టోల్ ప్లాజాల వద్ద తోల్ తీస్తారు.. నంబర్ ప్లేట్లు దాస్తే 5 రెట్లు జరిమానా
| మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోల్ ప్లాజాల వద్ద టోల్ ఎగ్గొట్టేందుకు నంబర్ ప్లేట్లు కప్పినా, ట్యాంపరింగ్ చేసినా అసలు టోల్ ఫీజుకు ఐదు రెట్లు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఫాస్టాగ్ లేకుండా ఉద్దేశపూర్వకంగా టోల్ చెల్లింపును తప్పించుకునే వారికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఏఎన్‌పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా ఉల్లంఘనలను గుర్తించనున్నారు.
మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము తప్పించుకోవడానికి వాహనాల నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా కప్పిపెట్టినా లేదా ట్యాంపర్ చేసినా ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై అసలు టోల్ ఫీజుకు ఐదు రెట్లు జరిమానా విధించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ జరిమానా అసలు యూజర్ ఫీజు వసూలుకు అదనంగా ఉంటుందని.. వసూలైన జరిమానా మొత్తాన్ని సంబంధిత అథారిటీకి బదిలీ చేస్తామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
టోల్ చెల్లింపును తప్పించుకునే ఉద్దేశంతో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కప్పిపెట్టడం.. మార్చడం.. దాచడం లేదా ఫాస్టాగ్ అతికించకపోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఫాస్టాగ్ గుర్తించని సందర్భాల్లో వాహనం ముందు భాగంలో కానీ.. వెనుక భాగంలో కానీ లేదా రెండు వైపులా రిజిస్ట్రేషన్ నంబర్లను కావాలనే దాచినట్లు రుజువైతే ఈ కఠిన చర్యలు తీసుకుంటారు. కేవలం యూజర్ ఫీజును ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు నిర్ధారణ అయిన కేసుల్లోనే ఈ ఐదు రెట్ల జరిమానా విధిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది.
ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలను పటిష్టమైన, సాంకేతిక ఆధారిత ప్రక్రియ ద్వారా గుర్తిస్తామని అధికారులు తెలిపారు. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో అనేది ఎలాంటి బారియర్లు లేని ఆధునిక ఎలక్ట్రానిక్ టోలింగ్ వ్యవస్థ. ఇందులో రహదారిపై పైన అమర్చిన గ్యాంట్రీ మౌంటెడ్ ఫాస్టాగ్ రీడర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలు వాహనాలను గుర్తించి.. వాహనం ఆగకుండానే ఆటోమేటిక్‌గా టోల్ రుసుమును కట్ చేస్తాయి.
ఈ ఫ్రీ-ఫ్లో వ్యవస్థ వల్ల టోల్ గేట్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం.. ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం- కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ ఆధునిక సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ నంబర్ ప్లేట్లు దాచడం లేదా ఫాస్టాగ్ లేకుండా వెళ్లడాన్ని ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యగా పరిగణిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానం అమలులో ఉన్న అన్ని చోట్ల, అలాగే భవిష్యత్తులో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రతి టోల్ ప్లాజా వద్ద ఈ ఐదు రెట్ల జరిమానా నిబంధన వర్తించనుంది.