వైసీపీలోనే ఇంత ఆశ్చర్యమా... ?
| తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కూటమి హవాలోనూ వెయ్యికి పైగా సర్పంచ్ స్థానాలు దక్కడం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఇంకా పట్టు ఉందనే సంకేతంగా నేతలు భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడానికి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి, విలేజ్ సెంట్రిక్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వైసీపీ యోచిస్తోంది.
ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఎలా ఉందని ఆ పార్టీ నాయకులను అడిగితే.. జారుడు బండపై విన్యాసాలు చేస్తున్నామని చెబుతున్నారు. కానీ.. తాజాగా వచ్చిన గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల రిజల్ట్ తర్వాత.. పార్టీలో కొంత జోష్ కనిపించిందని చెబుతున్నారు. ఇది తామే నమ్మలేకున్నామని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు. దీనికి కారణం.. గ్రామాల్లో వైసీపీకి ఉన్న పట్టు.. ఓటు బ్యాంకు కుదురుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం కావడమేనని చెబుతున్నారు.
గత ఎన్నికల తర్వాత.. వైసీపీ గ్రామీణంవైపు కన్నెత్తి చూడలేదన్నది వాస్తవం. ఏదో ఒకటి రెండు సార్లురైతుల సమ స్యలపై జగన్ స్పందించినా.. గ్రామీణ ఓటు బ్యాంకు, గ్రామీణ సమస్యలను పెద్దగా ప్రస్తావించ లేదు. పైగా.. పార్టీ కార్యక్రమాలు కూడా నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పరిస్థితిలో సహజంగానే గ్రామాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుందని.. స్థానిక ఎన్నికల్లోనే ఘోర పరాజయం చవిచూసిన తర్వాత.. గ్రామాల్లో మాత్రం హవా ఉంటుందా? అని అందరూ అనుకున్నారు.
కానీ, దీనికి భిన్నంగా గ్రామీణ ఓటు బ్యాంకు పుంజుకున్న పరిస్థితి కనిపించింది. భారీస్థాయిలో కాకపోయినా.. ఊహిం చిన దానికంటే కూడా.. ఎక్కువగానే ఇక్కడ పార్టీకి పంచాయతీ స్థానాలు దక్కాయి. ఇప్పుడు న్న కూటమి జోరులో 1000కి పైగా సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం అంటే.. వైసీపీకి నిజంగానే జోష్ ఇచ్చినట్టు అయింది. దీనికి కారణాలు ఏవైనా కూడా.. మున్ముందు.. పార్టీకి అవసరమైన మెజారిటీ ఓటు బ్యాంకుకు గ్రామాలు ఇప్పుడు వైసీపీకి కీలకంగా మారనున్నాయి. దీంతో ఇప్పుడు విలేజ్ సెంట్రిక్ పాలిటిక్స్ వ్యూహాలను కోరుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అయినా.. ప్రస్తుతం జరిగిన గ్రామ ఎన్నికలైనా గ్రామీణ ఓటర్లే ఎక్కువగా వచ్చి ఓటేస్తున్న నేప థ్యంలో.. గ్రామీణ ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా అక్కడి సమస్యలపై దృష్టి సారించే దిశగా పార్టీ పరంగా సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే.. పార్టీ పుంజుకుందన్న విషయం వాస్తవమే అయినా.. ఏయే కోణాలు.. ఏయే అంశాలు దీనికి ప్రభావితం చేశాయి..? మున్ముందు ఏయే అంశాలపై దృష్టి పెట్టాలన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది.