శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ గాంధీ ఫోటో వివాదం: బీహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!

బీజేపీ, జేడీయూ పార్టీలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. "శానిటరీ ప్యాడ్‌లపై రాజకీయ నాయకుల ముఖాలు వేయడం ఎంతవరకు సబబు?" అని ప్రశ్నిస్తున్నాయి.;

Update: 2025-07-05 16:24 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరోగ్య ఆధారిత ప్రచారం పెద్ద వివాదంగా మారింది. "ప్రియదర్శిని ఉడాన్ యోజన" కింద ఉచితంగా పంపిణీ చేస్తున్న శానిటరీ ప్యాడ్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రాన్ని ముద్రించడం తీవ్ర దుమారానికి దారితీసింది.

రాహుల్ ఫోటోపై విమర్శల వెల్లువ

బీజేపీ, జేడీయూ పార్టీలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. "శానిటరీ ప్యాడ్‌లపై రాజకీయ నాయకుల ముఖాలు వేయడం ఎంతవరకు సబబు?" అని ప్రశ్నిస్తున్నాయి. జేడీయూ అధికార ప్రతినిధి నితీష్ కుమార్ మాట్లాడుతూ "మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన సమయంలో, ఆ గౌరవానికి చిహ్నమైన ఉత్పత్తులపై తమ నేతల ముఖాలను ముద్రించి కాంగ్రెస్ వారు మహిళల ఆత్మగౌరవాన్ని తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారు" అని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి "ఇది మహిళల్ని అవమానించినట్లే" అని ఎక్స్‌ వేదికగా స్పందించారు.

కాంగ్రెస్ వివరణ

అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మహిళలకు నెలసరిలో ఎదురయ్యే శారీరక, మానసిక ఇబ్బందులపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, ఇందులో రాజకీయ ప్రయోజనాలేవీ లేవని స్పష్టం చేసింది. "మేము మహిళల ఆరోగ్యానికి శ్రద్ధ వహిస్తున్నాము. రాహుల్ గాంధీ ఈ సమస్యపై చర్చించేందుకు భయపడే నేత కాదు. మహిళలతోపాటు నిలబడి వారి సమస్యలపై పరిష్కారం చూపాలనే మా అభిప్రాయం" అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

-'మై బహన్ మాన్' యోజన – ఉద్దేశ్యమేంటి?

ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రూ.2,500 నగదు సహాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనివల్ల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించగలరని, వారి ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ఉన్న సమాచారం ప్రకారం, ఇది "మై బహన్ మాన్ యోజన" అనే కార్యక్రమం ఒక భాగం.

-'ప్యాడ్ మ్యాన్' సినిమా స్ఫూర్తి?

అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' సినిమా స్ఫూర్తితో మహిళల రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రాహుల్ గాంధీ బొమ్మను ఉంచడం వల్ల ఇది స్వచ్ఛమైన ఆరోగ్య ప్రచారంగా మిగలకుండా రాజకీయ విమర్శలకు ఆహ్వానం ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీహార్ ఎన్నికల్లో మహిళల ఓటు కీలకం. కాంగ్రెస్ ఈ అంశాన్ని గుర్తించి ముందడుగు వేసినప్పటికీ, రాజకీయ గుర్తింపు కోసం ప్రచార ప్యాకేజింగ్ తప్పుదారి పట్టినట్లు అనిపిస్తోంది. ఆరోగ్యంపై చర్చ జరగాలి కానీ అది నాయకుల ప్రమోషన్ వేదికగా మారకూడదన్న విమర్శలు అందరూ ఆలోచించవలసిన విషయం. మహిళల ఆరోగ్యంపై చర్చ అవసరం, శానిటరీ ప్యాడ్ పంపిణీ వంటి ప్రయత్నాలు అభినందనీయం. కానీ, వాటిని రాజకీయ హంగులతో మలచడం మహిళల గౌరవాన్ని తక్కువ చేయడమేనని విమర్శకుల వాదన. ప్రజల స్పందన, మహిళల అభిప్రాయం ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీకి బీహార్‌లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News