వైసీపీ ఎంపీకి సాయిరెడ్డి 'ఫోన్ ఇన్విటేషన్'.. !
| వైసీపీకి చెందిన ఓ ఎంపీ కుటుంబాన్ని పరివర్తన్ రాజనీతి పార్టీ (పీఆర్పీ)లోకి ఆహ్వానిస్తూ విజయసాయిరెడ్డి ఫోన్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి వస్తే అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్లు ఓ కీలక నేత వెల్లడించారు. అయితే ఈ వార్తపై విజయసాయిరెడ్డి లేదా సదరు ఎంపీ స్పందించాల్సి ఉంది. ఆ కుటుంబం వైసీపీని వీడే అవకాశాలపై చర్చ సాగుతోంది.
``వైసీపీ నుంచివచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తాం.`` అని ఆ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, పరివర్తన్ రాజనీతి పార్టీ(పీఆర్ పీ) అధ్యక్షుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 11న విజయవాడలో పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. అయితే.. బహిరంగంగా ఎవరూ ముందుకు రాలేదు. పీఆర్ పీలో ఇప్పటి వరకు వైసీపీ నుంచి బలమైన నాయకుడు కూడా చేరలేదు. అయితే.. తాజాగా ఓ వార్త వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తమ పార్టీలో ఎంపీగా ఉన్న ఓ నేతకు సాయిరెడ్డి ఫోన్ చేశారని.. కుటుంబంతోపాటు పార్టీలోకి రావాలని ఆహ్వానించా రని చెబుతున్నారు. దీనిలో నిజం ఎంత? అనేది ఇటు సాయిరెడ్డి అయినా చెప్పాలి.. అటు సదరు ఎంపీ అయినా చెప్పాలి. కానీ, సాయిరెడ్డి పిలిచారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఎంపీ కుటుంబం మాత్రం మార్పుదిశగానే అడుగులు వేస్తోందన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. జాతీయ పార్టీ వైపు వీరు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
పార్టీ పరంగా ఈ కుటుంబానికి పెద్దగా మద్దతు లేకపోవడంతోపాటు.. కేసులు చుట్టుముట్టడం, ఇంటా బయట కూడా రాజకీయంగా ఇబ్బందులు వస్తున్న క్రమంలో ఈ ఫ్యామిలీ వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కుటుంబానికి సాయిరెడ్డి ఫోన్ చేశారని.. పార్టీలోకి వస్తే.. ఈ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారని ఓ కీలక నాయకుడు వెల్లడించారు. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.
వదిలేస్తారా.. ?
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వైసీపీలో పుంజుకునే వాతావరణం కనిపించడం లేదు. ప్రజలంతా తమ వెంటే ఉన్నా రని చెబుతున్నా.. ఎన్నికలలో ఆమేరకు ఫలితం రాలేదు. పైగా బలమైన స్థానాలతోపాటు.. కడప వంటి బలమైన జిల్లాల్లోనూ వైసీపీ ఘోరంగా దెబ్బతింది. ఈ పరిణామాలతో కొన్నికుటుంబాలు, కొందరు నాయకులు కూడా.. పార్టీ లో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఈ విషయాన్నే ఇటీవల ఢిల్లీ మీడియా సమావేశంలో సాయిరెడ్డి ప్రస్తావించారు. త్వరలోనే చాలా మంది నాయకులు బయటకు వస్తారని. అన్నారు. ఈ పరిణామాల క్రమంలో సదరు కుటుంబం పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. వ్యక్తిగతంగా బలంగా ఉన్న ఈ కుటుంబం పీఆర్ పీ లోకి వస్తే.. పార్టీకి బలమైన ఊతం లభించినట్టు అవుతుందని సాయిరెడ్డి అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.