బీజేపీ చేతికి బ్లాంక్ చెక్...రాహుల్ మాటల్లో అంతరార్థం ?
| డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వడం బీజేపీకి ‘బ్లాంక్ చెక్’ ఇచ్చినట్లేనని రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచి ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. అసోం, జమ్మూకశ్మీర్‌లో అమలు చేసిన ‘ప్యాక్ అండ్ క్రాక్’ వ్యూహాన్ని మళ్లీ ప్రయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ డీలిమిటేషన్ మీద సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. బీజేపీ డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు ఆమోదించుకోవాలనుకుంటోంది, దాని వెనక ఉన్న ఆలోచనలు ఏమిటి అన్నది రాహుల్ గాంధీ తమదైన వ్యూహాలతో కూడిన అవగాహనతో వివరించారు. డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం అంటే బీజేపీ చేతికి బ్లాంక్ చెక్ రాసి ఇవ్వడమే అని రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక్కసారి అది ఇచ్చేశాక ఏమైనా జరగవచ్చు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ బ్లాంక్ చెక్ అన్న మాటను ఏ ఉద్దేశ్యంతో రాహుల్ వాడారు అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది.
బీజేపీ ఏమైనా చేస్తుంది :
బీజేపీ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం తరువాత ఏమైనా చేస్తుంది అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుతో పాటు లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచే యోచనన మీద తాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. నిజానికి బయటకు కనిపిస్తుంది మహిళా రిజర్వేషన్ల బిల్లు అని, కానీ అసలు ఉద్దేశ్యాలు వేరు అని రాహుల్ గాంధీ అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇప్పటికే పార్లమెంటు ఆమోదం లభించిందని ఆయన గుర్తు చేశారు. అలా దానిని ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే తక్షణమే అమలు చేయవచ్చని రాహుల్ పేర్కొన్నారు. దానితో డీలిమిటేషన్ కి ముడిపెట్టి ఉన్న 543 సీట్లను 850కి పెంచడం ద్వారా బీజేపీ తనకు అనుకూలంగా దేశ ఎన్నికల మ్యాప్‌ను మార్చుకోవాలని చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందువల్లనే బ్లాంక్ చెక్ గా ఇచ్చిన అందరి మద్దతుతో ఏమైనా చేస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ప్యాక్ అండ్ క్రాక్ వ్యూహం :
ఇదే సందర్భంలో రాహుల్ మరో మాట కూడా అన్నారు. ప్యాక్ అండ్ క్రాక్ వ్యూహంగా దానిని ఆయన అభివర్ణించారు. ఈ వ్యూహాన్ని బీజేపీ గతంలో అసోం, జమ్మూకశ్మీర్‌లలో జరిగిన పునర్విభజనలో అమలు చేసిందని గుర్తు చేశారు. ఒకే నియోజకవర్గంలో లక్షలాది మంది ఓటర్లను మరో చోటికి మార్చడం, భౌగోళిక సంబంధం లేని ప్రాంతాలను కలిపి సరిహద్దులను విడగొట్టడం వంటి పద్ధతుల వల్ల జమ్మూ కాశ్మీర్ , అసోంలో బీజేపీకి లబ్ధి చేకూరేలా చేశారని ఆరోపించారు ఇప్పుడు కూడా అదే తరహాలోనే ఒక నియోజకవర్గంలోని ఓటర్లను మరో చోటికి మార్చడం, సంబంధం లేని ప్రాంతాలను కలపడం ద్వారా విపక్షాలను దెబ్బతీసే ప్రయత్నం డీలిమిటేషన్ బిల్లు ద్వారా జరుగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక డీలిమిటేషన్ కమిషన్ స్వరూపం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రభుత్వ నామినీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇక కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం లేకుండా చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దెబ్బ తీస్తారు అంటూ :
ఇదే విధంగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాక దేశ ఎన్నికల మ్యాప్ ని బీజేపీ తనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకునే వెసులుబాటుని కలిగి ఉంటుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని లోక్ సభ నియోజకవర్గాల సరిహద్దులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే బీజేపీ ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుందని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. ఒక చిత్రకారుడి చేతికి ఖాళీ కాన్వాస్ ఇస్తే నచ్చిన బొమ్మ గీసుకున్నట్లుగ బీజేపీకి 850 సీట్లతో మొత్తం దేశ ఎన్నికల మ్యాప్‌ను ఇష్టానుసారంగా మార్చే వెసులుబాటు లభిస్తుందని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు, వర్గాలను బలహీనపరిచేందుకు, విపక్ష నాయకులను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ సరిహద్దుల మార్పును వాడుకుంటారని ఆయన దేశంలోని రాజకీయ పార్టీలను అన్నింటికీ హెచ్చరించారు.