అమరావతి పనులు జెట్ స్పీడ్ లోనే !

అమరావతి రాజధాని మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని మీద ఫోకస్ పెట్టింది.

Update: 2026-10-06 18:00 GMT

అమరావతి రాజధాని మళ్ళీ పూర్వ వైభవాన్ని అందుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని మీద ఫోకస్ పెట్టింది. మొదటి రోజు నుంచి అమరావతి రాజధాని విషయంలో తీసుకుంటూ వస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఇపుడు అమరావతి ఒక రూపుకీ షేపుకీ వస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో టార్గెట్ పెట్టుకుంది. 2028 నాటికి మొదటి దశ నిర్మాణం పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని. కీలకమైన నిర్మాణానాలు ఆనాటికి పూర్తి అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని పనుల విషయంలో సమీక్షలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. పనులు శరవేగంగా పూర్తి కావాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు.

నెలకు రెండు వేల కోట్లు :

ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పనులపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో నెలకు రెండు వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మరింత వేగం పెంచాలని కూడా సూచించారు. అనుకున్న టైం కి పనులు పూర్తి కావాలని బాబు కోరారు. అమరావతిలో ప్రస్తుతం చేపడుతున్న పనుల విషయంలో కచ్చితమైన కాల పరిమితి ఉండాలని కూడా సూచించారు.

రోజుకు 41 వేల మంది :

ఇదిలా ఉంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా జరిగిందో లేదో తెలియదు కానీ రోజుకు అమరావతిలో నిర్మాణ పనులలో ఏకంగా 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంతే కాదు అమరావతి రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టులలొ వీరంతా పాలు పంచుకుంటున్నారు. ఇక గత నెలలో రాజధానిలో ఒక వేయి 345 కోట్ల రూపాయల విలువైన నిర్మాణం పనులు జరిగాయి. అయితే ఈ వేగం కానీ ఖర్చు కానీ ఇంకా సరిపోదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. వీటిని నెలకు రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకువెళ్లాలని చంద్రబాబు కోరారు.

ఔటర్ రింగ్ రోడ్డు తో :

ఇక అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు సమాంతరంగా అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ ప్రాజెక్ట్ కోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని కూడా బాబు సూచించారు. రాజధాని పనులలో ఎక్కడా అశ్రద్ధ నిర్లక్ష్యం లేకుండా వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేయడం విశేషం. అంతే కాకుండా ఐకానిక్ భవనాల నిర్మాణాల విషయంలో ఎక్కడా పనులు ఆలస్యం జరగడానికి వీల్లేదని బాబు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేశారు. అలాగే సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం ఐకానిక్‌గా ఉండాలని ఆయన సూచించారు. ఇక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తరహాలోనే నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. 152 ప్రాజెక్టులు 41 వేల మంది కార్మికులు నెలకు రెండు వేల ఖర్చుతో సాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణం ఒక మహా యజ్ఞాన్ని తలపిస్తోంది అని అంటున్నారు. వందల ఏళ్ళ పాటు చెప్పుకునేలా భావి తరాలకు అభివృద్ధి నమూనాగా అమరావతిని డిజైన్ చేస్తున్నారు.

Tags:    

Similar News