప్రయాణికులలోనూ అసంతృప్తి కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక స్త్రీశక్తి వచ్చిన తర్వాత మెజార్టీ ప్రయాణికులైన పురుషులు ఆర్టీసీ బస్సులు ఎక్కడమే మానేశారని అంటున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణ పథకం వల్ల తమ ఉపాధికి భంగం కలిగిందని ఆటో డ్రైవర్లు నిందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఆర్టీసీ బస్సు సర్వీసుల రాకపోకలపై నియంత్రణ, పర్యవేక్షణ ఉంటే పథకం మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News